
ఏపీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి
సాక్షి, రాజమహేంద్రవరం: కేంద్ర బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌కు జరిగిన అన్యాయం జాతీయ అంశంగా మారిందని ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి అన్నారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని వ్యతిరేకిస్తూ జాతీయస్థాయిలో వివిధ పార్టీలు గళం విప్పుతున్నాయని చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జోక్యం చేసుకుని ఏపీకి న్యాయం చేయాలని కోరారు.
రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయం కేంద్రానికి కనబడ్డం లేదా? విభజన చట్టం అమలు కోసం కేంద్రం ముందు ఏపీ మోకరిల్లాలా?.. సమాఖ్య వ్యవస్థలో ఇదేం దుస్థితి అని వాపోయారు. మిత్రపక్షమైన తమకే ఇంతటి వివక్ష వుందని గ్రహించిన ఇతర ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు సందిగ్ధంలో పడ్డాయన్నారు. మార్చి 5 వరకు సహనంతో, ఆశగా ఎదురు చూస్తామని.. ఐదు అంశాల్లో కొన్నైనా నెరవేరతాయన్న నమ్మకం టీడీపీ ఎంపీలు వ్యక్తం చేస్తున్నారని తెలిపారు.
పవన్‌పై విరుద్ధ ప్రకటనలు
రాష్ట్రానికి కేంద్రం ఎన్ని నిధులు ఇచ్చిందో తేల్చేందుకు నిజనిర్ధారణపై కమిటీ ఏర్పాటుచేయనున్నట్టు జనసేన పవన్ కళ్యాణ్ చేసిన ప్రకటనపై టీడీపీ నాయకులు భిన్నంగా స్పందించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎవరినైనా కలుపుకుపోతామని రాజమహేంద్రవరం ఎంపీ మురళీమోహన్ ప్రకటించారు. ఎన్నికల్లో పోటీ చేయని జనసేన కమిటీ వేయడం ఏమిటన్న అభిప్రాయాన్ని కేఈ కృష్ణమూర్తి వ్యక్తం చేశారు. ‘సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసినవాళ్లు, చేయనివాళ్లు కమిటీలు వేస్తే ఏం మాట్లాడతామ’ని ఆయన వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment