సాక్షి, హైదరాబాద్: ఏపీ సీఎం చంద్రబాబు ఆంధ్రవాళ్లకు పట్టిన శని అని టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ వ్యాఖ్యానించారు. తెలంగాణలో చంద్రబాబు అవసరం ఇంకా ఏముందని ప్రశ్నించారు. ఎన్నికల తరుణంలో రాజకీయాల కోసం తెలంగాణలో ఉడుములాగా సొచ్చారని విమర్శించారు. టీడీపీతో పొత్తు పెట్టుకుంటే కాంగ్రెస్ భస్మమైపోతుందని అన్నారు. ఎన్నికల్లో టీఆర్‌ఎస్ వందకుపైగా సీట్లతో విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల తర్వాత గడ్డం గీక్కునేది ఎవరో, ఉంచుకునేది ఎవరో తెలుస్తుందని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఇక్కడ ఉన్న వాళ్లంతా తెలంగాణ వారేనని పునరుద్ఘాటించారు. మంగళవారం టీఆర్‌ఎస్ పాక్షిక మేనిఫెస్టో ప్రకటించిన సందర్భంగా కేసీఆర్ మీడియాతో మాట్లాడారు.
ఏపీలో ఒక్క హామీని నెరవేర్చలేదు...
‘చంద్రబాబు ఉడుము సొచ్చినట్లు వచ్చిండు. ఆయన వచ్చే వరకు సమస్య లేదు. గతంలో ఇదే చంద్రబాబు గ్యాంగ్ తెలంగాణ వస్తే ఆంధ్రోళ్లను తరిమికొడతరని, ఆస్తులు గుంజుకుంటరని ప్రచారం చేశారు. నాలుగేళ్లలో ఎక్కడా ఏ సమస్య రాలేదు. తెలంగాణ సమాజం ప్రత్యేకత అదే. తెలంగాణలో ఉన్న వాళ్లంతా తెలంగాణ బిడ్డలే. బాబు ఇక్కడ పాలించినప్పుడు పెట్టిన జూదాలు, క్లబ్బులు, వేటకొడవళ్లు, అభద్రత, హత్యలు ఇప్పుడు లేవు. చంద్రబాబుకు ఇక్కడేం పని. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ఇక్కడ స్థిరపడిన 12 మంది వేర్వేరు కులాల వారికి మేం టికెట్లిచ్చాం. అందరూ గెలిచారు. ఇంకా ఆంధ్రావాళ్లమనే భావన వీడాలి. ఎప్పుడో డెబ్బై ఏళ్ల కింద బాన్సువాడ, కోదాడ, హైదరాబాద్‌లో స్థిరపడిన వారు ఇక్కడి వారితో కలిసిపోయారు. చంద్రబాబు అక్కడ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన ఒక్క హామీని పూర్తి చేయలేదు. రాహుల్ వస్తే నేను భయపడుతున్నా అని అంటున్నరు. ఎన్నికలకు వెళ్లిందే నేను కదా.. నాకేం భయం.
వెంటనే పంచాయతీ ఎన్నికలు..
శాసనసభ ఎన్నికలు జరిగిన వెంటనే గ్రామపంచాయతీ ఎన్నికలు వస్తాయని కేసీఆర్ తెలిపారు. హైకోర్టు తీర్పు ప్రకారం జనవరిలో ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుందన్నారు. ‘అసెంబ్లీ ఎన్నికలు పూర్తయిన పది, పదిహేను రోజులకు సర్పంచ్ ఎన్నికలు వస్తయ్. ఆ వెంటనే రెండుమూడు నెలల్లోనే పార్లమెంట్ ఎన్నికలు ఉంటయ్. అవన్నీ పూర్తయ్యాకే నిరుద్యోగ భృతి అమలుపై నిర్ణయం తీసుకుంటం’అని అన్నారు.
కేంద్రం ఏమీ ఇవ్వలేదు..
రాష్ట్రానికి కేంద్రం ఎలాంటి సాయం చేయలేదని కేసీఆర్ చెప్పారు. నాలుగేళ్లలో కేంద్రం నుంచి అదనంగా నయాపైసా రాలేదన్నారు. ‘మిషన్ భగీరథ మంచి పథకమని ప్రధాని మోదీ స్వయంగా గజ్వేల్‌కు వచ్చి ప్రారంభించారు. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ అమలుకు రూ.24 వేల కోట్లివ్వాలని నీతి ఆయోగ్ ప్రతిపాదించింది. అయినా కేంద్రం స్పందించలేదు. కేంద్ర ప్రభుత్వం న్యాయబద్ధంగా రావాల్సిన పన్నుల వాటాను మాత్రమే విడుదల చేస్తోంది’అని అన్నారు.
అభివృద్ధి ఆగొద్దనే ఎన్నికలకు...
అభివృద్ధి ఆగొద్దని ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయించుకున్నం. తెలంగాణలో ఉడుములు, పాములు చొరబడకుండా కంచెలు వేయాలి. వంద సీట్లు దాటడమే మా లక్ష్యం. పరిస్థితి తెలుసుకోకుండానే అసెంబ్లీని రద్దు చేస్తామా. ఉమ్మడి జిల్లాల ప్రకారం చూస్తే నాలుగైదు జిల్లాల్లో అన్ని స్థానాలు గెలుస్తున్నం. దక్షిణ తెలంగాణలో గత ఎన్నికల్లోనూ టీఆర్‌ఎస్ ఆధిక్యంలో ఉంది. మా మిగిలిన స్థానాల ముచ్చట అప్పుడే ఎందుకు. కాంగ్రెస్ నేత జైపాల్‌రెడ్డి వయస్సు పెరిగి బ్యాలెన్స్ తప్పుతున్నాడని గతంలోనే చెప్పా. అవినీతి లేని ఏకైక ప్రభుత్వం మాదే. ఇక్కడ అవినీతి ఉంటే 19.70 శాతం ఆర్థిక వృద్ధి రేటు ఎలా సాధ్యమవుతది. ఏమైనా చేస్తే పరిపాలన వదిలి ప్రతిపక్షాల మీద పడ్డరని అంటరని ఊకున్న. పోయిన టర్మ్‌లో ఎవరినీ ముట్టలేదు. ఈసారి ఎవరినీ వదలం. ఇప్పుడు అప్పు తెచ్చి ప్రాజెక్టులు కట్టకపోతే భవిష్యత్ తరాలు క్షమిస్తయా? లక్ష్యం ప్రకారం కోటి ఎకరాలకు సాగునీరిస్తం. దసరా తర్వాత పూర్తిస్థాయి ప్రచారం మొదలుపెడతం. కచ్చితంగా గెలుపు మాదే. కాంగ్రెస్ వాళ్లపై ప్రజలకు నమ్మకం లేదు. త్వరలోనే పూర్తిస్థాయి మేనిఫెస్టోను ప్రకటిస్తం’అని వివరించారు.
Published Wed, Oct 17 2018 2:43 AM | Last Updated on Wed, Oct 17 2018 11:14 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment