
సాక్షి, హైదరాబాద్: కర్ణాటక ముఖ్యమంత్రిగా కుమారస్వామి ప్రమాణస్వీకార కార్యక్రమానికి సీఎం కె.చంద్రశేఖర్‌రావు హాజరయ్యే అవకాశాలున్నాయని టీఆర్‌ఎస్ పార్టీ వర్గాలు తెలిపాయి. బెంగళూరులో బుధవారం జరగనున్న ప్రమాణస్వీకారానికి వెళ్లడంపై తొలుత కొంత సందిగ్ధం నెలకొన్నా.. వెళ్లడమే మంచిదనే నిర్ణయానికి కేసీఆర్ వచ్చినట్టుగా ఆయన సన్నిహితవర్గాలు వెల్లడించాయి. దేశంలో గుణాత్మక మార్పు కోసం కాంగ్రెస్, బీజేపీయేతర ప్రత్యామ్నాయం అవసరమని గత కొంతకాలంగా కేసీఆర్ చెబుతున్నారు.
ఈ నేపథ్యంలోనే ఎన్నికలకు ముందే కర్ణాటక వెళ్లిన ఆయన.. జేడీఎస్‌కు మద్దతు ప్రకటించారు. ప్రాంతీయ పార్టీల కూటమితోనే దేశంలో గుణాత్మకమార్పు సాధ్యమని, జేడీఎస్‌కు అండగా నిలవాలని పిలుపునిచ్చారు. కర్ణాటకలో జేడీఎస్ కీలకంగా ఉంటుందని, ఎన్నికల ఫలితాల తర్వాత మరోసారి బెంగళూరు వస్తానని కూడా సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఆయన అన్నట్టుగానే జేడీఎస్‌కు చెందిన కుమారస్వామి సీఎంగా ప్రమాణస్వీకారం చేస్తున్నారు. ఫెడరల్ ఫ్రంట్‌కు మద్దతుగా ఉన్న కుమారస్వామి ప్రమాణస్వీకారానికి దూరంగా ఉండటం మంచిది కాదనే అభిప్రాయానికి కేసీఆర్ వచ్చినట్టుగా చెబుతున్నారు.
దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం..
కాంగ్రెస్, బీజేపీలకు ప్రత్యామ్నాయ కూటమిని ఏర్పాటు చేసే ప్రయత్నాల్లో ఉన్న ఈ సమయంలో.. కాంగ్రెస్ మద్దతుతో సీఎం అవుతున్న కుమారస్వామి ప్రమాణస్వీకారానికి వెళ్లడం అవసరమా అని కేసీఆర్ తొలుత ఆలోచించారు. కాంగ్రెస్ అగ్రనేతలు హాజరుకానున్న ఈ కార్యక్రమానికి వెళ్లడం ద్వారా తప్పుడు సంకేతాలు వెళ్తాయేమోనని సంకోచించారు. అయితే కాంగ్రెస్, బీజేపీలో ఎవరు మద్దతిచ్చి నా ఫ్రంట్ మద్దతుదారు అయిన జేడీఎస్ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటవుతున్నదని పార్టీ నేతలు వాదిస్తున్నారు.
ముందుగా ప్రమాణస్వీకారానికి పార్టీ ప్రతినిధిగా మంత్రి కేటీఆర్‌ను పంపించాలని అనుకున్నారు. అయితే దీర్ఘకాలిక ప్రయోజనాలరీత్యా తాను వెళ్లడమే మంచిదనే యోచనకు కేసీఆర్ వచ్చినట్టుగా పార్టీ ముఖ్యులు వెల్లడిస్తున్నారు. బుధవారం ఉదయమే ప్రత్యేక విమానంలో బెంగళూరుకు వెళ్లి.. అక్కడ్నుంచి కుమారస్వామి ప్రమాణస్వీకారానికి కేసీఆర్ హాజరయ్యే అవకాశముందని చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment