
సాక్షి, హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుడు కోమటిరెడ్డి రాజ్‌గోపాల్‌రెడ్డి పార్టీ మార్పుపై మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ అధిష్టానం గతరెండు సార్లు సరైన నాయకత్వాన్ని (టీపీసీసీ చీఫ్) ఎంపిక చేయడంలో విఫలమైందని, టీఆర్‌ఎస్‌ను ఎదుర్కొనేందుకు తాను సిద్ధంగా ఉన్నానని అన్నారు. ఈసారి పీసీసీ చీఫ్ పదవి తమకు రాకపోతే బీజేపీలోకి వెళ్లడమా లేక సొంతపార్టీని ఏర్పాటు చేసుకోవడమా అనేది భవిషత్తు నిర్ణయిస్తుందని పేర్కొన్నారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు సందర్భంగా శుక్రవారం సమావేశాల్లో పాల్గొన్న ఆయన.. అనంతరం అసెంబ్లీ హాల్‌లో మీడియాతో ముచ్చటించారు. కాంగ్రెస్ అధిష్టానం ఈసారి సరైన నాయకత్వాన్ని ఎన్నుకుంటుదనే నమ్మకం ఉందని అభిప్రాయపడ్డారు. కాగా కాంగ్రెస్ పార్టీకి గుడ్‌బై చెప్పి బీజేపీలో చేరుతున్నట్లు ఆయనపై ఇదివరకే వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.
కోమటిరెడ్డి రాజ్‌గోపాల్‌రెడ్డి మాట్లాడుతూ.. ‘సమయం వచ్చినప్పుడు ప్రజల నుంచే నాయకుడు పుడతాడు. కాంగ్రెస్ పార్టీకి నాయకత్వం వహించేందుకు నేను రెడీగా ఉన్నా. కాంగ్రెస్ అధిష్టానం గత రెండు దఫాలుగా సరైన నాయకుని ఎన్నుకోవడంలో తప్పులు చేసింది. ఏ పార్టీ అనేది కాదు కేసీఆర్‌ని ఓడించామా లేదా అనేది ముఖ్యం. గత లోక్‌సభ ఎన్నికల్లో కవిత నిజామాబాద్‌లో ఒడిపోయినప్పుడు కేసీఆర్ నైతికంగా ఓడిపోయారు. ముఖ్యమంత్రి కేసీఆర్ డబ్బు రాజకీయాలు చేస్తున్నారు. టీఆర్‌ఎస్ గొప్పతనం వల్ల గెలువలేదు. కాంగ్రెస్ తప్పుడు నిర్ణయాల వల్లే కేసీఆర్ గెలిచారు. టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు మంత్రులు కేసీఆర్‌పై అసంతృప్తితో ఉన్నారు’ అని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment