కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి
సాక్షి, యాదాద్రి: ‘ఎక్కడి నుంచి వచ్చావు.. మాకు శనిలాగా తగిలావు నాయనా.. ప్రజలు కోరుకున్న తెలంగాణ కోసం, కార్యకర్తల కోసం కష్టపడుతున్న నాయకులను కాదని బ్రోకర్‌నా కొడుకులను ఎక్కడి నుంచి తెచ్చావు.. అని ఫోన్ చేసి కుంతియాను నిలదీశా.. నాకు కుంతియా అంటే భయమా.. కుంతియాకు భయపడాలా.. వంద మంది కుంతియాలు వచ్చినా నన్నేం చేయలేరు, నా బీఫారం ఆపలేరు. చాలా బాధగా ఉంది.. ప్రజల మధ్యన ఉండి ప్రజల కోసం కష్టపడేవారికి టికెట్లు ఇస్తే కాంగ్రెస్ గెలుస్తుంది తప్ప గాంధీభవన్‌లో టీవీల ముందు కూర్చుని మాట్లాడేవారికి, నమస్తే పెడితే ప్రతి నమస్కారం చేయనివారికి టికెట్లు ఇస్తే పార్టీ గెలుస్తుందా? పైరవీకారులను దూరంగా పెట్టాలని, కోమటిరెడ్డి బ్రదర్స్ అవసరమా.. లేదా.. అని నిలదీశాను’ అని ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి తీవ్రస్వరంతో అధిష్టానంపై విమర్శనాస్త్రాలు సంధించారు.
గురువారం యాదాద్రి భువనగిరి జిల్లా మునుగోడు నియోజకవర్గ కాంగ్రెస్ ముఖ్య నాయకులు, కార్యకర్తల సమావేశం రంగారెడ్డి జిల్లా పెద్దఅంబర్‌పేటలో జరిగింది. ఈ సందర్భంగా రాజగోపాల్‌రెడ్డి మాట్లాడారు. బుధవారం కాంగ్రెస్ ఎన్నికల కమిటీలను ఏఐసీసీ ప్రకటించిన నేపథ్యంలో పార్టీ అధిష్టానంపై ఆయన తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి రావాలంటే పైరవీకారులను పక్కన పెట్టాలని, మామూలు వ్యక్తులను కాకుండా ప్రజల్లో మమేకమైనవారికి టికెట్లు ఇవ్వాలని సూచించారు. ఏఐసీసీ ప్రకటించిన వివిధ కమిటీల్లో వార్డు మెంబర్‌గా కూడా గెలవని వ్యక్తులకు పదవులు ఇచ్చారని ధ్వజమెత్తారు. కమిటీని చూసి నివ్వెరపోయానని, ఇదే విషయాన్ని రాష్ట్ర ఇన్‌చార్జి కుంతియాకు ఫోన్ చేసి నిలదీశానని తెలిపారు. తెలంగాణకు శనిలా తగిలావని నిలదీశానన్నారు. ప్రజలకు ఎవరు అవసరమో తెలుసుకోకుండా బ్రోకర్లను ఎక్కడి నుంచి తీసుకువచ్చావని కుంతియాను ప్రశ్నించానని చెప్పారు.
కాంగ్రెస్ నేతలే అవమానించారు...
ప్రజల కోసం బతుకుతున్నానని, ప్రజల మధ్యన ఉంటానని, అంతకుమించి ఎవరికీ భయపడాల్సిన, తలవంచాల్సిన అవసరం లేదని రాజగోపాల్‌రెడ్డి అన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రమిచ్చిన కాంగ్రెస్ పార్టీ 2014 ఎన్నికల్లో విజయం సాధించాల్సి ఉన్నా తప్పుడు నిర్ణయాలతో ఓడిందని పేర్కొన్నారు. ఎమ్మెల్సీగా గెలిచినా, రెండున్నరేళ్లుగా తనను వందసార్లు కాంగ్రెస్ నాయకులే అవమానించి ఇంట్లో కూర్చోబెట్టారని ధ్వజమెత్తారు. పార్టీ గెలవాలంటే మీరైతేనే కుదురుతుందని కార్యకర్తలు బతిమిలాడితే మునుగోడులో పోటీ చేసేందుకు ముందుకు వచ్చానని తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో మంత్రి జగదీశ్‌రెడ్డి చెంచాలను పెట్టుకున్నా, నయీం ముఠాను అడ్డు ఉంచుకున్నా, 150 మందిని కిడ్నాప్ చేసి భయభ్రాంతులకు గురి చేసినా రెండు వందల ఓట్ల మెజార్టీతో టీఆర్‌ఎస్‌పై విజయం సాధించానని గుర్తుచేశారు. ఆ విజయం వల్ల జిల్లా, తెలుగు రాష్ట్రాలే కాకుండా భారతదేశంలో గుర్తింపు వచ్చిందన్నారు. మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థిగా సేవ చేసేందుకే వస్తున్నానని, పదవీకాంక్షతో కాదని తెలిపారు.
కార్యకర్తలకు జీవితం అంకితం
కార్యకర్తల కష్టసుఖాల్లో పాలుపంచుకుని వారి వెంటే ఉంటూ తన జీవితాన్ని కార్యకర్తలకు అంకితం చేస్తానని రాజగోపాల్‌రెడ్డి ఉద్వేగంగా ప్రకటించారు. ‘మన ప్రభుత్వ ఏర్పాటు ద్వారా మనందరం బాగుంటాం, మన పార్టీ బాగుంటుంది, మన ప్రాంతం బాగుపడుతుంది’ అంటూ వివరించారు. ఎవరినీ విమర్శించకుండా మంచి మనసుతో ముందుకు సాగుదామని కార్యకర్తలకు సూచించారు. సోనియాగాంధీ, దివంగత సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి నాయకత్వంలో రాజకీయాల్లోకి వచ్చిన తనను 2009 ఎన్నికల్లో ప్రజలు భారీ మెజార్టీతో గెలిపించారన్నారు. ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా సేవలందిస్తున్న తరుణంలో గ్రూప్ తగాదాల మూలంగా 2014లో ఓటమి ఎదురైందని తెలిపారు. ఏది ఏమైనా మునుగోడు బరిలో నిలిచి విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు. ‘మీ అందరి మనసులో ఏముందో నాకు తెలుసు. మనందరి లక్ష్యం కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటేన’ని ఆయన అన్నారు. అభివృద్ధి జరగాలంటే కాంగ్రెస్ గెలవాలన్నారు. ఎవరినో విమర్శించాలన్నది తన ఆలోచన కాదని, మంచి మనసుతో ముందుకు సాగుదామని అన్నారు. మనందరి లక్ష్యం ఒక్కటేనని, అది కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటేనని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment