ప్రజలు వాతపెట్టినా బుద్ది రాలేదు | KCR Fires On TDP And Congress Party | Sakshi
Sakshi News home page

ప్రజలు వాతపెట్టినా బుద్ది రాలేదు

Published Sun, Dec 30 2018 1:51 AM | Last Updated on Sun, Dec 30 2018 6:55 AM

KCR Fires On TDP And Congress Party - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఎన్నికల్లో ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టేలా తీర్పు ఇచ్చినా ప్రతిపక్ష పార్టీల వైఖరి మారడంలేదని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు దుయ్యబట్టారు. ప్రజాతీర్పును పట్టించుకోకుండా అప్పుడే బజారునపడి విమర్శలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. పంచాయతీ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లపై ప్రతిపక్ష పార్టీలు ద్వంద్వ వైఖరితో వ్యవహరిస్తున్నాయని విమర్శించారు. ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు పెంపుపై తొందరేమీ లేదని పేర్కొన్నారు. మంత్రివర్గ విస్తరణ, అసెంబ్లీ సమావేశాల నిర్వహణ తక్షణమే చేయాల్సిన అవసరం లేదన్నారు. సీఎం కేసీఆర్‌ శనివారం ప్రగతిభవన్‌లో విలేకరులతో మాట్లాడారు. పలు అంశాలపై ఆయనేమన్నారంటే... 

‘అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ప్రజాజీవితంలో పిచ్చిపిచ్చిగా, అర్థంపర్థం లేకుండా మాట్లాడితే ప్రజలు సహించరని స్పష్టమైంది. ఇలా మాట్లాడిన పార్టీలకు ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టారు. బీజేపీకి చెందిన ఐదుగురు ముఖ్యమంత్రులు, 11 మంది కేంద్రమంత్రులు, ప్రధానమంత్రి, ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా ఇక్కడకు వచ్చి అంతుపంతు లేనట్లుగా మాట్లాడారు. బీజేపీ 118 నియోజకవర్గాల్లో పోటీ చేస్తే 103 సీట్లలో డిపాజిట్‌ కోల్పోయిం ది. అయినా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌ ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నారు. బీసీ రిజర్వేషన్ల పెంపు కోసం కేంద్రాన్ని ఎన్నిసార్లు అడిగినా పట్టించుకోదు. అక్కడివారికి చెప్పే తెలివి లేదుగానీ.. లక్ష్మణ్‌ ఇక్కడ రిజర్వేషన్లపై మాట్లాడతారు. ఎక్కువ జనాభా ఉన్న బీసీల కోసం కేంద్ర ప్రభుత్వంలో ప్రత్యేకంగా శాఖ పెట్టాలని మన్మోహన్‌సింగ్‌ను పలుసార్లు కోరాను. బీసీ వర్గానికి చెందిన ప్రధానమంత్రి నరేంద్రమోదీకీ విజ్ఞప్తి చేశాను. దాదాపు 50 లేఖలు ఇచ్చినా పట్టించుకోవడంలేదు. అయినా బీజేపీ నాయకులు సిగ్గులేకుండా మాట్లాడుతున్నారు. 

ప్రజలకు అన్నీ తెలుసు... 
కాంగ్రెస్‌ నేతలు సైతం అడ్డం పొడుగు మాట్లాడుతున్నారు. బీసీలకు అన్యాయం జరిగిందంటున్నారు. బీసీలపై ఎవరికి ప్రేమ ఉందో ప్రజలకు తెలుసు. గతంలో టీడీపీ, కాంగ్రెస్‌ ప్రభుత్వాలు బీసీలకు ఏం చేశాయో తెలియదా? కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాల విధానాలతో చెప్పులు కుట్టేవారు తప్ప.. అన్ని కులవృత్తులు ధ్వంసమయ్యాయి. రెండు ప్రభుత్వాలు బీసీలను నాశనం చేశాయి. బీసీల హక్కులను, వృత్తులను హరించి.. వారు ఆత్మహత్యలు చేసుకునేలా చేశాయి. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రాక ముందు రాష్ట్రంలో 19 బీసీ గురుకులాలు ఉండేవి. ఇప్పుడు 261కి చేరాయి. ప్రతి మండలంలో ఒక బీసీ గురుకులం ఉన్నా తక్కువే అనేది మా అభిప్రాయం. భారతదేశంలో మార్కెట్‌ కమిటీలో బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చిన ఏకైక ప్రభుత్వం మాదే. ఎంబీసీల కోసం ఇక్కడ ఏర్పాటు చేసినట్లుగా దేశంలో ఏ ప్రభుత్వం చేయలేదు.

చేనేత కార్మికుల బతుకులు మార్చేందుకు బతుకమ్మ చీరలు పథకం తెచ్చాం. గీత కార్మికులకు పన్నులు రద్దు చేశాం. సెలూన్లకు సరఫరా చేసే కరెంటును గృహ అవవసరాల కేటగిరీకి మార్చాం. ప్రొటోకాల్‌పరంగా ముఖ్యమంత్రి తర్వాత స్థాయిలోని శాసనమండలి చైర్మన్, శాసనసభ స్పీకర్‌ పోస్టులను బీసీలకే ఇచ్చాం. కీలకమైన 15 కార్పొరేషన్‌ చైర్మన్, 50 మార్కెట్‌ కమిటీ చైర్మన్, విప్‌ వంటి ఇతర పదవులను ఈ వర్గాలకు ఇచ్చాం. చట్టసభలో బీసీలకు 33 శాతం రిజర్వేషన్‌ ఉండాలని అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించాం. ఎస్సీ, ఎస్టీలకే ఉన్న ఓవర్సీస్‌ స్కాలర్‌ షిప్‌ పథకాన్ని బీసీలకు వర్తింపజేసి ఈ మొత్తాన్ని రూ.5 లక్షల నుంచి రూ.20 లక్షలకు పెంచాం. బీసీ కులాలకు హైదరాబాద్‌లో ఆత్మగౌరవ భవనాలు నిర్మించేందుకు స్థలాలు కేటాయించాం. రాష్ట్ర రాజధానిలో ఈ వర్గాలు తమ ఉనికిని చాటుకునేలా ఈ భవనాలను నిర్మిస్తున్నాం. టీఆర్‌ఎస్‌ పార్టీలోనూ 65 శాతం పదవులను బీసీ వర్గాలకు కేటాయించాం. రాజకీయాల్లో ఏది పడితే అది మాట్లాడొద్దు. ప్రజలు బుద్ధి చెప్పినా బుద్ధి తెచ్చుకోవడంలేదు. 

పంచాయతీపై వారిది విచిత్ర వైఖరి... 
గ్రామపంచాయతీల్లో బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్, బీజేపీ, టీడీపీల వైఖరి విచిత్రంగా ఉంది. పంచాయతీ ఎన్నికలను గడువులోపు నిర్వహించాలనే ఉద్దేశంతో అసెంబ్లీలో ప్రత్యేక చట్టం తెచ్చాం. అందులోనే 61.19 శాతం రిజర్వేషన్లు పెట్టాం. పంచాయతీల్లో రిజర్వేషన్లు 50 శాతమే ఉండాలని కాంగ్రెస్‌కు చెందిన సర్పంచ్‌ స్వప్నరెడ్డి, సర్పంచ్‌ల సంఘం నేత గోపాల్‌రెడ్డి కోర్టుకు వెళ్లారు. అప్పుడు మహాకూటమి పేరుతో తిరిగిన పార్టీల నేతలు ఇలా చేశారు. హైకోర్టు దీనిపై ఇచ్చిన తీర్పును సవాల్‌ చేస్తూ సుప్రీంకోర్టుకు వెళ్లాం. అక్కడా కొట్టేశారు. వంద రోజులలోపు(జనవరి 10లోపు) పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఆదేశాల ప్రకారం రిజర్వేషన్లను పాటిస్తూ గడువులోపు ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధమయ్యాం. దీనికి భిన్నంగా వ్యవహరిస్తే కోర్టు ధిక్కారం అవుతుంది. పంచాయతీల్లో రిజర్వేషన్లు 50 శాతానికి మించొద్దని హైకోర్టుకు వెళ్లినవారే ఇప్పుడు బీసీల కోటా తగ్గిందని అఖిలపక్షం పేరుతో గాలి మాటలు మాట్లాడుతున్నారు. కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్‌ ఏకంగా బీసీల్లోని కులాల ప్రకారం రిజర్వేషన్లు చేయాలని కోర్టుకు వెళ్లారు. రాష్ట్రంలోని 1.13 లక్షల వార్డుల్లో కులాలవారీగా లెక్కలు వేసి రిజర్వేషన్లు చేయడం అంటే ఐదేళ్లయినా పూర్తి కాదు. హైకోర్టు ఆదేశాల ప్రకారం జనవరిలోనే పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తాం. 

అసెంబ్లీ మనుగడలోకి వచ్చినట్టే... 
అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత రిటర్నింగ్‌ అధికారుల నుంచి పత్రం వచ్చాక ఎమ్మెల్యేలే. శాసనసభ జరిగితేనే ఎమ్మెల్యేలు అనేది కరెక్టు కాదు. ఎన్నికల సంఘం గవర్నర్‌కు ఎమ్మెల్యేల జాబితా ఇచ్చిన వెంటనే శాసనసభ మనుగడలోకి వస్తుంది. అందరూ పూర్తిస్థాయి ఎమ్మెల్యేలే. అసెంబ్లీలో ప్రమాణం ఓ ప్రక్రియ. శాసనసభ వ్యవహారాల్లో రాజ్యాంగ ప్రకారం వ్యవహరిస్తామని ప్రమాణం చేస్తారు. అసెంబ్లీ గెజిట్‌ వచ్చినరోజే సభ మనుగడలోకి వచ్చినట్లు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఒకసారి 53 రోజుల వరకు అసెంబ్లీ సమావేశం కాలేదు. 2014లోనూ 29 రోజుల వరకు ఇలా జరిగింది. మంత్రివర్గ విస్తరణపై తొందరేం లేదు. గతంలోలాగా కాకుండా మార్పులు చేస్తాం. సామీప్యత ఉన్న శాఖలు ఒకేచోట ఉండేలా పరిశీలిస్తున్నాం. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిపై దీనిపై కసరత్తు చేస్తున్నారు. వ్యవసాయం, మార్కెటింగ్, పౌర సరఫరాలు ఒక దగ్గరే ఉంటే బాగుంటుంది. గతంలో విద్య, వైద్య శాఖలలో ఇలాగే చేశాం. సా మాజిక లెక్కలను చూసేటప్పు డు కేవలం మంత్రులనే లెక్కిం చొద్దు. స్పీకర్, మండలి చైర్మన్, ఇతర రాజ్యాంగ పదవులను కూడా పరిగణలోకి తీసుకోవాలి. 

ఫెడరల్‌ ఫ్రంట్‌పై తొందరేమీ లేదు...  
బీజేపీ, కాంగ్రెస్‌ లేని ఫెడరల్‌ ఫ్రంట్‌ను తీర్చిదిద్దుతాం. సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరితో, కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌తోనూ మాట్లాడా. ఫెడరల్‌ ఫ్రంట్‌పై మాకు తొందరేమీ లేదు. ఒకరోజు ముందు కావచ్చు.. వెనుక కావచ్చు. చంద్రబాబుతో జై తెలంగాణ అనిపించలేదా? ఫెడరల్‌ ఫ్రంట్‌ ఆర్థిక, వ్యవసాయ విధానాలను ఇంకా ప్రకటించలేదు. ఆ తర్వాత అందరూ అదే బాటలో వెళ్లేలా ఉంటుంది. దేశ ప్రజలకు లాభం జరగాలి. అదే మా ఎజెండా.  రైతుబంధును దేశం మొత్తం అనుసరిస్తోంది. కేంద్ర ప్రభుత్వం సైతం దీని గురించి తెలుసుకుంటోంది. రైతుబంధు, రైతు బీమా, కనీస మద్దతు ధర, భూరికార్డుల ప్రక్షాళనలపై ప్రధానమంత్రి మోదీకి వివరించాను. ప్రజల సమస్యలపై ప్రధానికి లేఖలు ఇవ్వడం మా కర్తవ్యం. ప్రజల అవసరం కోసం రాజ్యాంగాన్ని ఎన్నిసార్లయినా మార్చుకోవచ్చు’అని పేర్కొన్నారు.  

ప్రతిపక్ష ఎమ్మెల్యేలు వస్తే... 
ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేలు నా వద్దకు వచ్చి చేరతామంటే ఏం చేస్తాం. నా స్థానంలో మీరే ఉంటే ఏం చేస్తారు(విలేకరులను ఉద్దేశించి) చెప్పండి. కేంద్రంలో క్రియాశీలపాత్ర పోషించాలంటే వచ్చే ఎన్నికల్లో లోక్‌సభ సీట్లను గెలుచుకోవాలి. ఇందుకోసం రాజకీయ నిర్ణయాలు ఉంటాయి. పార్లమెంటరీ కార్యదర్శుల విధానంపై కోర్టుకు వెళ్తున్నాం. ప్రస్తుతం ఛత్తీస్‌గఢ్, ఢిల్లీ, జార్ఖండ్‌లలో ఈ పదవులు ఉన్నాయి. కర్ణాటకలోనూ ఇటీవలే అమల్లోకి తెచ్చారు. పార్లమెంటరీ కార్యదర్శుల విధానం మంచింది. ఒకటి రెండుసార్లు ఎమ్మెల్యేలు అయినవారికి పరిపాలన పరమైన అవగాహన వచ్చేందుకు బాగా ఉపయోగపడుతుంది. 

అది ఎన్టీఆర్‌ పుణ్యమే... 
వెనుకబడిన వర్గాలకు రాజకీయాల్లో అవకాశాలు కల్పించింది కచ్చితంగా ఎన్టీఆరే. ఆయన ఎవరైనా ఉన్నమాట చెప్పుకోవాలి. ఇప్పుడు ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, జెడ్పీ చైర్మన్, కార్పొరేషన్‌ చైర్మన్, డీసీసీబీ చైర్మన్‌ ఇలా ఏ పదవి అయినా బీసీలకు ఇవ్వాలనుకున్నప్పుడు నాయకులు రెడీగా ఉన్నారంటే అది ఎన్టీ ఆర్‌ ఇచ్చిన అవకాశాలతోనే సాధ్యమవుతోంది.  

ఇడియట్స్‌ను ఇడియట్సే అంటాం...  
ఇడియట్స్‌లాగా మాట్లాడితే ఇడియట్సే అంటాం. వీళ్ల బతుకులకు 20 సీట్లు కూడా రాలేదు. ప్రజలు బుద్ధి చెప్పినా కనీసం 6 నెలలు కూడా ఆగడంలేదు. అప్పుడే బజార్లోకి వచ్చి, ఈవీఎంల ట్యాంపరింగ్‌ అని మాట్లాడుతున్నారు. ఇడియట్లు మాట్లాడుకునే ముచ్చట్లు ఇవి. ఒకేసారి ఐదు రాష్ట్రాల ఎన్నికలు జరిగాయి. మూడు రాష్ట్రా్టల్లో కాంగ్రెస్‌ గెలిచింది. మేం వంద సీట్లు అనుకున్నాం. ఖమ్మం జిల్లాలో మా పార్టీ ఓడిపోయింది. మా పార్టీ నేతల వల్లే ఇలా జరిగింది. ఎన్నికలలో ఓటమిని అంగీకరించలేని ధీరత్వం లేనివారు నాయకులు ఎలా అవుతారు. ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి మెదడు ఉందా? సిగ్గు ఉండాలి. ఇడియట్స్‌ బుద్ధి తక్కువ ఆరోపణలు చేస్తారు. వాళ్లు ట్యాంపరింగ్, ట్యాంపరింగ్‌ అంటే... మేం బేవకూఫ్, బేవకూఫ్‌ అంటాం. ఏది పడితే అది మాట్లా డితే ప్రజలు సహించరు. ఎన్నికలలో ప్రజలు ఇదే స్పష్టంచేసినా, వారు మారడంలేదు. వాళ్లు రూ.2 లక్షల రుణమాఫీ అన్నారు. మేం రూ.లక్ష మాఫీ చేస్తామని చెప్పాం. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేసిన విషయాలను ప్రజలకు వివరించాం. వారు విశ్వసించారు. మా పార్టీని గెలిపించారు. 

సచివాలయానికి రానక్కర్లేదు 
కేసీఆర్‌ సచివాలయానికి రావడంలేదని ఏవేవో మాట్లాడారు. కేసీఆర్‌ సచివాలయానికి రావాల్సిన అవసరంలేదని ప్రజలు తీర్పు ఇచ్చా రు. బైసన్‌పోలో మైదానంలో రూ.250 కోట్లతో సచివాలయం, అసెంబ్లీ, కళాభారతి నిర్మిస్తాం. అవసరమైతే ఇంకో రూ.250 కోట్లు అవుతాయి. ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు పెంపుపై తొందరలేదు. ఈ నెలాఖరులో రిటైరయ్యే పది ఇరవై మంది కోసం తొందరపడి నిర్ణయం తీసుకోం. ముందుగా చెప్పినట్లు అన్నీ పరిశీలించాకే నిర్ణయాలు తీసుకుంటాం. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement