
మండల కేంద్రంలో ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన తాత్కాలిక బస్టాండ్
సాక్షి, సిర్పూర్(టి): నియోజకవర్గ ప్రజల దశాబ్దాల కల నెరవేరనున్నది. పట్టణంలో బస్టాండ్ నిర్మాణం నియోజకవర్గ ప్రజలకు కలగా మిగిలిపోగా ఎమ్మెల్యే కోనేరు కోనప్ప కృషితో బస్టాండ్ నిర్మాణం కోసం ఆర్టిసీ అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. సిర్పూర్(టి)లో నూతన బస్టాండ్, బస్‌డిపో నిర్మాణం, బస్‌డిపోలోనే సినిమా హాల్ నిర్మాణాలకు అధికారులు ప్రతిపాదనలు పూర్తి చేసి ఉన్నతాధికారులకు నివేదించారు. నియోజకవర్గ కేంద్రంలో బస్టాండ్ లేకపోవడంతో మండలంలోని ప్రజలతోపాటు నియోజకవర్గంలోని మండలాల్లోని ప్రజలకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
స్థల పరిశీలన
మండల కేంద్రం మీదుగా నియోజకవర్గంలోని కౌటాల, బెజ్జూర్, చింతలమానెపల్లి మండలాల ప్రజలతోపాటు సమీపంలోని మహారాష్ట్ర ప్రజలు ఇబ్బందుల నడుమ ప్రమాదకర ప్రయాణాలు సాగిస్తున్నారు. ఆర్టీసీ అధికారులు బస్టాండ్, బస్‌డిపో, సినిమాహాల్ నిర్మాణానికి ఇటీవలే సర్వే నిర్వహించి స్థల పరిశీలన, రికార్డులను పరిశీలించారు.నియోజకవర్గ కేంద్రంలో బస్టాండ్ నిర్మించి, ప్రయాణికులకు వసతులు కల్పిస్తే ఇక్కట్లు తీరినట్లేనని హర్షం వ్యక్తం చేస్తున్నారు. నియోజకవర్గాన్ని ఆనుకోని మహారాష్ట్ర గ్రామాలు, పట్టణాలు ఉన్నా ఆర్టీసీ బస్సు సౌకర్యాలు లేకపోవడంతో అధిక ధరలు వెచ్చించి ప్రయాణాలు సాగిస్తున్నారు. అధికారులు తక్షణమే పనులు ప్రారంభించి, ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని నియోజవర్గ ప్రజలు కోరుతున్నారు.