స్పీకర్ కోడెలను నిలదీస్తున్న గోళ్లపాడు ఎస్సీ కాలనీ మహిళలు
సాక్షి, ముప్పాళ్ళ (సత్తెనపల్లి): ‘గత ఎన్నికల్లో మిమ్మల్ని నమ్మి మీకు ఓటేశాం. మాకు ఏం చేశారు. నలభై ఇళ్లు కట్టామన్నారు. కాలనీలో ఇంకా పూరిగుడిసెలే ఉన్నాయి.. మాకు కనీసం లోన్లు కూడా ఇవ్వకుండా అవతలి వాళ్లకు ఇచ్చారు. ఈ సారి మీకు ఓటెయ్యం.. ఎలా గెలుస్తావో చూస్తాం’ అంటూ ఎస్సీ కాలనీ వాసులు స్పీకర్ కోడెల శివప్రసాదరావును నిలదీశారు. గుంటూరు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలోని గోళ్లపాడు గ్రామం ఎస్సీ కాలనీలో స్పీకర్ కోడెల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘మీ కాలనీలో చాలా అభివృద్ధి చేశాం. రోడ్లు వేశాం. అందరికీ పింఛన్లు ఇచ్చాం’ అని చెబుతుండగా ఎస్సీ కాలనీకి చెందిన మహిళలు మీ సొమ్మేం కాదు కదా? ప్రభుత్వం ఇచ్చిన సొమ్మే కదా? అని నిలదీశారు. మీ సొమ్ము ఇచ్చినట్టు ఎలా చెబుతారు. మీకెందుకు ఓటెయ్యాలని ప్రశ్నించారు. చేసేదిలేక కోడెల, టీడీపీ నాయకులు ప్రచారాన్ని అర్ధాంతరంగా ఆపేసి అక్కడి నుంచి వెనుదిరిగారు.
జరిగినవి మర్చిపోండి.. మీకు పట్టాలు ఇప్పిస్తా
‘మీ అందరికీ పట్టాలు ఇప్పిస్తాను. నన్ను నమ్మండి. మళ్లీ నాకు మద్దతివ్వండి’ అంటూ కోడెల శివప్రసాదరావు ఎస్టీ కాలనీ వాసులను కోరారు. ప్రచారంలో భాగంగా గోళ్లపాడు గ్రామంలోని ఎస్టీ కాలనీవాసులతో ఇళ్లస్థలాల సమస్యపై ఆయన మాట్లాడారు. ఎన్నికలు పూర్తి కాగానే అందరికీ ఇళ్ల పట్టాలిప్పిస్తామని చెప్పారు. కొంకావారిపాలెం గ్రామంలోని ఎస్సీ కాలనీవాసులతోనూ కోడెల సమావేశమయ్యారు.
ప్రచారంలో ప్రభుత్వ ఉద్యోగి.. రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు
గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో ఫైలేరియా విభాగంలో హెల్త్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న మాటేటి రవిచంద్రకుమార్ టీడీపీ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. దీనిపై తక్షణమే స్పందించి ఆయనపై చర్యలు తీసుకోవాలని నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి పీఎస్ సూర్య ప్రకాష్‌కు సత్తెనపల్లికి చెందిన బీవీ విఘ్నేశ్వర స్వామి మంగళవారం ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న తరుణంలో ఈ నెల 22న టీడీపీ నియోజకవర్గ శాసనసభ అభ్యర్థి కోడెల శివప్రసాదరావు నామినేషన్ ఊరేగింపు కార్యక్రమంలో ప్రభుత్వ ఉద్యోగి అయిన మాటేటి రవిచంద్రకుమార్ పాల్గొన్నాడని పేర్కొన్నారు. దీనిపై విచారించి ప్రభుత్వ ఉద్యోగి మాటేటి రవిచంద్రకుమార్‌పై చట్టరీత్యా తగు చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే ముప్పాళ్ల మండలం గోళ్ళపాడు గ్రామంలో చేపట్టిన టీడీపీ ప్రచారంలో కూడా ఆయన పాల్గొన్నారని తెలిపారు. ఫిర్యాదుతో పాటు రవిచంద్రకుమార్ ఎన్నికల ప్రచారంలో ఉన్నట్లుగా ఫోటో కాపీలను జతపరిచి ఎన్నికల రిటర్నింగ్ అధికారికి అందించారు. ఇలా ప్రభుత్వ అధికారులు విధులకు హాజరుకాకుండా అధికార పార్టీ ప్రచార కార్యక్రమాలకు వెళ్తూ ప్రతి నెలా వేతనం తీసుకోవడంపై పలువురు విమర్శిస్తున్నారు.
టీడీపీ ప్రచారంలో ప్రభుత్వ ఉద్యోగి రవిచంద్రకుమార్ (వృత్తంలో)
Comments
Please login to add a commentAdd a comment