సాక్షి, హైదరాబాద్: బీజేపీకి మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి గుడ్‌బై చెప్పారు. జనగామ బీజేపీలో క్రమశిక్షణ లోపించిందని, అందుకే బీజేపీకి రాజీనామా చేశానని ఆయన తెలిపారు. అయితే, ఇటీవల మంత్రి హరీష్‌రావును కలువడంలో ఎలాంటి రాజకీయం లేదని, తన రాజీనామాకు, ఈ భేటీకి సంబంధం లేదని కొమ్మూరి అంటున్నారు. ఆయన మీడియాతో ఏమన్నారంటే..
‘గత నాలుగు ఏళ్లుగా బీజేపీలో ఉన్నాను. జనగామ ప్రజల, అభిమానుల కోరిక మేరకు ఇప్పుడు బీజేపీకి రాజీనామా చేస్తున్నాను. నాతోపాటు అన్ని మండలాల్లోనూ మద్దతుదారులు బీజేపీకి రాజీనామా చేస్తున్నారు. నాలుగేళ్లుగా పార్టీ అభివృద్ధి కోసం పని చేసాను. గత ఏడాది నుండి నా మీద ఒత్తిడి ఉంది. 2001 నుండి నేను టీఆర్‌ఎస్‌లో ఉన్నాను. జడ్పీటీసీ, ఎమ్మెల్యే గా గెలిచాను. ఆ తర్వాత బీజేపీలో చేరాను. కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల ఇప్పుడు బీజేపీకి రాజీనామా చేశాను. జనగామ బీజేపీలో క్రమశిక్షణ లేదు. సరి చేయడానికి ప్రయత్నం చేసినా కుదరలేదు. అదికూడా నా రాజీనామాకు కారణం. జిల్లా ప్రజల అభీష్టం మేరకు వారు చెప్పిన విధంగా నడుచుకుంటా.. నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పడానికే హరీష్‌రావును కలిశాను. రాజకీయాలు మాట్లాడలేదు’ అని కొమ్మూరి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment