తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు
రైతు సమస్యలపై 70 నిమిషాలు మాట్లాడితే 2 నిమిషాల్లో వచ్చినదాన్ని పట్టుకుని ‘గాడు’ అని చిత్రీకరించి చొక్కాలు చించుకుంటున్నారు. మిగిలిన 68 నిమిషాల్లో మాట్లాడిన అంశాలకు భయపడే గాయి గాయి చేస్తున్నరు.
సాక్షి, హైదరాబాద్ : ‘‘తెలంగాణవాడి సత్తా ఏంటో దేశానికి చూపిస్తా. ఐదారేళ్లు మినహా దేశాన్ని కాంగ్రెస్, బీజేపీలే పాలించాయి. దేశాన్ని 70 ఏళ్లు పాలించిన కాంగ్రెస్, బీజేపీతో అధికార మార్పిడి తప్ప గుణాత్మకమైన మార్పు ఏమీ లేదు. గుణాత్మక మార్పు కోసం కొత్త రాజకీయ కూటమి రావాల్సిందే. ఇందుకు ఇప్పటికే ప్రయత్నాలు ఆరంభమయ్యాయి.
దేశంలోని చాలా పార్టీల నేతలతో మాట్లాడుతున్నాం. నేనే కాకుండా మాట్లాడాల్సిన వాళ్లు కూడా మాట్లాడుతున్నరు. మొన్న ఢిల్లీలో సీతారాం ఏచూరితో మాట్లాడిన. దేశంలో గుణాత్మక మార్పుకోసం పెద్ద ప్రయత్నమే జరుగుతోంది. నాకున్న శక్తి మేరకు అవసరమైతే దానికి నేను నాయకత్వం వహిస్తా..’’అని సీఎం కె.చంద్రశేఖర్‌రావు ఉద్ఘాటించారు.
థర్డ్ ఫ్రంట్ కావొచ్చు, మరో ఫ్రంట్ కావొచ్చు.. మార్పు కోసమే దేశ ప్రజలు ఎదురుచూస్తున్నారని స్పష్టం చేశారు. శనివారం సాయంత్రం ప్రగతి భవన్‌లో విలేకరుల సమావేశంలో సీఎం మాట్లాడారు. ఈ సందర్భంగా దేశ రాజకీయాలకు సంబంధించిన అంశాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, హోంమంత్రి నాయిని నర్సింహ్మారెడ్డి, పార్టీ ఎంపీలు 16 మందితో కలిసి విలేకరులతో మాట్లాడారు. ఆరోగ్యం సహకరిస్తే, అవకాశం వస్తే తెలంగాణవాడి సత్తా ఏమిటో ప్రధాని మోదీనే కలిసి చూపిస్తానన్నారు.
రాజకీయాల్లో ఊహించని మార్పులెన్నో జరుగుతాయంటూ.. అందుకు ఉదాహరణగా దేశంలో మూడు సందర్భాలను ఉటంకించారు. ‘‘జనతా పార్టీ పుట్టిన 60 రోజుల్లోనే అధికారంలోకి వచ్చింది. ఎన్టీఆర్ నేతృత్వంలో టీడీపీ 9 నెలలో అధికారంలోకి వచ్చింది. టీఆర్‌ఎస్ పుట్టిన 60 రోజులకే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రభంజనం సృష్టించింది. వచ్చే ఎన్నికల్లో వందశాతం మార్పు వస్తుంది.
దేశంలో కాంగ్రెస్, బీజేపీ మినహా మిగిలిన పార్టీలను ఏకం చేస్తా. అవసరమైతే దానికి నాయకత్వం కూడా వహిస్తా. ఇందుకు ఢిల్లీకి బహిరంగంగానే వెళ్తా. ఇందులో రహస్యమేమీ లేదు. ఢిల్లీకి వెళ్తే ముసుగు కప్పుకుని వెళ్ల. భాజాప్తా వెళ్లి రాజకీయంగానే అందరితో చర్చిస్తా’’అని అన్నారు. కాంగ్రెస్, బీజేపీయేతర కూటమి కోసం ఇప్పటికే చర్చలు జరుగుతున్నాయన్నారు. దేశాన్ని ఏకం చేయాల్సిన అవసరం ఉందని, ఇందులో ఎవరెవరు ఉంటారో ఇంకా స్పష్టత రాలేదన్నారు.
అదొక్కటి పట్టుకొని గాయిగాయి చేస్తున్నరు
దేశంలో రైతాంగం అసహనానికి గురవుతోందని, ఇంకా వారి సహనాన్ని పరీక్షించొద్దని సీఎం అన్నారు. ‘‘రైతుల సమస్యలపై 70 నిమిషాలు మాట్లాడితే కేవలం రెండు నిమిషాల్లో వచ్చినదాన్ని పట్టుకుని ‘గాడు’అని చిత్రీకరించి చొక్కాలు చించుకుంటున్నారు. మిగిలిన 68 నిమిషాల్లో మాట్లాడిన అంశాలకు భయపడి, ఈ రెండు నిమిషాలను పట్టుకు గాయిగాయి చేసి లొల్లి పెడుతున్నరు.
నేను చెప్పిన సిద్ధాంతాలు, అంశాల విషయంలో కాంగ్రెస్, బీజేపీలు దొందూదొందే. దేశంలో గుణాత్మక మార్పు రావడం లేదు. మార్పు రావాల్సిన అవసరముంది. చాలా సీరియస్‌గా ఏదో ఒకటి జరగాల్సిన అవసరం ఉంది. 70 ఏళ్ల నుంచి ఇదే మూసలోపోయి, ఈ దేశం ఇట్నే బీరిపోవాల్సిన అవసరం లేదు. దేశ రాజకీయాల్లో అనేక విషÄయాæ·ల్లో తప్పకుండా ప్రబలమైన మార్పు రావాలి. దానికి నేను కట్టుబడి ఉన్న. ఎట్టి పరిస్థితోలో దీనిపై పార్టీ నిలబడుతుంది’’అని స్పష్టంచేశారు. రాష్ట్రంలో బీజేపీని ఒక రాజకీయ పార్టీగానే గుర్తించబోమన్నారు.
బీజేపీకి ఇప్పుడున్న సీట్లు కాపాడుకోవడం కాదు, ఒక్క సీటు కూడా రాదని వ్యాఖ్యానించారు. ప్రజలకు సేవ చేసి, మెప్పించి అధికారంలోకి రావాలన్నారు. ఉత్తమ్‌కుమార్‌రెడ్డిలాగా గడ్డాలు పెంచి, సన్యాసుల్లో కలిసిపోతామంటే ప్రజలు గెలిపిస్తరా అని ప్రశ్నించారు. రాజకీయ సన్యాసాలు అంటూ పాతకాలం రాజకీయాలు మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. అలాగే ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తారో లేదో చెప్పాలని కేంద్రాన్ని నిలదీశారు. ఈశాన్య రాష్ట్రాల్లో బీజేపీ గెలుపుపై మాట్లాడుతూ.. అలాంటి విజయాలు సహజమేనని పేర్కొన్నారు. ఈ నిమిషానికి ఈ ఫలితాలుంటాయని, రేపటికి మారిపోతాయని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment