నరసింహంకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానిస్తున్న కాటసాని రామిరెడ్డి
కోవెలకుంట్ల: సంజామల మండలం నొస్సం గ్రామానికి చెందిన గ్రూప్–1 రిటైర్డ్ అధికారి నరసింహం.. గురువారం వైఎస్సార్‌సీసీలో చేరారు. పట్టణంలోని వీఆర్, ఎన్‌ఆర్ పంక్షన్ హాలులో నియోజకవర్గ ఇన్‌చార్జ్, మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి అధ్యక్షతన ఆ పార్టీ కోవెలకుంట్ల మండల బూత్ కమిటీ కన్వీనర్లు, సభ్యులతో సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముందు రిటైర్డ్ జాయింట్ కమిషనర్(స్టేట్ ట్యాక్స్) నరసింహం.. కాటసాని సమక్షంలో వైఎఎస్సార్‌సీపీలో చేరారు. 1996 గ్రూప్–1 బ్యాచ్‌కు చెందిన నరసింహం.. వైఎస్సార్, అనంతపురం జిల్లాల్లో పనిచేశారు. వైఎస్సార్ జిల్లాలోని విజిలెన్స్‌అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగంలో పనిచేస్తూ ఇటీవల పదవీ విరమణ పొందారు. పార్టీలో చేరిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రానికి వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి న్యాయకత్వం అవసరమన్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో ఐదు కోట్ల మంది ప్రజలు కనీస వసతులు లేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. రాష్ట్రంలో వివిధ ప్రభుత్వ శాఖల్లో 1.42 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయన్నారు. ప్రస్తుత ప్రభుత్వం 30 లక్షల మంది నిరుద్యోగులకు భృతి కింద ఏడాదికి రూ. 1500 కోట్ల చెల్లించాల్సి ఉందన్నారు. గిట్టుబాటు ధరలు లేక రైతులు అప్పుల ఊబిలో కూరకపోయారన్నారు. వైఎస్సార్ పాలన సువర్ణ యుగమని, మళ్లీ అలాంటి పాలన రావాలంటే వైఎస్సార్ తనయుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితో సాధ్యమవుతుందన్నారు. వైఎస్ జగన్ ప్రవేశపెట్టిన నవరత్నాలతో ప్రజలకు అన్ని విధాలా మేలు జరుగుతుందన్నారు. కార్యక్రమంలో వైఎస్‌ఆర్‌సీపీ జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శి కర్రా హర్షవర్ధన్‌రెడ్డి, సీనియర్ డాక్టర్ రామిరెడ్డి, కోవెలకుంట్ల, బిజనవేముల ఎంపీటీసీ సభ్యులు భీమిరెడ్డి ప్రతాప్‌రెడ్డి, దిల్క్‌బాష, వెలగటూరు, సౌదరదిన్నె సర్పంచ్‌లు ఎల్వీ సుధాకర్‌రెడ్డి, రమణారెడ్డి, సిద్ధంరెడ్డి రాంమోహన్‌రెడ్డి పాల్గొన్నారు.
టీడీపీ పాలనకు చరమగీతం పాడదాం..
టీడీపీ పాలనకు చరమగీతం పాడే రోజులు దగ్గర పడ్డాయని వైఎస్సార్‌సీపీ బనగానపల్లె నియోజకవర్గ ఇన్‌చార్జ్, మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి అన్నారు. గురువారం స్థానిక వీఆర్, ఎన్‌ఆర్ ఫంక్షన్‌హాలులో ఆయన మాట్లాడారు. రానున్న ఎన్నికల్లో బూత్ కమిటీలు కీలకపాత్ర పోషించాలన్నారు. నాలుగేళ్ల తెలుగుదేశం పాలనలో రైతులు, నిరుద్యోగులు, ఉద్యోగులు, మహిళలు, వర్తకులు, కూలీలు.. అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారన్నారు.
రుణమాఫీ పేరుతో రైతులను చంద్రబాబు దగా చేశారని ఆరోపించారు. టీడీపీ పాలనలో అవినీతి రాజ్యమేలుతోందని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో డబ్బులతో ఓట్లు కొనుక్కోవచ్చని ఎమ్మెల్యే బీసీ జనార్దన్‌రెడ్డి భ్రమలో ఉన్నారని, డబ్బు రాజకీయాలకు కాలం చెల్లిపోయిందన్నారు. అధికారులను వేధించడమే లక్ష్యంగా పెట్టుకున్నారని, నాలుగేళ్లలో బనగానపల్లెలో 14 మంది తహసీల్దార్లు బదిలీ కావడం ఇందుకు నిదర్శనమన్నారు. ఎమ్మెల్యే, టీడీపీ నాయకులు చేస్తున్న దౌర్జన్యాలతో నియోజకవర్గంలో అధికారులు సక్రమంగా విధులు నిర్వర్తించలేకపోతున్నారన్నారు.
Comments
Please login to add a commentAdd a comment