సాక్షి, హైదరాబాద్: కేంద్రంలో ఇప్పుడున్న ప్రభుత్వాన్ని నమ్ముకుంటే శంకరగిరి మాన్యాలకు పోయినట్లేనని రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు వ్యాఖ్యానించారు. 50–60 ఏళ్ల తర్వాత బీజేపీ అధికారంలోకి వచ్చిందని, యూపీఏ ప్రభుత్వంపై విసుగెత్తి వీళ్లేదో ఉద్ధరిస్తారని ప్రజలు గెలిపిస్తే చేసిందేమీ లేదని ఎద్దేవా చేశారు. ఇది ఒక దేశమని, ఎవడబ్బ సొత్తు కాదనే విషయాన్ని బీజేపీ నేతలు గ్రహించాలన్నారు. గురువారం అసెంబ్లీలో బడ్జెట్‌పై చర్చ సందర్భంగా బీజేపీ సభ్యుడు రాజాసింగ్ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఎన్ని నిధులు ఇచ్చిందో చెప్పాలని డిమాండ్ చేశారు.
దీనికి ఆర్థిక మంత్రి హరీశ్‌రావు సమాధానమిస్తున్న సందర్భంలో సీఎం కేసీఆర్ జోక్యం చేసుకుని మాట్లాడుతూ.. దేశాన్ని నడిపే విషయంలో కాంగ్రెస్, బీజేపీ అట్టర్ ఫ్లాప్ అయ్యాయని వ్యాఖ్యానించారు. ‘కేంద్రం ఏదో మేమిచ్చినం... మేమిచ్చినం అంటోంది. మీరెవరండీ ఇచ్చే దానికి నాకర్థం కాదు. నాకు తిక్కరేగి ఇప్పుడున్న హోం మంత్రిని క్షమాపణ అడిగిన. నేను చెప్పింది తప్పయితే రాజీనామా చేస్తానని చెప్పిన. అయినా వీళ్లు ఇచ్చేది ఏంది? రాజ్యాంగం మేరకు పన్నుల వాటా ఇవ్వాల్సిందే. దానికి పేరు మాత్రం సెంట్రల్ డివల్యూషన్ అని పెట్టారు. సెంట్రల్ డివల్యూషన్ లేదు... మన్ను లేదు. కొన్ని రకాల పన్నులను అన్ని రాష్ట్రాల నుంచి వసూలు చేసే బాధ్యత కేంద్రంపై రాజ్యాంగం పెట్టింది. ఆ ప్రకారం రాష్ట్రం వాటాగా ఆ పన్నులు ఇవ్వాల్సిందే. అదేమీ బిచ్చమెత్తుకునేది కాదు’అని స్పష్టం చేశారు.
సీఎస్టీ పేరుతో యూపీయే ప్రభుత్వం రాష్ట్రాల పన్నులను మింగేస్తే జీఎస్టీ పేరుతో ఎన్డీయే సర్కార్ మింగేస్తోందని, ఆ జీఎస్టీకే దిక్కులేదని వ్యాఖ్యానించారు. కేంద్రం వాటా కింద ఇచ్చే పన్నులపై ఆధారపడి ఉద్యోగస్తులకు ప్రతి నెలా మొదటి తారీఖు కల్లా జీతాలిస్తామని, కానీ ఇప్పుడున్న కేంద్రం ఇవ్వడం లేదని, రూ.3,910 కోట్లకు ఇప్పటివరకు దిక్కులేదన్నారు. ఇవ్వాల్సింది ఇవ్వకపోగా మన నెత్తిమీద మన చెయ్యి పెట్టినట్లు రూ.1,410 కోట్లు అప్పు తెచ్చుకోవాలని కేంద్రం చెప్పిందని ఎద్దేవా చేశారు.
పన్నుల వాటాలో కేంద్రం మెహర్బాణీ ఏమీ లేదని, ఎన్డీయే ప్రభుత్వం ఏ ఒక్క ఏడాది కూడా గ్రాంట్ ఇన్ ఎయిడ్ కింద రూ.10వేల కోట్లకు మించి ఇవ్వలేదన్నారు. దానికే తామేదో చేసేస్తున్నట్లు బాజా కొట్టుకుంటున్నారని, బాజాలో బీజేపీ.. కాంగ్రెస్ తాత అయిందని పేర్కొన్నారు. ‘కిత్‌నే ఆయా బోలో... కిసీ కా బాప్‌కా హై? దేశాన్ని సాదే మొదటి మూడు రాష్ట్రాల్లో తెలంగాణ ఉంది. మిగిలినవన్నీ అడుక్కుతినే రాష్ట్రాలే. మనం రూ.50 వేల కోట్లు ఇస్తే వాళ్లు రూ.24 వేల కోట్లు కూడా ఇవ్వడం లేదు. ఇప్పటికయినా బీజేపీ నీచబుద్ధి మానుకోవాలి’అని సీఎం కేసీఆర్ సూచించారు.
మేం మొదటి సారే గెలిచాం..
బీజేపీ లేకలేక అధికారంలోకి వచ్చిందన్న సీఎం కేసీఆర్ వ్యాఖ్యలపై బీజేపీ సభ్యుడు రాజాసింగ్ స్పందించి తాము రెండుసార్లు అధికారంలోకి వచ్చామని, టీఆర్‌ఎస్ కూడా అధికారంలోకి వచ్చింది కూడా రెండోసారేనని అన్నారు. దీనికి కౌంటర్‌గా సీఎం మాట్లాడుతూ.. తాము మొదటిసారి పోటీ చేసిన ఎన్నికల్లోనే గెలిచామని, బీజేపీ 50–60 ఏళ్లకు అధికారంలోకి వచ్చిందని వివరించారు.
కిసీకా బాప్‌కా హై..
బడ్జెట్‌లో పెట్టిన నిధులు ఖర్చుపై గురువారం సభలో ఆసక్తికరమైన చర్చ జరిగింది. బడ్జెట్‌పై ప్రభుత్వ సమాధానంలో భాగంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. కేంద్రం ఏదో ఇస్తున్నామని చెబుతోందని, అది బిచ్చమెత్తుకునేది కాదని, రాజ్యాంగం ప్రకారం రావాల్సిన వాటా అంటూ ‘కిసీకా బాప్‌కా హై’అని వ్యాఖ్యానించారు. తర్వాత సీఎల్పీ నేత ముల్లు భట్టి విక్రమార్క మాట్లాడుదూ.. రైతుబంధు కింద రాష్ట్రంలోని రైతాంగానికి ఇచ్చే నిధులు ‘మీ జేబుల్లోంచి ఇచ్చారా..? టీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయం నుంచి తెచ్చారా’అని ఘాటుగా ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ చెప్పినట్టు ‘కిసీ కా జాగీర్ నహీ హై... కిసీకా బాప్‌కా నహీ హై’అని అన్నారు.
దీంతో సభలో ఒక్కసారిగా గందరగోళం నెలకొంది. అధికార సభ్యులు భట్టి వ్యాఖ్యల పట్ల నిరసన వ్యక్తం చేశారు. మీరు ఎస్సారెస్పీ కట్టామని చెబుతున్నారు.. ఆ నిధులు మీ ఇంట్లోంచి తెచ్చారా అని భట్టిని ప్రశ్నిస్తూ కామెంట్లు చేశారు. అనంతరం ఆర్థిక మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ.. ప్రజాధనం ఖర్చు విషయంలో భట్టి మాట్లాడిన మాటలు అసంబద్ధమన్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు రైతు బంధు ద్వారా రాష్ట్ర రైతాంగానికి సాయం చేయాలన్న సోయి ఎందుకు రాలేదని ప్రశ్నించారు. సంపద పెంచాలి... పేదలకు పంచాలి.. అనేది తమ ప్రభుత్వ విధానమని ఆయన స్పష్టం చేశారు. మొత్తంమీద ప్రజాధనం మీద చర్చ పార్టీల మధ్య విమర్శలకు దారితీసింది.
Comments
Please login to add a commentAdd a comment