కేసీఆర్(పాత చిత్రం)
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఏర్పడ్డాక కాంగ్రెస్ పార్టీ అవమానించడం వల్లే 2014లో తాము ఒంటరిగా బరిలోకి దిగామని టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ పేర్కొన్నారు. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ ప్రభంజనం సృష్టించిన సంగతి తెలిసిందే. బుధవారం మీడియాతో జరిగిన చిట్ చాట్‌లో కేసీఆర్ పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ఆయన మాట్లాడుతూ.. ‘తెలంగాణ ఏర్పడ్డాక కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీని కలిసి.. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి గురించి వివరించాను. రాష్ట్రంలో నాయకత్వ లోపం ఉండటంతో.. ప్రజలు కాంగ్రెస్‌ను విశ్వసించే పరిస్థితి లేదని తెలిపాను. ఆమె దిగ్విజయ్ సింగ్‌తో మాట్లాడమని చెప్పారు. కానీ దిగ్విజయ్ సింగ్ అవమానించారు. అయినా రెండు రోజులు ఓపిక పట్టాను. కానీ ఈ లోపే మా పార్టీకి చెందిన విజయశాంతితో పాటు మరికొందరు నాయకులను కాంగ్రెస్ వారి పార్టీలోకి చేర్చుకోవడం జరిగింది. దీంతో ఇక ఒంటరిగానే పోటీ చెయ్యాలని నిర్ణయించుకున్నాను. 2014లో మేము ఉత్తర తెలంగాణను నమ్ముకున్నాం. ఆ ఎన్నికల్లో 44 సీట్లు మాకు అక్కడే వచ్చాయ’ని తెలిపారు.
అసెంబ్లీ రద్దయిన తర్వాత అధికారులతో మాట్లాడలేదు
అమ్మ తోడు అసెంబ్లీ రద్దయిన తరువాత తను ఏ జిల్లా ఎస్సీతోగానీ, కలెక్టర్‌తోగానీ మాట్లాడలేదని కేసీఆర్ వెల్లడించారు. సీఎంఓ అధికారులతో కూడా తను మాట్లాడలేదని స్పష్టం చేశారు. కేవలం మిషన్ భగీరథ పనుల గరించి మాత్రమే తను వారితో మాట్లాడినట్టు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment