
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడుకు ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ మరో ఐదు ప్రశ్నలు సంధించారు. టీడీపీ ప్రభుత్వ అక్రమాలపై గత కొన్ని వారాలుగా కన్నా బహిరంగ లేఖ ద్వారా చంద్రబాబును ప్రశ్నలు అడుగుతున్న సంగతి తెలిసిందే. ఈవారం కూడా ఆయన అలాగే ఐదు అంశాలపై చంద్రబాబుకు ప్రశ్నలు సంధించారు.
- ‘విశాఖపట్నం మధురవాడలో మీ కుమారుని మిత్రుడైన జి శ్రీధర్ రాజుకు 360 కోట్ల రూపాయల విలువైన భూమిని 25 కోట్ల రూపాయలకు కట్టబెట్టలేదా?. ఏపీఎల్‌ఎమ్‌ఏ, సర్వే నంబర్ 409లో ఉన్న భూమికి ఎకరం విలువ 7.26 కోట్ల రూపాయలుగా నిర్ణయిస్తే.. మీ కేబినెట్ దానిని 50 లక్షల రూపాయల ధర నిర్ణయించలేదా? ఇందులో మీకు, మీ కుమారునికి ముడుపులు అందలేదని చెప్పగలరా’ అని ప్రశ్నించారు.
- ‘వ్యవసాయ రుణాలపై బ్యాంకులు వసూలు చేసే 7 శాతం వడ్డీలో కేంద్రం తన 3 శాతం చెల్లిస్తూండగా, రాష్ట్ర ప్రభుత్వం వాటా 4 శాతాన్ని గత నాలుగేళ్లుగా చెల్లించని మాట వాస్తవం కాదా? దీంతో బ్యాంకులు ఆ మొత్తాన్ని పేద రైతుల నుంచి బలవంతగా వసూలు చేస్తున్న మాట వాస్తవం కాదా? ఆ బకాయిలను ఎప్పటిలోగా చెల్లించి రైతులకు ఉపశమనం కలిగిస్తార’నిప్రశ్నించారు.
- ‘కృష్ణా జిల్లా జగయ్యపేట మండలం జయంతిపురం గ్రామంలో సర్వే నంబర్ 93లోని 499 ఎకరాల కోట్లాది రూపాయల విలువైన భూమిని కారుచౌకగా వీబీసీ ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్‌కు ధారదత్తం చేయలేదా?. ఆ కంపెనీ మీ బావమరిది, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ వియ్యంకునికి చెందినది కాదా? ఈ కేటాయింపులో అవకతవకలు జరగలేదని శ్వేత పత్రం విడుదల చేయగలరా’ అని ప్రశ్నించారు.
- ‘కేంద్రం రాష్ట్రానికి విద్యాసంస్థలు ఇవ్వడం లేదని చెబుతున్న మీరు.. 2016 డిసెంబర్‌లో కేంద్ర మంత్రులు శంకుస్థాన చేసిన ఎస్‌సీఈఆర్‌టీకి ఎందుకు భూమి ఎందుకు కేటాయించలేదో ప్రజలకు వివరించగలరా’ అని ప్రశ్నించారు.
- ‘ప్రకాశం జిల్లాలోని రామాయపట్నం మేజర్ పోర్టుకు ఎప్పుడో రైట్స్ లిమిటెడ్ సంస్థ అనుకూలంగా రిపోర్టు ఇచ్చినా.. ప్రైవేటు రంగంలో మైనర్ పోర్టుకు ఎందుకు నిర్ణయం తీసుకున్నారో ప్రజలకు వివరించగలరా. వెనుకుబడిన ప్రకాశం జిల్లాను అభివృద్ధి చేసే విషయంలో ప్రజలను ఎందుకు మోసం చేస్తున్నార’ని ప్రశ్నించారు.
Comments
Please login to add a commentAdd a comment