
హైదరాబాద్: విద్యా, ఉపాధి అవకాశాల్లో బీసీలకు దక్కాల్సిన న్యాయమైన వాటా దక్కే వరకు పోరాటం చేస్తామని తెలంగాణ జనసమతి పార్టీ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ బడుగు, బలహీన వర్గాలను అణిచివేస్తున్నారని మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్‌కు ప్రజలు తగిన గుణపాఠం చెబుతారన్నారు. సోమవారం బషీర్‌బాగ్‌లోని దేశోద్ధారక భవన్‌లో బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ‘బీసీల వాటా’పై అఖిలపక్ష సమావేశం నిర్వహించారు.
బీసీ సంక్షేమ సంఘం నేత, టీడీపీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖర్‌రెడ్డి ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని ప్రవేశపెట్టారని కొనియాడారు. ప్రస్తుత ప్రభుత్వం మాత్రం ఆ పథకానికి తూట్లు పొడిచిందని మండిపడ్డారు.
ముందుచూపుతో వై.ఎస్.ఆర్. ఆనాడు రాష్ట్రంలో ప్రాజెక్టులను ప్రారంభిస్తే కేసీఆర్ ప్రభుత్వం పేర్లు మార్చేసి తామే చేశామని ప్రజలను నమ్మించే ప్రయత్నాలు చేస్తుందన్నారు. గొర్రెలకు, మేకలకు రూ.8 వేల కోట్లు ఇచ్చిన సీఎం ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు రూ.2,200 కోట్లే ఇచ్చి విద్యార్థులను అవమానించారని దుయ్యబట్టారు. కార్యక్రమంలో మాజీ ఎంపీ మల్లు రవీంద్ర, టీడీపీ అధికార ప్రతినిధి కాశీ విశ్వనాథ్, గుజ్జ కృష్ణ, రామకృష్ణ, నీల వెంకటేశ్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment