దేశ రాజకీయాల్లోకి జాతీయ పార్టీగా వెళ్తా: కేసీఆర్‌ | KCR Election Campaign Act Miryalaguda In Nalgonda | Sakshi
Sakshi News home page

దేశ రాజకీయాల్లోకి జాతీయ పార్టీగా వెళ్తా: కేసీఆర్‌

Published Fri, Mar 29 2019 7:56 PM | Last Updated on Fri, Mar 29 2019 8:32 PM

KCR Election Campaign Act Miryalaguda In Nalgonda - Sakshi

సాక్షి, నల్గొండ: సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి 150 సీట్లు, కాంగ్రెస్‌ పార్టీకి 100 సీట్లు కూడా రావని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అభిప్రాయపడ్డారు. ఎన్నికల తరువాత జాతీయ స్థాయిలో ప్రాంతీయ పార్టీలదే హవా ఉంటుందని, ఆ పార్టీలే కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయని స్పష్టం చేశారు. దేశ భద్రత సంబంధించిన విషయాలను ప్రధాని నరేంద్ర మోదీ ప్రచారంగా ఉపయోగించుకుంటున్నారని మండిపడ్డారు. ఓట్ల కోసమే హిందూవులంటూ రెచ్చగొడుతున్నారని, ఎన్నికల అనంతరం బీజేపీకి శంకరగిరిమాన్యాలే అని ఎద్దేవా చేశారు. బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్‌ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని, ఒళ్లు దగ్గరపెట్టుకోవాలని కేసీఆర్‌ హెచ్చరించారు. ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్రానికి వచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని, అందుకే బీజేపీకి 119 స్థానాల్లో పోటీచేస్తే.. కేవలం ఒకేఒక్క స్థానంలో గెలుపొందారని గుర్తుచేశారు.

ఎన్నికల ప్రచారంలో భాగంగా నల్గొండ జిల్లా మిర్యాలగూడెంలో జరిగిన టీఆర్‌ఎస్‌ బహిరంగ సభలో కేసీఆర్‌ ప్రసంగించారు. ఈ సందర్భంగా ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ.. దేశంలోనే అతిపెద్ద ఆల్ట్రామెగా విద్యుత్‌ ప్లాంట్‌ను 29వేల కోట్లతో దామరచర్లలో నిర్మిస్తున్నామని తెలిపారు. టీఆర్‌ఎస్‌ చేస్తున్న అభివృద్ధిని చూసి జిల్లాలో తొమ్మిది అసెంబ్లీ స్థానాలకు గెలిపించారని పేర్కొన్నారు. భవిష్యత్తులో నల్గొండను మరింత అభివృద్ధి చేస్తామని, దాంతో ఈజిల్లా ముఖచిత్రమే పూర్తిగా మారనుందని స్పష్టం చేశారు. కోమటి రెడ్డి వెంకట్‌రెడ్డి, ఉత్తమ్‌ కుమార్‌రెడ్డికి బుద్ధి చెప్పాలని కేసీఆర్‌ పిలుపునిచ్చారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఈజిల్లాలో టీఆర్‌ఎస్‌ ఒక్కస్థానం గెలిచిన రాజకీయ సన్యాసం చేసుకుంటానని కోమటిరెడ్డి ప్రకటించారని.. మళ్లీ ఎందుకు పోటీ చేస్తున్నారని ప్రశ్నించారు.

ఇన్నేళ్లు దేశాన్ని పాలించిన కాంగ్రెస్‌ ఏం అభివృద్ధి చేసిందో ఉత్తమ్‌, రాహుల్‌ చెప్పాలని డిమాండ్‌ చేశారు. టికెట్లు అమ్ముకునే సంస్కారం కాంగ్రెస్‌ నేతలదని, అందుకే అందరూ రాజీనామాలు చేసి తమ పార్టీలో చేరుతున్నారని వెల్లడించారు. ఎన్నికల అనంతరం ఉ‍త్తమ్‌ కుమార్‌ రెడ్డి పదవి పోవడం ఖాయమన్నారు. దేశంలో గుణాత్మక మార్పు కోసం అవసరమైతే జాతీయ పార్టీని కూడా పెడతానని కేసీఆర్‌ ప్రకటించారు. సమాఖ్య కూటమి వస్తేనే దేశంలో మార్పు సాధ్యమన్నారు. లోక్‌సభ ఎన్నిలకల్లో 16 ఎంపీ స్థానాల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. కారు గుర్తుకు ఓటు వేసి నల్గొండ ఎంపీగా పోటీచేస్తున్న వేమిరెడ్డి నర్సింహారెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కేసీఆర్‌ కోరారు.  
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement