
సాక్షి, విశాఖపట్నం : టీడీపీ హయాంలో నాలుకతో కూడా ఇసుకను ఎత్తుకు పోయారని చోడవరం వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ ఎద్దేవా చేశారు. చోడవరం మండలం నర్సాపురం వద్ద ఇసు డిపోను బుధవారం ఎమ్మెల్యే ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఇసుక డిపోతో చోడవరంలో ఇసుక సమస్యలు తీరనున్నాయన్నారు. వర్షాకాలంలో వరదల వల్ల కొంత ఇసుక కొరత ఏర్పడిందని, ఇప్పడు ఆ సమస్య లేదని స్పష్టం చేశారు. ఇసుక విషయంలో ప్రతిపక్షాలు అనవసరంగా రాద్ధంతం చేస్తున్నాయని మండిపడ్డారు. టీడీపీ నాయకులు గంజి లేని స్థితి నుంచి ఇసుక అమ్మకం చేపట్టి బెంజ్ కార్లలో తిరుగుతున్నారని దుయ్యబట్టారు. అలాగే మద్యం అమ్మకాల సమయపాలన వల్ల రాష్ట్రంలో క్రైం రేటు తగ్గిందని తెలిపారు. తెలుగు భాష గురించి మాట్లాడే వ్యక్తులు వారి పిల్లలను మాత్రం ఇంగ్లీష్ మీడియంలో చదివిస్తున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో అనకాపల్లి ఆర్డీఓ సీతారాం రాజు, గనులశాఖ ఏడీ తమ్మినాయుడు, ప్రత్యేక అధికారి అనిత పాల్గొన్నారు.