కేసీఆర్, కోమటిరెడ్డి (జతచేసిన చిత్రం)
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు శుభాకాంక్షలు తెలియజేస్తూ కోమటిరెడ్డికి సీఎం లేఖ పంపారు. ‘మీకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మీరు ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు ప్రజలకు సేవలందించాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుడిని కోరుకుంటున్నాను’ అని లేఖలో పేర్కొన్నారు. లేఖపై స్పందించిన కోమటిరెడ్డి తనకు శుభాకాంక్షలు తెలిపిన ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు.
ఈ సందర్భంగా కోమటిరెడ్డి పలు అంశాలపై మాట్లాడుతూ...‘ అసెంబ్లీ సమావేశాల్లో నిరసన తెలిపినందుకు సభ్యత్వాన్ని రద్దు చేశారు. ఈ అంశంలో కోర్టు మొట్టికాయలు వేసింది. అయినా కోర్టు ఆదేశాలను అమలు చేయలేదు. కానీ కేసీఆర్ మాత్రం నన్ను ఎమ్మెల్యేగా గుర్తిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. మీకు ఏమాత్రం కోర్టు మీద గౌరవం ఉన్నా ఎమ్మెల్యేగా నాకు దక్కాల్సిన అన్నీ వసతులు కల్పించండి. నన్ను వెలివేసి.. ఎమ్మెల్యేగా గుర్తించి శుభాకాంక్షలు తెలిపినా కేసీఆర్ గొప్పవ్యక్తి. ఓవైపు గన్‌మెన్లను తొలగించి.. మరోవైపు ఆశీర్వదిస్తున్నారు’ అని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. అవినీతి, కుటుంబ పాలన చేస్తున్న కేసీఆర్ ప్రభుత్వాన్ని కూల్చేస్తామన్నారు. దోపిడీ పాలనను ఓడించడటమే లక్ష్యంగా పనిచేస్తామని పేర్కొన్నారు. నాలుగేళ్లు రైతుల నడ్డి విరిచారు.. రుణమాఫీ వడ్డీలకే సరిపోయింది. వచ్చే ఎన్నికల్లో ఓడిపోతామనే రైతుబంధు పథకం పెట్టారని కోమటిరెడ్డి తెలిపారు.
మరోవైపు కాంగ్రెస్‌లో అందరూ ముఖ్యమంత్రి.. ఎమ్మెల్యేలు.. పీసీసీలేనని కోమటిరెడ్డి వ్యాఖ్యానించారు. రేవంత్ రెడ్డికి పార్టీలోని పరిస్థితులు ఇంకా అర్థం కావటం లేదన్నారు. తాను 30 ఏళ్లుగా పార్టీలో ఉంటే, తనకేం వచ్చిందని ప్రశ్నించారు. జానారెడ్డి కూడా రేవంత్‌కు సీఎం కావటానికి అర్హతలున్నాయని అంటున్నారన్నారు. తనకు కూడా సీఎం అయ్యే అర్హతలు ఉన్నాయని కోమటిరెడ్డి ఈ సందర్భంగా అన్నారు. గతంలో కిరణ్‌కుమార్ రెడ్డికి ఏమి అర్హత ఉండి సీఎం అయ్యారన్నారని ప్రశ్నించారు. కాంగ్రెస్‌లో కొత్త వ్యక్తి కూడా సీఎం కావచ్చని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment