
కరీంనగర్‌లో సభలో కేసీఆర్ కీలక ప్రకటన చేశారు.
సాక్షి, కరీంనగర్: కాంగ్రెస్, బీజేపీ ముక్త భారత్ రావాలని తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు పిలుపునిచ్చారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం కరీంనగర్‌లో జరిగిన సభలో ఆయన కీలక ప్రకటన చేశారు. అవసరమైతే జాతీయ పార్టీ స్థాపిస్తానని ప్రకటించారు. దేశ రాజకీయాలను ప్రభావితం చేయడానికి తన చివరి రక్తపు బొట్టు వరకు పోరాడతానని ప్రకటించారు. దేశ రాజకీయాలను తెలంగాణ ప్రభావితం చేయాలని, దేశానికి తెలంగాణ చోదక శక్తి కావాలన్నారు. దేశ రాజకీయాల్లో చాలా మార్పులు రావాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు.
(3 నెలల్లో 3 వేల సార్లు తిట్టాడు: కేసీఆర్)
‘కరీంనగర్‌లో మీ ఆజ్ఞ తీసుకుని ఈ ఎన్నికల తర్వాత సంభవించే పరిణమాలను చూసి ఒకవేళ అవసరమైతే జాతీయ పార్టీని స్థాపించి భారత దేశం మొత్తాన్ని ఒక్కటి చేస్తా. ఈ మాట కరీంనగర్ గడ్డ నుంచే చెప్పాలనుకున్నా. ఇది నాకు కలిసొచ్చిన పోరాటాల గడ్డ. ఎక్కడో చోట ఎవరో ఒకరు నడుంకట్టాలి. ఆనాడు నేను పూనుకోకపోతే తెలంగాణ రాష్ట్రం వచ్చేది కాదు. దేశ రాజకీయాలను ప్రభావితం చేయాల్సిన సమయం దగ్గర పడుతోంది. కాంగ్రెస్, బీజేపీ ముక్త భారత్ కావాలి. ఈ రెండు పార్టీలు దేశానికి ఏమీ చేయలేదు. పేదలు, రైతులను పట్టించుకోలేదు. దేశం బాగుపడాలంటే వ్యవస్థాగతమైన మార్పులు రావాలి. అటువంటి మార్పులు రావాలంటే దేశ రాజకీయాలు తీవ్రంగా ప్రభావితం కావాలి. దేశ రాజకీయాల్లో తప్పనిసరిగా తెలంగాణ పెద్ద పాత్ర పోషించాలి. మీరు 16 మంది ఎంపీలను గెలిపిస్తే నేను 160 మంది ఎంపీలను జమచేస్తా. కరీంనగర్ ప్రజల దీవెనలతో ఫెడరల్ ఫ్రంట్ రాజకీయాలను బలోపేతం చేసి, ఈ దేశాన్ని దుర్మార్గుల నుంచి విముక్తి చేసి అద్భుతమైన భారత దేశ నిర్మాణానికి ముందడుగు వేస్తాన’ని కేసీఆర్ అన్నారు.