![Kodela Siva Prasada Rao Played Key Role in Andhra Pradesh Politics - Sakshi](/styles/webp/s3/article_images/2019/09/16/Kodela-sivaprasada-Rao8.jpg.webp?itok=2cSkcq2H)
సాక్షి, హైదరాబాద్: నవ్యాంధ్రప్రదేశ్ తొలి స్పీకర్, టీడీపీ సీనియర్ నాయకుడు కోడెల శివప్రసాదరావు జీవితం అర్ధంతరంగా ముగిసిపోయింది. రాష్ట్ర రాజకీయాల్లో తనదైన పాత్ర పోషించి.. పలుసార్లు మంత్రిగా, నవ్యాంధ్ర తొలి స్పీకర్‌గా సేవలు అందించిన ఆయన.. ఆత్మహత్య చేసుకొని తనువు చాలించారు. వైద్యవృత్తి నుంచి రాజకీయాల్లోకి అడుగుపెట్టిన కోడెల ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. గుంటూరు జిల్లా రాజకీయాల్లో సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగిన ఆయన.. 1983 నుంచి 2004 వరకు వరుసగా ఐదుసార్లు నరసరావుపేట నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఆ తర్వాత రెండుసార్లు ఓటమి ఎదురైనా.. 2014లో సత్తెనపల్లి నియోజకవర్గానికి మారి.. మరోసారి గెలుపొందారు. ఎన్టీ రామారావు, చంద్రబాబునాయుడు మంత్రివర్గాల్లో పలు శాఖలు నిర్వహించిన ఆయన.. నవ్యాంధ్ర తొలి శాసనసభాపతిగా ఎన్నికై.. ఐదేళ్లు సేవలు అందించారు. ఆయన జీవితాన్ని ఓసారి పరిశీలిస్తే..
గుంటూరు జిల్లా, నకరికల్లు మండలం కండ్లగుంట గ్రామంలో 1947 మే 2న కోడెల శివప్రసాదరావు జన్మించారు. ఆయన తల్లిదండ్రులు సంజీవయ్య, లక్ష్మీనర్సమ్మ. దిగువ మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన ఆయన.. విజయవాడ లయోలా కళాశాల పీయూసీ చదివాడు. చిన్నతనంలోనే తోబుట్టువులు అనారోగ్యంతో చనిపోవడం కోడెలను తీవ్రంగా కలిచివేచింది. ఆ విషాదం నుంచే డాక్టర్ కావాలని నిర్ణయించుకున్న ఆయన.. తాత ప్రోత్సాహంతో వైద్య విద్యనభ్యసించారు. కర్నూలు వైద్య కళాశాలలో చేరి.. రెండున్నరేళ్ళ తర్వాత తిరిగి గుంటూరుకు మారి అక్కడే ఎంబీబీఎస్ పూర్తి చేశారు. వారణాసిలో ఎం.ఎస్ చదివారు. నరసరావుపేటలో హాస్పిటల్ నెలకొల్పి వైద్యవృత్తిని చేపట్టిన ఆయన.. అనతికాలంలోనే మంచి డాక్టర్‌గా స్థానికంగా పేరు తెచ్చుకున్నారు.
అలా పల్నాడులో అంచెలంచెలుగా ఎదిగి.. ప్రముఖ సర్జన్‌గా కీర్తిగడించిన డాక్టర్ కోడెలను ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీలోకి ఆహ్యానించారు. ఆయన పిలుపుమేరకు 1983లో టీడీపీలో చేరిన కోడెల మొదటిసారిగా నరసరావుపేట నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించి.. అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఆ తర్వాత 1985, 1989, 1994, 1999 ఎన్నికల్లోనూ నర్సరావుపేట నుంచి ఆయన వరుస విజయాలు సాధించారు. 2004, 2009 ఎన్నికల్లో మాత్రం ఆయన ఓటమిపాలయ్యారు. రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన తొలి ఎన్నికల్లో సొంత నియోజకవర్గం నరసరావుపేటను వదిలి సత్తెనపల్లి నుంచి పోటీచేసిన కోడెల మరోసారి విజయం సాధించారు. అనంతరం నవ్యాంధ్ర తొలి స్పీకర్‌గా పదవీ బాధ్యతలు చేపట్టి.. ఐదేళ్లపాటు సేవలు అందించారు. కోడెలకు భార్య శశికళ, ముగ్గురు పిల్లలు (విజయలక్ష్మి, శివరామకృష్ణ, సత్యన్నారాయణ) ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment