సాక్షి, యాదాద్రి : నాలుగేండ్ల పాటు ప్రభుత్వం ఒళ్లు దగ్గర పెట్టుకుని పనిచేయాలంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని మాజీ మంత్రి, భువనగిరి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రజలకు విఙ్ఞప్తి చేశారు. శుక్రవారం పోచంపల్లిలో విలేకరులతో మాట్లాడుతూ.. ఇంటర్ పరీక్షల్లో అవకతవకల వల్ల 10 లక్షల మంది విద్యార్థులు ఆవేదన చెందుతున్నారన్నారు. తాను గెలిచిన తర్వాత హైద్రాబాద్ నుంచి వచ్చే మూసీ నీటిని శుద్ధి చేయడానికి నదిపై ట్రీట్‌మెంట్ ప్లాంట్ల ఏర్పాటుకు కృషి చేస్తానని పేర్కొన్నారు. రెండు రాజధానుల మధ్య సులభమైన రవాణా కోసం హైదరాబాద్ నుంచి సూర్యాపేట మీదుగా అమరావతికి రైలు మార్గం తీసుకొస్తానని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీకి బుద్ధి చెప్పి కాంగ్రెస్‌కు పట్టం కట్టాలని కోరారు.
కాగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో.. ‘స్థానిక’ సమరానికి ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ కసరత్తు ముమ్మరం చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే జిల్లాల వారీగా కో–ఆర్డినేటర్లను ఏర్పాటు చేసి మండల స్థాయిలో సమావేశాలు నిర్వహించిన పార్టీ.. ఇప్పుడు అధికార వికేంద్రీకరణకు శ్రీకారం చుట్టింది. గతంలో ఉన్నట్లుగా స్థానిక టికెట్లు కూడా గాంధీభవన్ నుంచే ఖరారు చేసే ఆనవాయితీని పక్కనపెట్టి సెలక్ట్ అండ్ ఎలక్ట్ పద్ధతిలో టికెట్ ఖరారు బాధ్యతలను క్షేత్రస్థాయి నాయకత్వానికే కట్టబెట్టింది. అంతేకాకుండా గెలిచిన తర్వాత పార్టీని వీడకుండా ఉండేందుకు.. తాము కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపీటీసీ, జెడ్పీటీసీ అభ్యర్థులుగా పోటీ చేస్తున్నామని, గెలిచిన తర్వాత ఇతర పార్టీల్లోకి అఫిడవిట్ ద్వారా అటు పార్టీకి, ఇటు ఆ ప్రాదేశిక నియోజకవర్గ ప్రజలకు అభ్యర్థులు హామీ ఇచ్చేలా హామీ పత్రం రూపొందించినట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment