సాక్షి, చెన్నై : కొత్త పార్టీ ఆలోచన ఏమోగానీ తోటి నటుడు రజనీకాంత్ పరోక్షంగా చేసిన కొన్ని వ్యాఖ్యలు కమల్ హాసన్ ఇరకాటంలో నెట్టేశాయి. శివాజీ గణేషన్ మెమొరియల్ భవనం, విగ్రహాల ఆవిష్కరణ వేదికపై మాట్లాడుతూ... శివాజీ గణేషన్ రాజకీయ ఫెయిల్యూర్ స్టోరీ గురించి రజనీ ప్రస్తావించిన విషయం తెలిసిందే. కమల్‌పై సెటైర్ వేశాడంటూ అంతా కామెంట్లు చేశారు.
దీంతో కమల్ తమిళ సంచిక వికటన్‌లో ఓ వివరణ ఇచ్చుకున్నాడు. ‘రజనీ వ్యాఖ్యలకు సమాధానం చెప్పాలనుకుంటే, నేరుగా ఆయనకే ఫోన్ చేసి చెప్పవచ్చు కదా? అని కొందరు నన్ను అడగవచ్చు. కానీ, మా మధ్య ఉన్న స్నేహానికి ఆ అవసరం లేదు. ఇప్పుడు నేను వివరణ ఇచ్చుకోవాల్సింది మా మధ్య బంధాన్ని.. ఆ రోజు ఆయన(రజనీ) చెప్పింది అర్థం చేసుకోలేనివారి కోసమే’ అని కమల్ అన్నారు.
ఆ రోజు రజనీ చెప్పింది ఏంటంటే... ‘శివాజీ గణేశన్ నటనతోనే కాదు.. రాజకీయాలపరంగా కూడా మాకు మంచి పాఠం నేర్పించారు. పార్టీ పెట్టి సొంత నియోజకవర్గంలోనే ఓడిపోయారు. అంటే డబ్బు, హోదాతో రాజకీయాల్లో గెలవలేమని, అంతకు మించి ఏదో ఉండాలి. ప్రజలు అది గుర్తించారు. కానీ, అదేంటో కమల్‌కు మాత్రమే తెలుసు. నాకు కూడా చెప్పాలని పలుమార్లు కోరా. కానీ, తనతో చేతులు కలిపితేనే అదేంటో వివరిస్తానని అంటున్నాడు. అయినప్పటికీ కమల్ నాకు సోదరుడి లాంటివాడే’ అని ప్రసంగించాడు. ఇదే విషయాన్ని కమల్ ఇప్పుడు తన ఆర్టికల్‌లో ప్రస్తావించారు కూడా.
ఇక రాజకీయాల్లో గెలవడమంటే... అభ్యర్థులను ఎంపిక చేసి, మెజారిటీతో గెలిచి, ముఖ్యమంత్రి అయిపోవడమేనా? అని కమల్ ప్రశ్నించారు. ప్రజల నమ్మకాన్ని కోల్పోకుండా, వారికి మంచి చేయడం కూడా గెలుపేనని చెప్పారు. రాజకీయ చరిత్రలో మనం గుర్తుంచుకోవాల్సింది అంబేద్కర్ ను మాత్రమేనని కమల్ తెలిపారు. మొత్తానికి తాను కొత్త పార్టీ పెట్టినా భవిష్యత్తులో ఇతర పార్టీలతో పొత్తుల జోలికి పోడని.. రజనీ ముందుకు వస్తే ఆయనతో చేతులు కలిపే సంకేతాలు అందించాడని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment