
సాక్షి, బెంగళూరు : కర్ణాటక ఉప ఎన్నికలకు ఇంకా రెండు రోజుల గడువు మాత్రమే ఉన్న నేపథ్యంలో బీజేపీ అభ్యర్థి ఎల్ చంద్రశేఖర్ పార్టీకి గట్టి షాక్ ఇచ్చారు. పార్టీ నేతలు తన గెలుపునకు కృషి చేయలేదని, ప్రచారం కూడా నిర్వహించకుండా తననో బలిపశువును చేయాలని చూస్తున్నారని ఆరోపిస్తూ పోటీ నుంచి విరమించుకున్నట్లు తెలిపారు. అంతేకాకుండా ఈ ఎన్నికలో తాను జేడీఎస్- కాంగ్రెస్ కూటమి అభ్యర్థి అనితా కుమారస్వామికి మద్దతు తెలుపుతున్నట్లు పేర్కొన్నారు. ఈ క్రమంలో అనితా కుమారస్వామి గెలుపు నల్లేరు మీద నడకే కానుందని కూటమి నేతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై స్పందించిన సీఎం కుమారస్వామి మాట్లాడుతూ.. ప్రలోభాలకు గురిచేసి విజయం సాధించాలనుకోవడం బీజేపీ నైజమని వ్యాఖ్యానించారు. అయితే ఒక్కోసారి వారి వ్యూహాలు ఇలాగే బెడిసి కొడతాయని ఎద్దేవా చేశారు.
కాగా ఇటీవల జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి జేడీఎస్- కాంగ్రెస్ కూటమి అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. చెన్నపట్నం, రామ్‌నగర స్థానాల నుంచి పోటీ చేసి గెలుపొందిన హెచ్‌డీ కుమారస్వామి సీఎంగా బాధ్యతలు చేపట్టారు. ఈ క్రమంలో ఆయన రామనగర అసెంబ్లీ స్థానానికి రాజీనామా చేశారు. దీంతో అక్కడ ఉపఎన్నిక అనివార్యమైంది. ఈ నేపథ్యంలో కుమారస్వామి భార్య అనితా కుమారస్వామి అక్కడ నుంచి పోటీ చేస్తున్నారు. రామ్‌నగరతో పాటు జంఖాడీ అసెంబ్లీ స్థానం, బళ్ళారి, శివమెగ్గ, మండ్యా లోక్‌సభ స్థానాలకు శుక్రవారం ఉప ఎన్నికలు జరుగనున్న సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment