సాక్షి, సిద్ధిపేట : చేర్యాలను డివిజన్‌గా మార్చే వరకు అమరణ నిరాహార దీక్ష చేస్తానని కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పేర్కొన్నారు. సిరిసిల్ల, నారాయణపేట్ వంటి ప్రాంతాలను జిల్లా చేసిన కేసీఆర్ చేర్యాల డివిజన్ చేయడంలో ఎందుకు చిన్న చూపు చూస్తున్నారని ప్రశ్నించారు. మంగళవారం ఎంపీ సిద్దిపేటలో మాట్లాడుతూ.. తెలంగాణ తొలిదశ, మలిదశ ఉద్యమాల్లో చేర్యాల ఉద్యమ గడ్డగా పేరుగాంచిందని తెలిపారు. బైరాన్‌పల్లిలో ఒకే రోజు 300 మంది ఆత్మ బలిదానాలు చేసుకున్నారని గుర్తు చేశారు. మరోసారి చేర్యాల నుంచి ఉద్యమానికి శ్రీకారం చుడుతామని పేర్కొన్నారు. 1969లో తెలంగాణ ఉద్యమంలో చేర్యాల ప్రాంత ప్రజలే తూటాలకు బలయ్యారని, 2001 తెలంగాణ ఉద్యమంలో చేర్యాల ప్రాంత ప్రజల కృషి మరువలేనిదని ప్రశంసించారు.
జనగామ నియోజకవర్గాన్ని రెండు జిల్లాల్లో కలపడంతో విద్యార్థులు, రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. స్థానికేతర ఎమ్మెల్యే వల్లే ఈప్రాంతానికి తీవ్ర నష్టం జరుగుతుందన్నారు. కార్యాలయాల ఏర్పాటులో వేర్వేరు ప్రాంతాలకు వెళ్ళవలసి రావడంతో ఈ ప్రాంత ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. సీఎం కేసీఆర్‌ను పలుమార్లు సంప్రదించినా.. డివిజన్ ఏర్పాటు చేయలేదని ప్రస్తావించారు. 4 నెలల నుంచి చేర్యాల ప్రజలు నిరసనలు, ధర్నాలు చేసిన పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment