మాట్లాడుతున్న కాటసాని రాంభూపాల్ రెడ్డి, చిత్రంలో కాటసాని రామిరెడ్డి, ఎర్రబోతుల వెంకట రెడ్డి తదితరులు
బనగానపల్లె (కర్నూలు): రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలంటూ సీఎం చంద్రబాబు నాయుడు డ్రామా లాడుతున్నారని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాటసాని రాంభూపాల్‌రెడ్డి విమర్శించారు. పట్టణంలోని జీఎంఆర్ ఫంక్షన్ హాల్‌లో వైఎస్సార్‌సీపీ మండల నేత గుండం నాగేశ్వరరెడ్డి అధ్యక్షతన శనివారం పార్టీ నాయకులు, బూత్ కమిటీ కన్వీనర్లతో సమావేశం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన కాటసాని రాంభూపాల్‌రెడ్డి మాట్లాడుతూ..టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టి ప్యాకేజీకి ఒప్పుకున్న విషయం అందరికీ తెలుసన్నారు. ప్యాకేజీ తీసుకొని ఇప్పుడు ప్రత్యేక హోదా కావాలని అడిగితే ఎలా ఇస్తారని ప్రశ్నించారు. ఎన్నికల సమయం దగ్గర పడడంతో తన తప్పును కప్పి పుచ్చుకునేందుకు చంద్రబాబు హోదా డ్రామాలాడుతున్నారని, ప్రజలు ఎవరూ నమ్మే స్థితిలో లేరన్నారు. ప్రత్యేక హోదాపై మొదటి నుంచి పోరాటం చేస్తున్నది తమ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డేనని స్పష్టం చేశారు. దీక్షలు చేయడంతోపాటు యువభేరీలు నిర్వహించి ప్రత్యేక హోదా అంశాన్ని సజీవంగా ఉంచారన్నారు.
దోచుకోవడమే టీడీపీ నాయకుల పని..
రాష్ట్రంలో టీడీపీ నాయకులు దోచుకోవడమే పనిగా పెట్టుకొని..ప్రజా సమస్యలు పట్టించుకోవడం లేదని కాటసాని ఆరోపించారు. తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో పార్టీలకతీతంగా అభివృద్ధి పనులు చేశానని గుర్తు చేశారు. వైఎస్సార్ హయాంలో పేదలందరికీ ఇళ్లు మంజూరు చేసినట్లు తెలిపారు. శ్రీజయజ్యోతి సిమెంట్ ఏర్పాటు సమయంలో భూములుకోల్పోయిన రైతుందరికీ పరిహారం అందేలా చూశానన్నారు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో దద్దణాల ప్రాజెక్టు ఎత్తిపోతల పథకం నిర్మాణానికి సర్వే చేయించానన్నారు. ప్రస్తుత ఎమ్మెల్యే బీసీ జనార్దన్‌రెడ్డి ఈ విషయాన్ని మరినట్లు ఉన్నారన్నారు. అవుకు మండలంలోని గుండ్ల శింగవరం నుంచి రామావరం వరకు రోడ్డు నిర్మాణానికి గత ప్రభుత్వ హయాంలో రూ.8.64 కోట్ల నిధులు మంజూరయ్యాయన్నారు. ఈ ప్రాంత ప్రజలపై కక్షగట్టిన ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి.. రోడ్డు నిర్మాణానికి టెండర్లు వేయకుండా అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చారన్నారు.
ఒక్క హామీ నెరవేర్చలేదు..
నాలుగేళ్ల చంద్రబాబు పాలన కుక్కతోక వంకరలా ఉందని వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి విమర్శించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన çహామీలు ఒక్కటీ నెరవేర్చలేదన్నారు. అబద్ధపు హామీలతో గద్దెనెక్కిన చంద్రబాబుకు రాష్ట్ర ప్రజలు వచ్చే శాసనసభ ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. వైఎస్సార్ హయాంలో గిట్టుబాటు ధరలతో రైతులు సుఖసంతోషాలతో ఉండేవారన్నారు. ప్రస్తుతం రైతుల సమస్యలు పట్టించుకునే వారు కరువయ్యారన్నారు. సాగునీటి ప్రాజెక్టులను తాకట్టు పెట్టిన ఘన చరిత్ర చంద్రబాబుదేనన్నారు. రాష్ట్రంలో టీడీపీ నాయకులు, కార్యకర్తల దోపిడీకి అడ్డూఅదుపూ లేకుండా పోయిందన్నారు. వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ నేత ఎర్రబోతుల వెంకటరెడ్డి మాట్లాడుతూ.. టీడీపీ పాలనలో ప్రజా సమస్యలు పరిష్కారం కావడం లేదన్నారు. సమావేశంలో వైస్సార్‌సీపీ నాయకులు పీఆర్ వెంకటేశ్వరరెడ్డి, ఇటిక్యాల బాలిరెడ్డి, శివరామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment