సాక్షి, న్యూఢిల్లీ: రాత్రికి రాత్రి పరాయివారై పోవడమంటే ఇదే! అస్సాం జనాభాకు సంబంధించి ‘నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజెన్స్’ జూలై 30వ తేదీ ఉదయం పది గంటలకు విడుదల చేసిన జాబితాలో గల్లంతైన 40 లక్షల మందిలో భారత ఐదవ రాష్ట్రపతి ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ సమీప బంధువులు కూడా ఉన్నారు. దివంగత రాష్ట్రపతికి స్వయాన తమ్ముడి కొడుకైన జియావుద్దీన్ అలీ అహ్మద్ కుటుంబానికి జాతీయ పౌరసత్వ జాబితాలో చోటు లభించలేదు. 1951లో మొదటిసారి విడుదల చేసిన పౌరసత్వ జాబితా నుంచి 1971 వరకున్న అన్ని ఓటర్ల జాబితాలను తనిఖీ చేసినా తమ పూర్వికుల పేర్లు లేవని జియావుద్దీన్ ఆందోళన వ్యక్తం చేశారు.
మాజీ రాష్ట్రపతి ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ ఢిల్లీలో పుట్టి ఢిల్లీలో స్థిరపడినందున ఆయన పేరు అస్సాం పౌరుల జాబితాలో ఉండకపోవచ్చుగానీ భారత సైన్యంలో పనిచేసిన ఆయన తండ్రి కల్నల్ జల్నూర్ అస్సాంలో పుట్టి పెరిగారు. ఆయన పేరు కూడా లేకపోవడం ఆశ్చర్యం.
ఈ దేశ పౌరులమని నిరూపించుకునేందుకు ఓ భూమి కాగితాలు తప్ప అవసరమైన డాక్యుమెంట్లేవి జియావుద్దీన్ కుటుంబం వద్ద లేవు. భూమి కాగితాలు తీసుకెళ్లి స్థానిక ఎన్‌ఆర్‌సీ అధికారులకు చూపించగా గడువు ముగిశాక వచ్చావంటూ తిప్పి పంపించారట. 2015, ఆగస్టు 31వ తేదీలోగానే భారత పౌరసత్వాన్ని నిరూపించుకునేందుకు దరఖాస్తు చేసుకోవాలంటూ గడువు విధించిన విషయం తెల్సిందే. జియావుద్దీన్ అస్సాంలోని కామ్‌రూప్ జిల్లా, రంగియా గ్రామంలో నివసిస్తోంది. ఆయన తన పూర్వికులు 1971, మార్చి 24వ తేదీ కన్నా ముందు నుంచే భారత్‌లో నివసిస్తున్నట్లు రుజువు చేయడానికిగాను తన పూర్వికులున్న ఓటర్ల జాబితా కోసం అనేక ఊర్లు తిరిగారు. చివరకు తన తండ్రి పుట్టిన గోలాఘాట్‌కు కూడా వెళ్లారు. లాభం లేకపోయింది. ఆధారాలు సేకరించలేక పోయారు.
జియావుద్దీన్, ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ తమ్ముడు ఎంత్రాముద్దీన్ కుమారుడు. ఎంత్రాముద్దీన్, ఫక్రుద్దీన్‌ల తండ్రి జల్నూర్ అలీ అహ్మద్. అసలైన అస్సాం మూలవాసి. ఆయన మెడిసిన్ చదవి భారత సైన్యంలో కల్నల్‌గా రిటైర్ అయ్యారు. ఫక్రుద్దీన్ నలుగురు పిల్లల్లో ఇద్దరు పిల్లలు ఢిల్లీలో నివసిస్తున్నందున వారు పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకోలేదు. ఓ కూతురు పాకిస్థాన్‌ను పెళ్లి చేసుకొని ఆ దేశం వెళ్లిపోయింది. మరొకరు అస్సాంలోనే చనిపోయినట్లు జియాఉద్దీన్ తెలిపారు. జియాఉద్దీన్ తండ్రి ఎంత్రాముద్దీన్ ఇంజనీరు. పెళ్లి అనంతరం ఎంత్రాముద్దీన్ రంగియా గ్రామానికి మారారట. కానీ ఆయన వృత్తిరీత్యా ఎక్కువగా గువాహటిలోనే ఉండే వారట. అయితే తన పూర్వికులతో తనకున్న సంబంధాన్ని రుజువు చేసుకునే డాక్యుమెంట్లు జియాఉద్దీన్ సంపాదించలేక పోయారు.
ఇదే విషయమై ఎన్‌ఆర్‌సీ రాష్ట్ర కోఆర్డినేటర్ ప్రతీక్ హజేలాను మీడియా సంప్రతించగా.. భూములు, లేదా భూమికి సంబంధించిన టెనెన్సీ రికార్డులు, సిటిజెన్‌షిప్ సర్టిఫికెట్, శాశ్వత నివాస ధ్రువపత్రం, శరణార్థులుగా నమోదు సర్టిఫికెట్, పాస్‌పోర్టు, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ రికార్డులు, ప్రభుత్వం జారీ చేసిన ఏవైన లైసెన్సులు, ప్రభుత్వ ఉద్యోగ రికార్డులు, పుట్టిన సర్టిఫికెట్, బోర్డు లేదా యూనివర్శిటీ జారీ చేసిన విద్యా సర్టిఫికెట్లు, తపాలా శాఖలో ఖాతాలు తదితర సర్టిఫికెట్లలో వేటిని రుజువుగా చూపించినా సరేనని, ఇంతకన్నా ఇంకేమి వెసులుబాటు కల్పించగలమని ఆయన అన్నారు. వీటిలో తన తండ్రి పేరుతో ఉన్న ఒక్క భూమి కాగితాలు మినహా మరేమీ లేవని జియావుద్దీన్ అన్నారు. భూమి కాగితాలు తీసుకెళితే ఆలస్యమైందంటూ తీసుకోలేదని చెప్పారు.
ఆగస్టు 30వ తేదీ నుంచి ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరిస్తారని చెప్పారుగదా, జియాఉద్దీన్ లాంటి వాళ్లు మళ్లీ దరఖాస్తు చేసుకోవచ్చా? అంటూ ఎన్‌ఆర్‌సీ అధికారులను మీడియా ప్రశ్నించగా, ఇప్పటికే దరఖాస్తు చేసుకొని తిరస్కరణకు గురయిన వారికే ఫిర్యాదు అవకాశం ఉంటుందని వారు చెప్పారు. ఇంతకుముందే దరఖాస్తు చేసుకుంటే తిరస్కరణకు గురయిందా? అని జియావుద్దీన్‌ను ప్రశ్నించగా, ఏ సర్టిఫికెట్ లేనందున దరఖాస్తు స్వీకరించేందుకే అధికారులు తిరస్కరించారని ఆయన చెప్పారు. 40 లక్షల మందిలో జియావుద్దీన్ లాంటి వాళ్లు ఎందరున్నారో!
Comments
Please login to add a commentAdd a comment