అక్కడ కత్తులు, ఇక్కడ కౌగలింతలు.. అక్కడ విసవిసలు, ఇక్కడ పకపకలు.. జాతీయ స్థాయిలో టీడీపీ, బీజేపీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి.. కానీ నర్సీపట్నంలో కనిపించిన దృశ్యం అందుకు భిన్నం. ఇక్కడ ఆదివారం జరిగిన కార్యక్రమం అందరినీ ముక్కున వేలేసుకునేలా చేసింది. పైకి వైరం నటిస్తూ.. లోన స్నేహబంధాన్ని కొనసాగిస్తున్న రాజకీయ నాటకమా అన్న వ్యాఖ్యలు వినిపించాయి. ముఖ్యమంత్రి ఆరోగ్యకేంద్రం ప్రారంభోత్సవంలో మాజీ మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాసరావు హల్‌చల్ చేశారు. మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు స్వయంగా మాజీ మంత్రి చేత ఆరోగ్యకేంద్రాన్ని ప్రారంభింప చేశారు.
విశాఖపట్నం, నర్సీపట్నం: ముఖ్యమంత్రి ఆరోగ్యకేంద్రాన్ని మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు.. మాజీమంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాసరావుచే ప్రారంభింపజేయడం సర్వత్రా చర్చనీయాంశమైంది. విశాఖ జిల్లా నర్సీపట్నంలో ఆదివారం జరిగిన కార్యక్రమంలో ప్రొటోకాల్‌ను పక్కన పెట్టిమరీ ప్రారంభోత్సవాన్ని ఓ మాజీ మంత్రిచే చేయించడం ఆసక్తికరంగా మారింది. ఇదంతా ఒక ఎత్తయితే ఆ మాజీ మంత్రి వైద్యశాఖ అధికారులకు సూచనలిస్తూ.. సర్కారు లక్ష్య సాధనకు కృషి చేయాలని జిల్లా వైద్యశాఖాధికారికి ఉద్బోధించడంతో అక్కడున్నవారు నివ్వెరపోయారు. బీజేపీ, టీడీపీల మధ్య వైరం కేవలం మాటల వరకేననీ, తెరవెనుక రెండు పార్టీల మధ్య సాన్నిహిత్యం కొనసాగుతూనే ఉందనడానికి ఇదే నిదర్శనమని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. మరోవైపు, కామినేని బీజేపీని వీడి పచ్చ కండువా కప్పుకోవాలనుకుంటున్నారన్న వార్తలకు ఈ ఘటన బలాన్నిచ్చినట్లయిందని మరికొందరంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment