కర్నాటకంపై నేడే సుప్రీం తీర్పు  | Karnataka MLAs Supreme Court Verdict Today | Sakshi
Sakshi News home page

కర్నాటకంపై నేడే సుప్రీం తీర్పు 

Published Wed, Jul 17 2019 1:12 AM | Last Updated on Wed, Jul 17 2019 8:43 AM

Karnataka MLAs Supreme Court Verdict Today - Sakshi

బెంగళూరులో క్రికెట్‌ ఆడుతున్న యడ్యూరప్ప

న్యూఢిల్లీ/బెంగళూరు: గత పక్షం రోజులుగా ఉత్కంఠ రేకెత్తిస్తున్న కన్నడ రాజకీయం సుప్రీంకోర్టులో తుది అంకానికి చేరింది. కుమారస్వామి ప్రభుత్వ మనుగడకు సంబంధించిన కీలక తీర్పును నేడు సుప్రీంకోర్టు వెలువరించనుంది. తమ రాజీనామాలను ఆమోదించేలా స్పీకర్‌ రమేశ్‌ను ఆదేశించాలంటూ కాంగ్రెస్, జేడీఎస్‌లకు చెందిన 15 మంది రెబెల్‌ ఎమ్మెల్యేలు పెట్టుకున్న అర్జీపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగోయ్, జస్టిస్‌ దీపక్‌ గుప్తా, జస్టిస్‌ అనిరుద్ధ బోస్‌లతో కూడిన ధర్మాసనం మంగళవారం వాదనలు వింది. రెబెల్స్‌ న్యాయవాది ముకుల్‌ రోహిత్గీ , సీఎం కుమార స్వామి తరఫున సీనియర్‌ అడ్వొకేట్‌ రాజీవ్‌ ధావన్, స్పీకర్‌ తరఫున ఏఎం సింఘ్వి వాదించారు. మూడు పక్షాల వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును బుధవారానికి వాయిదా వేసింది. కాగా, ప్రభుత్వం గురువారం అసెంబ్లీలో బలపరీక్షను ఎదుర్కోనుంది.
 
స్పీకర్‌ది పక్షపాత వైఖరి
రెబెల్‌ ఎమ్మెల్యేల పక్షాన సీనియర్‌ న్యాయవాది ముకుల్‌ రోహత్గీ వాదనలు వినిపించారు. ఎమ్మెల్యేల రాజీనామాలు, అనర్హతపై యథాతథ స్థితి కొనసాగించాలంటూ గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వుల అమలును కొనసాగించాలని కోరారు. అసెంబ్లీ సమావేశాల హాజరు నుంచి రాజీనామా చేసిన ఎమ్మెల్యేలను మినహాయించాలని, ప్రభుత్వం మైనారిటీలో ఉన్నందున సంకీర్ణ ప్రభుత్వం విప్‌ చెల్లదని పేర్కొన్నారు. ఎమ్మెల్యేల రాజీనామాలపై నిర్ణయం తీసుకోకుండా స్పీకర్‌ పక్షపాతంతో వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వానికి అనుకూలంగా ఓటు వేసేలా ఒత్తిడి తెచ్చేందుకే రాజీనామాలను పక్కనబెట్టారన్నారు. రెబెల్‌ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయడానికే స్పీకర్‌ వారి రాజీనామా విషయాన్ని జాప్యం చేస్తున్నారని, అనర్హతను తప్పించుకునేందుకు రాజీనామా చేయడంలో వారి తప్పేమీ లేదని రోహత్గీ తెలిపారు. ‘ఏం చేయాలనుకుంటే అది చేయడం ఎమ్మెల్యే ప్రాథమిక హక్కు. స్పీకర్‌ ఆ రాజీనామాను ఆమోదిస్తారా లేదా అనే విషయంతో అతనికి సంబంధం లేదు‘ అని రోహత్గీ స్పష్టం చేశారు.
 
ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్ర
సీఎం కుమారస్వామి తరఫున సీనియర్‌ అడ్వొకేట్‌ రాజీవ్‌ ధావన్‌ తన వాదనలు వినిపించారు. రెబెల్‌ ఎమ్మెల్యేల రాజీనామాలపై నిర్ణయం తీసుకోవాలని ఓసారి, యథాతథస్థితి కొనసాగించాలంటూ మరోసారి.. ఇలా రెండు మధ్యంతర తీర్పులిచ్చే అధికారం న్యాయస్థానానికి లేదన్నారు. గడువులోగా ఎమ్మెల్యేల రాజీనామాలను ఆమోదించాలంటూ స్పీకర్‌పై ఒత్తిడి తేలేరన్నారు. ఎమ్మెల్యేల రాజీనామాల ప్రక్రియ సరిగాలేదని తెలిపారు. ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు తిరుగుబాటు ఎమ్మెల్యేలు ప్రయత్నిస్తున్నారని, అందుకే వారి వినతిని పట్టించుకోవద్దని కోరారు. ‘వారంతా ముంబైలోని ఓ హోటల్‌లో మకాం వేశారు. ఒక్కో ఎమ్మెల్యే ఒక్కో మంత్రి కావాలనుకుంటున్నారు. ఇది స్పీకర్‌కు కోర్టుకు మధ్య వివాదం కాదు. ముఖ్యమంత్రికి.. ముఖ్యమంత్రి కావాలనుకుంటున్న మరొకరికి మధ్య పోరాటం. అందుకే ఆ ఎమ్మెల్యేల రాజీనామాలు నిజమైనవేనా, స్వచ్చందంగా ఇచ్చినవేనా అనే విషయాన్ని స్పీకర్‌ ధ్రువీకరించుకోవాల్సి ఉంటుంది’ అని పేర్కొన్నారు.
 
స్పీకర్‌ను ఆదేశించలేరు 
స్పీకర్‌ తరఫున సీనియర్‌ అడ్వొకేట్‌ ఏఎం సింఘ్వి మాట్లాడుతూ.. గత ఏడాది యడ్యూరప్పను ప్రభుత్వం ఏర్పాటు చేయాలని స్పీకర్‌ కోరగా అర్థరాత్రి తీర్పు వెలువరించిన కోర్టు స్పీకర్‌కు ఆదేశాలు ఇవ్వలేదని గుర్తు చేశారు. రెబెల్‌ ఎమ్మెల్యేల రాజీనామాలు, అనర్హతలకు సంబంధించి స్పీకర్‌ నిర్ణయం తీసుకోలేదని, వారిని శిక్షించేందుకు అధికారాలు కోర్టుకున్నాయన్నారు. రాజీనామాలు చేసిన వారి విషయంలో యథాతథ స్థితిని కొనసాగించాలన్న మధ్యంతర ఉత్తర్వులను సవరించాలని కోరారు. ఎమ్మెల్యేల రాజీనామాలు, అనర్హతలకు సంబంధించి మధ్యంతర ఉత్తర్వుల్లో న్యాయస్థానం మార్పులు చేస్తే బుధవారం కల్లా స్పీకర్‌ తుది నిర్ణయం తీసుకుంటారని సింఘ్వి అన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement