నేడే సీడబ్ల్యూసీ భేటీ | Kharge, Wasnik front runners as CWC meets to pick chief | Sakshi
Sakshi News home page

నేడే సీడబ్ల్యూసీ భేటీ

Published Sat, Aug 10 2019 4:16 AM | Last Updated on Sat, Aug 10 2019 4:16 AM

Kharge, Wasnik front runners as CWC meets to pick chief - Sakshi

మల్లికార్జున ఖర్గే, ముకుల్‌ వాస్నిక్‌

సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: నాయకత్వలేమితో కొట్టుమిట్టాడుతున్న కాంగ్రెస్‌ పార్టీకి నూతన అధ్యక్షుడు ఎవరో మరికొన్ని గంటల్లో తెలియనుంది. లోక్‌సభ ఎన్నికల్లో ఘోర పరాజయం అనంతరం పార్టీ అధ్యక్ష పదవికి రాహుల్‌ రాజీనామా చేయడం, ఆ తర్వాత నుంచి ఆ స్థానం ఖాళీగా ఉండటం తెలిసిందే. కొత్త సారథిని ఎన్నుకునేందుకు పార్టీ అత్యున్నత నిర్ణాయక మండలి అయిన కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ (సీడబ్ల్యూసీ) శనివారం భేటీ కానుంది. కొత్త అధ్యక్షుడిని ఎంపిక చేయడంపై ఓ ఉన్నతస్థాయి సన్నాహక సమావేశాన్ని శుక్రవారమే కాంగ్రెస్‌ మాజీ అధ్యక్షురాలు సోనియా ఇంట్లో నిర్వహించారు. ఏకే ఆంటోనీ, అహ్మద్‌ పటేల్, కేసీ వేణుగోపాల్‌ తదితర కాంగ్రెస్‌ ప్రధాన నాయకులు ఈ సమావేశానికి హాజరయ్యారు. నూతన సారథి రేసులో ఇద్దరి పేర్లే వినబడుతున్నాయి. వారిలో ఒకరు కర్ణాటకకు చెందిన, లోక్‌సభలో కాంగ్రెస్‌ పక్ష నేతగా పనిచేసిన ఖర్గే కాగా, మరొకరు ముకుల్‌ వాస్నిక్‌.  

ఖర్గేకే ఎక్కువ అవకాశం..
మల్లికార్జున ఖర్గే తదుపరి అధ్యక్షుడిగా నియమితులయ్యే అవకాశాలు అత్యధికంగా ఉన్నాయని విశ్వసనీయ వర్గాలు చెప్పాయి. ఆయనకు వయస్సు ఎక్కువగా ఉండటం తప్ప మరో ప్రతికూలత ఏదీ లేదు. ప్రస్తుతం 78 ఏళ్ల వయసున్న ఖర్గే.. లోక్‌సభలో కాంగ్రెస్‌ పక్ష నేతగా ఉన్నప్పుడు బీజేపీని చేతనైన మేరకు సమర్థవంతంగా ఎదుర్కొన్నారు. ఇక ముకుల్‌ వాస్నిక్‌ కూడా కొత్త అధ్యక్షుడిగా నియమితులయ్యే అవకాశం ఉందని కొందరు అంటున్నప్పటికీ, ఆయనకు ప్రతికూలతలు ఎక్కువగా ఉన్నాయి. ముకుల్‌ వాస్నిక్‌ సమర్థుడు కాడనీ, వివాదాలకు కేంద్ర బిందువని పార్టీ నాయకులే చాలా మంది ఫిర్యాదు చేశారు.

మళ్లీ రాజ్యసభకు మన్మోహన్‌ సింగ్‌
మాజీ ప్రధాని మన్మోహన్‌ను మరోసారి రాజ్యసభకు పంపేందుకు కాగ్రెస్‌ సిద్ధమైంది. బీజేపీ రాజస్తాన్‌ అధ్యక్షుడిగా ఉంటూ రాజ్యసభ ఎంపీ అయిన మదన్‌ లాల్‌ సైనీ ఇటీవలే కన్నుమూయడంతో ఆయన స్థానం ప్రస్తుతం ఖాళీ అయ్యింది. ఇప్పుడు రాజస్తాన్‌లో కాంగ్రెస్‌ అధికారంలో ఉండటంతో ఆ సీటు కాంగ్రెస్‌కు దక్కనుంది. మన్మోహన్‌ 1991 నుంచి ఈ ఏడాది జూన్‌ వరకు అస్సాం నుంచి రాజ్యసభ ఎంపీగా ఉన్నారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement