సాక్షి, యాదాద్రి భువనగిరి : డబ్బుల కోసం టీఆర్‌ఎస్ పార్టీ ఎంపీ టికెట్లను అమ్ముకుందని మునుగోడు ఎమ్మెల్యే, కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ధ్వజమెత్తారు. ఈ లోక్‌సభ ఎన్నికల్లో ఆ పార్టీ గనుక 16 ఎంపీ సీట్లు గెలుచుకుంటే రాజకీయ సన్యాసం తీసుకుంటానని సవాల్ విసిరారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ... తన సోదరుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డిని భువనగిరి పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రకటించినప్పటి నుంచి.. టీఆర్‌ఎస్ అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్ మతి స్థిమితం కోల్పోయి మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు.(బలమైన అభ్యర్థిగా రంగంలోకి..)
ఆయనే స్వయంగా చెబుతున్నారుగా..
తన ముఖం చూసి ఎంపీ అభ్యర్థులకు ఓటు వేయాలని కేసీఆర్ కోరుతున్నారు అంటే.. వారంతా డమ్మీలేనని ఆయనే స్వయంగా ఒప్పుకొంటునట్లేగా అని రాజగోపాల్ రెడ్డి చమత్కరించారు. ‘గతంలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు, కేసీఆర్‌కు కర్రు కాల్చి వాత పెట్టాం. కోమటిరెడ్డి సోదరుల జోలికి వస్తే మళ్లీ అదే జరుగుతుంది. నా సోదరుడు గనుక ఓడిపోతే శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేసి రాజకీయాల నుంచి తప్పుకుంటాను’ అని ఆయన పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment