
సాక్షి, గుంటూరు: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తన కుమారుడ్ని అచ్చోసిన ఆంబోతులా ఊరి మీదకు వదిలారని ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ వ్యాఖ్యానించారు. ఆ ఆంబోతు దొరికిన చోటల్లా దోచేస్తోందని మంత్రి నారా లోకేష్‌ను ఉద్ధేశిస్తూ మండిపడ్డారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తానన్నారని చెప్పి చంద్రబాబు తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తుపెట్టుకున్నారని తెలిపారు. ఇప్పుడు ఏపీ ఎన్నికలకు కాంగ్రెస్‌ను దూరం పెట్టడం వంటి దిక్కుమాలిన రాజకీయాలు చంద్రబాబుకే చెల్లు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ ప్రజల సొమ్ముని దీక్షల పేరుతో చంద్రబాబు దుబారా చేస్తున్నారని తెలిపారు. కేంద్రంపై నిరసన తెలపాలనుకుంటే ఒక్కడే ఢిల్లీ వెళ్లి దీక్ష చేయొచ్చుకదా అని ప్రశ్నించారు. పోలవరాన్ని తాము కట్టిస్తుంటే అది తన ఘనతగా చెప్పుకుంటున్నారని మండిపడ్డారు.
ఈ ఐదేళ్లలో అవినీతి, అక్రమాలు, అరాచకం తప్ప రాష్ట్రాన్ని అభివృద్ధి చేశారా?.. కేంద్ర నిధులతో కట్టిన నిర్మాణాలను మేము చూపిస్తాం, రాష్ట్రం కట్టించిన ఒక్క ప్రాజెక్టునైనా మీరు చూపించగలరా అని ప్రశ్నించారు. చంద్రబాబు సంస్కారహీనుడు కాబేట్టే మోదీ భార్య గురించి మాట్లాడారని చెప్పారు. ప్రధాని రాష్ట్రానికి వస్తే ఆహ్వానించాలన్న కనీస ప్రోటోకాల్ పాటించకుండా.. చంద్రబాబు ఆంధ్రుల పరువు నిలువునా తీశాడంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీకి పది లక్షల కోట్లు ఇచ్చామని గడ్కరీ లెక్కలు చెప్పారని, కాదంటే దీనిపై చర్చకు రావాలంటూ సవాల్ చేశారని వెల్లడించారు. కానీ చంద్రబాబు ముందుకు రాలేకపోయాడని, యూటర్న్ ముఖ్యమంత్రి ఇప్పుడు మతిస్థిమితం లేని ముఖ్యమంత్రి అయ్యారంటూ ఎద్దేవా చేశారు.
Comments
Please login to add a commentAdd a comment