
సాక్షి, నాగర్ కర్నూలు: టీఆర్‌ఎస్ అధినేత కె చంద్రశేఖర్ రావు అసెంబ్లీ స్థానాలకు పార్టీ అభ్యర్థులను ప్రకటించి రెండు నెలలు పూర్తి కావస్తున్న ఆ పార్టీని అసమ్మతి సెగలు వీడటం లేదు. అసమ్మతి రాగం అందుకున్న కొందరు నేతలను టీఆర్‌ఎస్ అధిష్టానం బుజ్జగించిగా.. మరికొందరు నేతలు మాత్రం పార్టీని వీడిన సంగతి తెలిసిందే. కల్వకుర్తి టికెటు విషయంలో మనస్తాపం చెందిన టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి గత కొంత కాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. ఓ దశలో ఆయన స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగనున్నట్టు కూడా ప్రచారం జరిగింది. గతంలో అపద్దర్మ మంత్రి కేటీఆర్ నారాయణరెడ్డిని బుజ్జగించినప్పటికీ ఫలితం లేకపోయింది.
నారాయణరెడ్డి స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగితే.. కల్వకుర్తిలో టీఆర్‌ఎస్ అభ్యర్థి జైపాల్ యాదవ్‌కు గట్టి షాక్ తగిలే అవకాశాలు ఉండటంతో కేటీఆర్ ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకున్నట్టుగా తెలుస్తోంది. దీంతో కేటీఆర్ గురువారం మరోసారి నారాయణరెడ్డితో సంప్రదింపులు జరిపారు. నారాయణరెడ్డితో భేటీ అయిన కేటీఆర్ భవిష్యత్తులో ఆయనకు తగిన ప్రాధాన్యత ఇస్తామని అన్నారు. దీంతో అలకవీడిన నారాయణరెడ్డి.. టీఆర్‌ఎస్ అభ్యర్థి జైపాల్ యాదవ్‌ను గెలిపించుకుంటామని తెలిపారు. అనంతరం కేటీఆర్‌తో కలిసి కల్వకుర్తిలో జరిగే టీఆర్‌ఎస్ బహిరంగసభకు బయలుదేరి వెళ్లారు.
Comments
Please login to add a commentAdd a comment