
కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ (ఫైల్)
సాక్షి, తిరువనంతపురం: పినరయి విజయన్ సారథ్యంలోని లెఫ్ట్ ఫ్రంట్ అభ్యర్థులకే ఓటేయండని కేరళలోని ప్రముఖ చర్చి అక్కడి క్రైస్తవులకు పిలుపునివ్వడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ‘రానున్న లోక్‌సభ ఎన్నికల్లో మనకు సహాయం చేసిన లెఫ్ట్ కూటమి అభ్యర్థులకే ఓటేయాల’ని ఓ చర్చి మతబోధకుడు క్రైస్తవులకు సూచించారు. దీనిపై కేరళ సీపీఎం నాయకుడు సునీత్ చోప్రా మాట్లాడుతూ.. ‘హిందువుల మీద దాడులపై, హిందూ ధార్మిక సంస్థలు మాట్లాడగా లేనిది, బీజేపీకి ఓటేయొద్దని క్రైస్తవ చర్చిలు చెప్పడంలో తప్పేంట’ని ప్రశ్నించారు. అయితే, ఇది ముమ్మాటికీ ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించడమేనని ఈ మధ్యే కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన నాయకుడు టామ్ వడక్కన్ అభిప్రాయపడ్డారు.
ఈ వివాదం నేపథ్యంలో ఓటర్లును ప్రభావితం చేసే ఎటువంటి ప్రసంగాలను నిర్వహించొద్దని ఇదుక్కి జిల్లా చర్చి బిషప్ మార్ మ్యాథ్యూ.. చర్చి మతబోధకులకు హెచ్చరించినట్టు సమాచారం. ‘దీనివల్ల భవిష్యత్తులో చర్చి కార్యకలాపాలకు నష్టం వాటిల్లే అవకాశముంది. ప్రజలు ఎవరిని ఎన్నుకోవాలనే విషయంలో చాలా తెలివిగా, స్పృహతో ఉన్నారు. చర్చి మతబోధకులు ఇటువంటి విషయాల్లో ఏ పక్షానికీ తలొగ్గకుండా ఉండటమే మంచిద’ని బిషప్ మార్ మ్యాథ్యూ హితవు పలికారు. ఇకపోతే 2014 లోక్‌సభ ఎన్నికల్లో ఇదుక్కి బిషప్ మార్ మ్యాథ్యూ మద్దతుతో లెఫ్ట్ అభ్యర్థి జాయ్స్ జార్జ్ దాదాపు 50 వేల మెజార్టీతో గెలుపొందారు. అనేక చోట్ల చర్చి బిషప్‌లు ఎన్నికల్లో ప్రధాన పాత్ర పోషించే అవకాశం ఉండటంతో, పార్టీలు వారిని ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డాయి.
Comments
Please login to add a commentAdd a comment