
విజయవాడ సిటీ: రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు పెట్టి మరీ చంద్రబాబు స్వార్థ రాజకీయాలు చేస్తున్నారని వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి కొలుసు పార్థసారథి మండిపడ్డారు. కోల్‌కతాలో జరిగిన ర్యాలీలో ఆంధ్రప్రదేశ్‌కు జరుగుతున్న అన్యాయం గురించి గానీ, ప్రత్యేక హోదా గురించి గానీ మాట్లాడే దమ్మూ, ధైర్యం లేని పిరికిపంద, అసమర్థుడు చంద్రబాబు అని దుయ్యబట్టారు. విజయవాడలోని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యాలయంలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు.. సీబీఐ, ఈడీ, కక్షలంటూ మాట్లాడుతున్నారు గానీ ఒక్కసారి కూడా రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై నోరువిప్పట్లేదని ధ్వజమెత్తారు. మరోవైపు తమ పార్టీ అధినేత వైఎస్ జగన్.. కేటీఆర్‌తో జరిగిన ఫెడరల్ ఫ్రంట్ చర్చల్లో రాష్ట్ర ప్రయోజనాలు, ప్రత్యేక హోదా ముఖ్యమని స్పష్టంగా చెప్పారని గుర్తు చేశారు. అదే చంద్రబాబుకు, వైఎస్ జగన్‌కు మధ్యనున్న తేడా అని పార్థసారథి పేర్కొన్నారు. దోపిడీ, అవినీతి, ఓటుకు కోట్లు కేసు నుంచి తప్పించుకోడానికే చంద్రబాబు రాష్ట్రాలు పట్టుకు తిరుగుతూ.. అన్ని రాజకీయ పార్టీల కాళ్లు పట్టుకుంటున్నాడని విమర్శించారు. జగన్‌తో కేటీఆర్ చర్చలు జరపడాన్ని ఫిడేల్ ఫ్రంట్ అంటూ టీడీపీ నేతలు ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని.. మరి కోల్‌కతాలో జరిగింది తోడేళ్ల ఫ్రంటా? అంటూ పార్థసారథి ఎద్దేవా చేశారు.
వైఎస్ జగన్ లోటస్‌పాండ్‌లో దాక్కున్నారంటూ మంత్రి దేవినేని ఉమా కళ్లులేని కబోదిలా మాట్లాడుతున్నాడని మండిపడ్డారు. నెలల తరబడి ప్రజల మధ్య ప్రజా సంకల్పయాత్ర చేసినప్పుడు.. కళ్లు ఎక్కడ పెట్టుకున్నావో చెప్పాలంటూ దేవినేని ఉమాను ప్రశ్నించారు. ప్రజలను మోసం చేయడానికి చంద్రబాబు మళ్లీ కుతంత్రాలు మొదలుపెట్టారన్నారు. ఈ నాలుగున్నరేళ్లలో పింఛన్ పెంచాలనే ఆలోచన చంద్రబాబుకు ఎందుకు రాలేదో.. ఎన్నికలనగానే హఠాత్తుగా ఎందుకొచ్చిందో ప్రజలందరికీ తెలుసన్నారు. వైఎస్ జగన్ తొమ్మిది గంటలు ఉచిత విద్యుత్ ఇస్తామంటే చంద్రబాబు కూడా ఇప్పుడు అదే బాట పట్టారని ఎద్దేవా చేశారు. ఉన్న పథకాలను గాలికొదిలేసి ఎన్నికల సమయంలో ప్రజల్ని మభ్యపెట్టేందుకు యత్నిస్తున్నారని దుయ్యబట్టారు. రూ.రెండున్నర లక్షల ఆరోగ్యశ్రీ పరిధిని రూ.ఐదు లక్షలకు పెంచుతానంటూ చంద్రబాబు చెబుతున్నారని.. ఇంతకంటే మోసం ఏమైనా ఉందా? అని నిలదీశారు. రూ.రెండున్నర లక్షల పథకమే ఏ ఆస్పత్రుల్లోనూ అమలు కావట్లేదని, ఆరోగ్యశ్రీ కింద వైద్యం చేయడం లేదనే బోర్డులు దర్శనమిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓవైపు రూ.500 కోట్ల బకాయిలు కూడా చెల్లించలేకపోతూ.. మరోవైపు ఆరోగ్య శ్రీ పరిధిని రూ.ఐదు లక్షలకు ఎలా పెంచుతారో చంద్రబాబుకే తెలియాలని ఎద్దేవా చేశారు.
Comments
Please login to add a commentAdd a comment