
కేఈ కృష్ణమూర్తి, చంద్రబాబు (ఫైల్)
సాక్షి, అమరావతి: దేవదాయ ధర్మధాయ శాఖ బాధ్యతలను ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తికి అదనంగా అప్పగించారు. బీజేపీకి చెందిన మంత్రులు మాణిక్యాలరావు, కామినేని శ్రీనివాస్‌లు ఈ నెల 8వ తేదీన తమ పదవులకు రాజీనామా చేసిన తర్వాత దేవదాయ శాఖతో పాటు వైద్య ఆరోగ్య శాఖలు రెండింటినీ ముఖ్యమంత్రి చంద్రబాబు వద్దనే ఉంచుకున్నారు. ఈ క్రమంలో ముఖ్యమంత్రి వద్ద ఉన్న పదవుల్లో దేవదాయ శాఖను మాత్రం కేఈ కృష్ణమూర్తికి అదనంగా అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్‌కుమార్ ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు.
కాగా, దేవదాయ శాఖ హడావుడిగా మరొకరి అప్పగించాలని చంద్రబాబు నిర్ణయం తీసుకోవడం వెనుక రాజకీయ వర్గాల్లో అసక్తికరమైన చర్చ జరుగుతోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచీ దేవదాయ శాఖ బాధ్యతలు చేపట్టిన నాయకులు పలువురు కొద్ది కాలానికే పదవీచ్యుతులు అవుతారన్న ప్రచారం ఉంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఆ పదవిని తన వద్ద ఉంచుకోవడానికి ఏ మాత్రం ఆసక్తి చూపలేదని తెలుగుదేశం పార్టీ వర్గాలే అంటున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment