సాక్షి, మణుగూరు : అభివృద్దికి అడుగడుగున అడ్డం పడుతున్న కాంగ్రెస్ నేతల వల్లే ముందస్తు ఎన్నికలకు వచ్చామని ఆపద్ధర్మ సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. శుక్రవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో జరిగిన ప్రజాశ్వీరాధ సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. పోడు భూముల సమస్య ఎజెన్సీ ప్రాంతంలో తీవ్రంగా ఉందని, అధికారంలోకి రాగానే పోడు భూములకు పట్టాలిచ్చి.. పోడు రైతులకు హక్కులు కల్పిస్తామన్నారు. వీటికి రైతు బంధు, రైతు భీమా పథకాలు వర్తింపజేస్తామని హామీ ఇచ్చారు. నాలుగేళ్లలో తెలంగాణ ప్రభుత్వం చేసిన సంక్షేమం ప్రజల ముందే ఉందని, ప్రజలు నిజ నిజాలు గుర్తించి ఓటేయ్యాలని పిలుపునిచ్చారు.
ఈ ఎన్నికల్లో తేలిగ్గా నిర్ణయం తీసుకోవద్దని, మళ్లీ కాంగ్రెస్, టీడీపీలను నమ్మితే అంతే సంగతులను హెచ్చరించారు. 58 ఏళ్ల టీడీపీ, కాంగ్రెస్ పాలనలోని కరెంట్ సరఫరాకు ఇప్పటి సరఫరాకు తేడా గమనించాలన్నారు. ఈ సారి బ్రహ్మాండమైన మెజారిటీతో టీఆర్‌ఎస్ గెలుస్తోందని ధీమా వ్యక్తం చేశారు. కానీ పార్లమెంట్ స్థానాలు కూడా గెలుచుకోవాలని పిలుపునిచ్చారు. తెలంగాణకు ఢిల్లీ పెత్తనం అవసరమా? అని ప్రశ్నించారు. బీజేపీ, కాంగ్రెసేతర ప్రభుత్వం కేంద్రంలో రావాలని, అప్పుడే రాష్ట్రాలు బాగుపడతాయన్నారు. పినపాక టీఆర్‌ఎస్ అభ్యర్థి పాయం వెంకటేశ్వర్లను భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అంతకు ముందు కొత్తగూడెం సభలో మాట్లాడుతూ.. తెలంగాణ ఏర్పడటం వల్లే కొత్తగూడెం జిల్లాగా అవతరించిందన్నారు. జిల్లాలో మైనింగ్ యూనివర్సిటీ, మినీ ఎయిరోడ్రమ్ ఏర్పాటు చేస్తామని సీఎం చెప్పారు. సింగరేణి కార్మికులను అన్ని విధాలా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment