హైదరాబాద్: టీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాలుగున్నరేళ్లలో రాష్ట్రంలో శాంతి భద్రతలను చక్కగా కాపాడిందని, ఏ ఒక్కరోజు 144 సెక్షన్ విధించలేదని మంత్రి కేటీఆర్ అన్నారు. ఈ నాలుగున్నరేళ్లలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఎన్నో అభివృద్ధి పను లు చేపట్టి విజయవంతంగా పూర్తి చేసిందని కేటీఆర్ చెప్పారు. మాదాపూర్‌లోని న్యాక్ ఆడిటోరియంలో శనివారం నిర్వహించిన ట్రెడా ప్రాపర్టీ షో–2018 కార్యక్రమంలో భాగంగా ఆయన ట్రెడా జనరల్ సెక్రెటరీ సునీల్ చంద్రారెడ్డి, అధ్యక్షుడు రవీందర్‌రావు, సభ్యులు చలపతిరావు, ట్రెజరర్ శ్రీధర్‌రెడ్డిలతో కలిసి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. శాంతి భద్రతల విషయంలో ఆపద్ధర్మ సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలతో పోలీస్ వ్యవస్థ మరింత మెరుగుపడిందన్నారు. పెట్టుబడులు పెట్టేం దుకు హైదరాబాద్ అనుకూలమైన ప్రాంతమని, గత నాలుగేళ్లుగా రియల్ ఎస్టేట్ రంగం అంచలంచెలుగా వృద్ధి చెందుతోందన్నారు. రియల్ ఎస్టేట్ రంగంలో బెంగళూరు, చెన్నై, ముంబై వంటి మెట్రో నగరాలు సాధించిన దానికంటే రెట్టింపు వృద్ధి హైదరాబాద్‌లో జరిగిందన్నారు. నిర్మాణ రంగంలో హైదరాబాద్ దూసుకుపోతోందని, భవిష్యత్తులో మరింత అభివృద్ధి చెందుతుందన్నారు.
అభివృద్ధి చేస్తే అప్పులుంటాయి
ప్రపంచ దేశాలతో పోలిస్తే తెలంగాణ జీడీపీ శాతం బాగా ఉందని, అభివృద్ధి చేసినప్పుడు రాష్ట్రానికి అప్పులు అవుతాయని కేటీఆర్ పేర్కొన్నారు. అమెరికా వంటి అగ్రదేశంలో 104% అధికంగా అప్పులున్నాయని, జపాన్‌కు జీడీపీ వృద్ధి రేటు చూస్తే 200% అధికంగా అప్పులు ఉన్నాయని ఆ దేశాలు అభివృద్ధిలో దూసుకుపోతున్నాయని వివరించారు. తెలం గాణ వృద్ధి రేటును రెండింతలు చేసేందుకు నేడు అప్పులు చేయాల్సి వస్తోందని, అభివృద్ధి చేసేందుకు వాడే వాటిని అప్పులు అనే కంటే పెట్టుబడులు అంటే బాగుంటుందన్నారు.
కాళేశ్వరంతో 36 లక్షల ఎకరాలకు సాగునీరు
కాళేశ్వరం ప్రాజెక్టుకు రూ.80 వేల కోట్లతో నిర్మాణం చేపట్టామని, దీంతో 36 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని కేటీఆర్ పేర్కొన్నారు. వాటి ద్వారా రానున్న రోజుల్లో రాష్ట్ర ఆదాయం మరింత పెరుగుతుందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించాలంటే కాంగ్రెస్ వాళ్లకు ఇరవైఏళ్లయినా సరిపోదని, టీఆర్‌ఎస్ ప్రభుత్వం కేవలం నాలుగేళ్ల సమయాన్ని మాత్ర మే తీసుకుందని చెప్పారు. నగరంలో రోడ్లు, స్కైవే లు ఏర్పాటుతోపాటుగా నగరంలో 330 కిలో మీటర్ల మేర అంతర్జాతీయ ప్రమాణాలతో రింగ్ రోడ్డు వేసేం దుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ రియల్ ఎస్టేట్ నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment