‘కూటమి’ తర్వాతే తుది జాబితా | KCR finalized the candidates for the 14 seats | Sakshi
Sakshi News home page

‘కూటమి’ తర్వాతే తుది జాబితా

Published Tue, Sep 18 2018 2:17 AM | Last Updated on Tue, Sep 18 2018 7:14 AM

KCR finalized the candidates for the 14 seats - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ముందస్తు ఎన్నికల కోసం ప్రత్యర్థి పార్టీల కంటే ముందుగానే సిద్ధమైన తెలంగాణ రాష్ట్ర సమితి... పెండింగ్‌లో ఉన్న 14 స్థానాల అభ్యర్థుల ఖరారుపై ఆచితూచి అడుగులు వేస్తోంది. టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ఈ స్థానాలకు ఇప్పటికే అభ్యర్థులను ఖరారు చేశారు. అయితే కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ, టీజేఎస్‌తో ఏర్పడే మహా కూటమిపై స్పష్టత వచ్చాకే ఈ జాబితాను వెల్లడించే అవకాశం ఉంది. టీఆర్‌ఎస్‌ ఇంకా అభ్యర్థులను ప్రకటించని స్థానాల్లో 3 ఎస్సీ రిజర్వుడ్‌ స్థానాలున్నాయి.

మిగిలిన జనరల్‌ స్థానాలను మహాకూటమి ఏ వర్గాలకు కేటాయిస్తుంది? రాష్ట్ర వ్యాప్తంగా ఏ వర్గానికి ఎన్ని సీట్లు ఇస్తారనే లెక్కలపై స్పష్టత వచ్చాకే... టీఆర్‌ఎస్‌ తుది జాబితాను వెల్లడించనుందని తెలిసింది. గతంలో ఎప్పుడూ లేని విధంగా టీఆర్‌ఎస్‌ ఈసారి ఒకేసారి 105 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన విషయం తెలిసిందే. దాదాపు ఈ స్థానాలన్నింటిలోనూ అభ్యర్థులు ఇప్పటికే ప్రచారాన్ని మొదలుపెట్టారు.

మిగిలిన స్థానాలకు సైతం వీలైనంత త్వరగా అభ్యర్థులను ప్రకటించేందుకు టీఆర్‌ఎస్‌ సిద్ధమైంది. మహాకూటమి జాబితా కోసమే వేచి చూస్తోంది. వచ్చే నెల మొదటి వారంలో కాంగ్రెస్‌ అభ్యర్థుల జాబితాను ప్రకటించనుంది. దీనికి అనుగుణంగా టీఆర్‌ఎస్‌ తుది జాబితా వెలువడనుంది. వరంగల్‌ తూర్పు, చొప్పదండి, మల్కాజ్‌గిరి, వికారాబాద్, మేడ్చల్, అంబర్‌పేట, ముషీరాబాద్, గోషామహల్, ఖైరతాబాద్, హుజూర్‌నగర్, కోదాడ, జహీరాబాద్, చార్మినార్, మలక్‌పేట అసెంబ్లీ స్థానాలకు టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను ఖరారు చేయాల్సి ఉంది.

మాజీ మంత్రి దానం నాగేందర్‌కు టీఆర్‌ఎస్‌ అధిష్టానం గోషామహల్‌ టికెట్‌ను ఖరారు చేసింది. అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. ఇక్కడి నుంచి మహాకూటమి తరుఫున మాజీ మంత్రి ముఖేశ్‌ గౌడ్‌ బరిలో దిగే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో ఖైరతాబాద్‌ టికెట్‌ కావాలని దానం కోరుతున్నారు. దీనిపై దాదాపు రోజూ కేటీఆర్‌ను కలుస్తున్నారు. ఖైరతాబాద్‌కు దానం ఖరారైతే, గోషామహల్‌ స్థానాన్ని నందకిశోర్‌ బిలాల్, ప్రేం సింగ్‌ రాథోడ్‌లలో ఒకరికిచ్చే అవకాశం ఉంది.
♦   ఖైరతాబాద్‌ టికెట్‌ పీజేఆర్‌ కూతురు విజయారెడ్డికి దాదాపుగా ఖరారైంది. టీఆర్‌ఎస్‌ సెక్రటరీ జనరల్‌ కె.కేశవరావు కూతురు విజయలక్ష్మీ, నియోజకవర్గ టీఆర్‌ఎస్‌ ఇన్‌చార్జి మన్నె గోవర్ధన్‌రెడ్డి కూడా ఈ స్థానాన్ని ఆశిస్తున్నారు. విజయలక్ష్మీ, విజయారెడ్డి  కార్పొరేటర్లుగా ఉన్నారు.  
 ముషీరాబాద్‌ అభ్యర్థిగా ముఠా గోపాల్‌ పేరు దాదాపుగా ఖరారైంది. హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి అల్లుడు, కార్పొరేటర్‌ శ్రీనివాస్‌రెడ్డి ఇక్కడి నుంచి టికెట్‌ కోసం ప్రయత్నిస్తున్నారు.  
 అంబర్‌పేట స్థానానికి పోటీ ఎక్కువగానే ఉంది. టీఆర్‌ఎస్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి ఎడ్ల సుధాకర్‌రెడ్డి, గడ్డం సాయికిరణ్, కాలేరు వెంకటేశ్‌ టికెట్‌ కోసం ప్రయత్నిస్తున్నారు. సామాజిక సమీకరణ లెక్కల ఆధారంగా ఇక్కడ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయనుంది.  
మేడ్చల్‌ అసెంబ్లీ టికెట్‌ విషయంలోనూ పోటీ నెలకొంది. తాజా మాజీ ఎమ్మెల్యే ఎం.సుధీర్‌రెడ్డి, మల్కాజ్‌గిరి లోక్‌సభ సభ్యుడు చామకూర మల్లారెడ్డి, సింగిరెడ్డి హరివర్ధన్‌రెడ్డి, నక్కా ప్రభాకర్‌గౌడ్, సాదా నర్సింహారెడ్డి టికెట్‌ కోసం ప్రయత్నిస్తున్నారు.› ప్రతిపక్ష పార్టీకి చెందిన ఓ నేత పార్టీలో చేరిన తర్వాత ఇక్కడ అవకాశం ఇస్తారని ప్రచారం జరుగుతోంది.
మల్కాజ్‌గిరి విషయంలో గ్రూపు రాజకీయాలు కొనసాగుతున్నాయి. తాజా మాజీ ఎమ్మెల్యే కనకారెడ్డి పేరును ప్రకటించకుండా పెండింగ్‌లో పెట్టారు. గ్రేటర్‌ హైదరాబాద్‌ టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు మైనంపల్లి హనుమంతరావు ఈ సీటు ఆశిస్తున్నారు. కనకారెడ్డి మాత్రం తన కోడలు విజయశాంతికి ఇవ్వాలని కోరుతున్నారు.  
వికారాబాద్‌ అసెంబ్లీ నియోజకవర్గం టికెట్‌ ఇంకా ఖరారు కాలేదు. తాజా మాజీ ఎమ్మెల్యే బి.సంజీవరావు పేరును అధిష్టానం పెండింగ్‌లో పెట్టింది. సంజీవరావు మళ్లీ తనకే అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. టి.విజయ్‌కుమార్, ఎస్‌.ఆనంద్‌ టికెట్‌ కోసం ప్రయత్నిస్తున్నారు.›ప్రతిపక్షపార్టీకి చెందిన ఓ నేత పార్టీలో చేరిన తర్వాత ఇక్కడ అవకాశమిస్తారని ప్రచారం జరుగుతోంది.
టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ తాజాగా ప్రాతినిధ్యం వహించిన హుజూర్‌నగర్‌లో టీఆర్‌ఎస్‌ సరైన అభ్యర్థి కోసం ప్రయత్నిస్తోంది. నల్లగొండ లోక్‌సభ సభ్యుడు సుఖేందర్‌రెడ్డి, తిప్పన విజయసింహారెడ్డి, నియోజకవర్గ ఇన్‌చార్జి శంకరమ్మ, శానంపూడి సైదిరెడ్డి పేర్లను పరిశీలిస్తోంది.
కోదాడలోనూ అభ్యర్థిని ప్రకటించాల్సి ఉంది. నియోజకవర్గ ఇన్‌చార్జి కె.శశిధర్‌రెడ్డితోపాటు వేనేపల్లి చందర్‌రావు, ఆయన కూతురు ఈ టికెట్‌ కోసం ప్రయత్నిస్తున్నారు. ఖమ్మం లోక్‌సభ సభ్యుడు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిని ఇక్కడి నుంచి బరిలో దింపే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ సతీమణి పద్మావతి ఇక్కడ తాజా మాజీ ఎమ్మెల్యేగా ఉన్నారు.
చొప్పదండి అభ్యర్థిత్వాన్ని మళ్లీ తనకే ఇవ్వాలని తాజా మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ కోరుతున్నారు. టీఆర్‌ఎస్‌ ఎస్సీ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు సుంకె రవిశంకర్‌ పేరును టీఆర్‌ఎస్‌ పరిశీలిస్తోంది. మాజీ మంత్రి జి.వినోద్‌ ఇక్కడ పోటీ చేస్తారని కూడా ప్రచారం జరుగుతోంది.
జహీరాబాద్‌లో అభ్యర్థి కోసం టీఆర్‌ఎస్‌ వెతుకుతోంది. టీఆర్‌ఎస్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి మానిక్‌రావు, ఎస్సీ కమిషన్‌ చైర్మన్‌ ఎర్రోళ్ల శ్రీనివాస్‌ పేర్లను పరిశీలిస్తోంది. మాజీ మంత్రి జి.వినోద్‌ ఇక్కడి నుంచి పోటీ చేస్తారని, టీడీపీకి చెందిన జిల్లా నేతను టీఆర్‌ఎస్‌లోకి తీసుకువచ్చి టికెట్‌ ఇస్తారని కూడా ప్రచారం జరుగుతోంది.  
మజ్లిస్‌ పార్టీ కంచుకోటలైన చార్మినార్, మలక్‌పేటలో నియోజకవర్గాలకు ముఖీద్‌ చందా, చవ్వా సతీశ్‌ పేర్లు ఖరారైనట్లు తెలిసింది.  


వరంగల్‌ తూర్పు బీసీలకు..
వరంగల్‌ తూర్పు నియోజకవర్గంలో తాజా మాజీ ఎమ్మెల్యే కొండా సురేఖ టీఆర్‌ఎస్‌ను వీడడం ఖరారైంది. ప్రతి ఏటా వినాయక నవరాత్రి ఉత్సవాల సమయంలో కొండా సురేఖ కుటుంబం ప్రైవేట్‌ పర్యటనలో ఉంటారు. సెప్టెంబర్‌ 23న ఈ పర్యటన నుంచి రాగానే రాజకీయ భవిష్యత్తుపై వీరు నిర్ణయం తీసుకోనున్నారు. అభ్యర్థిత్వాల ప్రకటన విషయంలో టీఆర్‌ఎస్‌ అధిష్టానాన్ని ప్రశ్నిస్తూ కొండా సురేఖ చేసిన విమర్శల నేపథ్యంలో వరంగల్‌ తూర్పు స్థానాన్ని బీసీలకు ఇవ్వాలని అధిష్టానం ప్రాథమికంగా నిర్ణయించింది.

‘మహా కూటమి’కొలిక్కి వస్తున్న నేపథ్యంలో వరంగల్‌ తూర్పు టీడీపీకి కేటాయించే పరిస్థితి ఉంది. అక్కడ టీడీపీ నుంచి రేవూరి ప్రకాశ్‌రెడ్డి బరిలో ఉంటే అభ్యర్థి విషయంలో పునరాలోచించే అవకాశం ఉందని టీఆర్‌ఎస్‌ వర్గాలు చెబుతున్నాయి. మాజీ మంత్రి బస్వరాజు సారయ్య, మాజీ ఎంపీ గుండు సుధారాణి, వరంగల్‌ అర్బన్‌ బ్యాంకు చైర్మన్‌ ఎర్రబెల్లి ప్రదీప్‌రావు, టీఆర్‌ఎస్‌ వ్యవస్థాపక నాయకుడు గుడిమల్ల రవికుమార్‌ వరంగల్‌ తూర్పు టికెట్‌ కోసం ప్రయత్నిస్తున్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement