ప్లీనరీలో మాట్లాడుతున్న సీఎం కేసీఆర్
సాక్షి, హైదరాబాద్ : 2001లో ఏప్రిల్ 27న తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్‌ఎస్)ని ప్రారంభించిన సమయంలో మొటికలు విరిచిన వారు, అయ్యే పనేనా ఇది అన్న సంఘటనలు చాలా ఉన్నాయని పార్టీ అధ్యక్షుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు అన్నారు. శుక్రవారం కొంపల్లిలో నిర్వహిస్తున్న టీఆర్‌ఎస్ 17వ ప్లీనరీలో ఆయన ప్రారంభోపన్యాసం చేశారు. అనేక అనుమానాలను పటాపంచెలు చేస్తూ.. 14 ఏళ్లుగా మిశ్రమ ఫలితాలను సాధిస్తూ ఆత్మవిశ్వాసంతో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామని అన్నారు.
ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమ సమయంలో ఆంధ్రప్రదేశ్ నుంచి ఢిల్లీకి వెళ్తున్నానని, తిరిగి తెలంగాణ రాజధాని హైదరాబాద్ గడ్డమీదే అడుగుపెడతానని చెప్పి అలానే చేశానని గుర్తు చేశారు. ‘ఒక స్పష్టమైన ప్రకటనతో 2014 ఎన్నికల బరిలోకి దిగాం. తెలంగాణ ప్రజలు వాళ్ల గుండె తీసి టీఆర్‌ఎస్ చేతిలో పెట్టారు. అందుకు ప్రతిగా నీతి, నిజాయితీగా నోరు, కడుపు కట్టుకుని పని చేస్తున్నాం. ఎవరెన్ని అవాకులు చవాకులు పేలినా దేశంలో నిజాయితీగా పని చేస్తున్నది టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఒక్కటే.
ప్రభుత్వ రంగ సంస్థలకు విద్యుత్ ప్రాజెక్టు అప్పజెప్పడంపై జాతీయ నాయకుల నుంచి ఎన్నో ప్రశంసలు అందాయి. సంక్షేమ కార్యక్రమాల ఫలాలను రాష్ట్ర ప్రజలు ప్రత్యక్షంగా అందుకుంటున్నారు. భారతదేశంలో ఏ రాష్ట్రం చేయని అనేక సాహస కార్యాలను తెలంగాణ ప్రభుత్వం తలపెడుతోంది. అనేక ఏళ్లు గిరిజన బిడ్డలు తండాలు, గ్రామాలను పంచాయితీలు చేయాలని కోరారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం 4 వేల తండాలను పంచాయితీలు చేసింది.
ఎన్నో ఏళ్లుగా వివిధ రాజకీయ పార్టీలు ఈ మేరకు హామీలను ఇచ్చి నిలబెట్టుకోలేకపోయాయి. మాటిచ్చి తండాలను పంచాయితీలు చేసిన పార్టీ టీఆర్‌ఎస్ ఒక్కటే. రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటు కూడా ఓ చరిత్రాత్మక నిర్ణయం. పరిపాలన సంస్కరణలలో భాగంగా 10 జిల్లాలను 31 జిల్లాలుగా చేశాం. ప్రజలు కొత్త జిల్లాలపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రతి పనికి వందల కిలోమీటర్లు వెళ్లే భారం వారికి తప్పింది.
బెంగుళూరులో దేవెగౌడతో మాట్లాడిన సమయంలో తెలంగాణ పథకాల ప్రస్తావన వచ్చింది. అవే పథకాలను కర్ణాటకలో కూడా అమలు చేయమని డిమాండ్ చేస్తున్నట్లు ఆయన చెప్పారు. మహారాష్ట్ర ప్రజలు కూడా తెలంగాణ లాంటి సంక్షేమ కార్యక్రమాలు కావాలని ప్రభుత్వాన్ని అడుగుతున్నారు. ఇది మంచి శుభ పరిణామం. దేశంలో ట్రాఫిక్ పోలీసులకు లైఫ్ రిస్క్ అలవెన్సులు 30 శాతం ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. అంగన్‌వాడీలు, ఆశావర్కర్లకు, హోంగార్డులకు ఎక్కువ వేతనాలు ఇస్తున్న ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్(ఈవోడీబీ)లో తొలిస్థానంలో ఉంద’ని కేసీఆర్ రాష్ట్ర విజయాల గురించి ప్లీనరీలో చెప్పుకొచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment