సాక్షి, పశ్చిమ గోదావరి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్వార్థం వల్ల శనివారం జిల్లాలో ముగ్గురు వృద్ధులు మృతి చెందారని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ కన్వీనర్ కొట్టు సత్యనారాయణ వ్యాఖ్యానించారు. దానికి పూర్తి బాధ్యత చంద్రబాబుదేనన్నారు. ఆదివారం పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం వైఎస్సార్ సీపీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొట్టు సత్యనారాయణ మాట్లాడుతూ.. తాడేపల్లిగూడెం 3వ వార్డులో మృతి చెందిన గొర్రె కొండయ్య అనే వృద్ధుడికి సకాలంలో వైద్యం అందించి ఉంటే బ్రతికి ఉండేవాడని, కళ్లు తిరిగి పడిపోతే కనీసం అక్కడ ఉన్న తెలుగు తమ్ముళ్లు పట్టించుకోలేదని మండిపడ్డారు. మృతుని కుటుంబ సభ్యులు వచ్చి ఆసుపత్రికి తీసుకెళ్లారని తెలిపారు. చంద్రబాబు డ్వాక్రా మహిళలతో.. పసుపు, కుంకుమ పేరు మీద పది వేలు ఇస్తామంటూ దారుణంగా మోసం చేస్తున్నాడని అన్నారు. నిజంగా చిత్తశుద్ధి ఉంటే నగదు రూపంలోనో, వెంటనే చెక్కు క్లియర్ అయ్యేలాగానో డబ్బు ఇవ్వవొచ్చుగా అని ప్రశ్నించారు.
ఫిబ్రవరి మూడవ వారంలో ఎన్నికల కోడ్ వస్తుందని ముందే ఊహించి ఓట్ల కోసం, ప్రజల్ని మోసం చేసి గెలవాలని ఏప్రిల్ చివరకు చెక్కుల డేట్లు వేశారని చెప్పారు. ప్రజలు ఇదంతా నమ్మే స్ధితిలో లేరన్నారు. చంద్రబాబు ఓట్ల కోసం చిల్లర రాజకీయాలు చేస్తున్నాడని విమర్శించారు. తాడేపల్లిగూడెంలో ఒక ప్రాంతాన్ని స్పోర్ట్స్ జోన్‌గా మాస్టర్ ప్లాన్‌లో డిక్లేర్ చేశారని, ఆ ప్రాంతాన్ని మున్సిపల్ ఛైర్మన్, కొంతమంది కౌన్సిలర్లు కలిసి.. డీ ఫారాలు ఇచ్చిన స్థలాలను కబ్జా చేసి, పట్టా కల్పించి అమ్మేసి 2కోట్లు కొట్టేశారని ఆరోపించారు. కొన్నింటిని వాళ్ల బినామీ పేర్ల మీద రిజిస్టర్ చేయించారన్నారు. తాడేపల్లిగూడెం మున్సిపాలిటీలో నాన్ లేఅవుట్, అన్ ఆథరైజ్డ్ భూములను లేఅవుట్లుగా మార్చేసి సుమారు 100 కోట్లు కాజేశారన్నారు.
Comments
Please login to add a commentAdd a comment