జన్వాడ పార్టీ కేసులో పోలీసుల దర్యాప్తు ముమ్మరం
విజయ్ మద్దూరికి స్టేషన్ బెయిల్.. అజ్ఞాతంలో రాజ్ పాకాల
ఇద్దరూ ఠాణాలో హాజరుకావాలని సూచించిన పోలీసులు
పార్టీలో పాల్గొన్నవారికి నోటీసులు ఇచ్చి విచారించాలని నిర్ణయం
శంకర్‌పల్లి: మాజీ మంత్రి కేటీఆర్ బావమరిది రాజ్ పాకాల ఇంట్లో అనుమతి లేని పార్టీ నిర్వహణ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. అనుమతి లేకుండా మద్యం పార్టీ నిర్వహించారనే కారణంతో రాజ్ పాకాల (51)తోపాటు, కొకైన్ తీసుకున్నట్టు నిర్ధారణ అయిన విజయ్ మద్దూరి (56)పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆదివారం రాత్రి విజయ్ మద్దూరికి 41 సీఆర్‌పీసీ కింద పోలీసులు నోటీసులు ఇచ్చి, స్టేషన్ బెయిల్‌పై విడుదల చేశారు.
విచారణ నిమిత్తం సోమవారం పోలీస్‌స్టేషన్‌కు రావాలని వారు సూచించినా.. ఆయన సాయంత్రం వరకు కూడా స్టేషన్‌కు రాలేదు. ఇక శనివారం రాత్రి పార్టీ నుంచి వెళ్లిపోయిన రాజ్ పాకాల అజ్ఞాతంలోకి వెళ్లారు. ఈ నేపథ్యంలో మోకిల పోలీసులు సోమవారం దర్యాప్తు కోసం రాయదుర్గంలోని రాజ్ పాకాల నివాసానికి వెళ్లారు. తాళం వేసి ఉండటంతో ఇంటి బయట నోటీసులు అతికించారు.
సోమవారం రాత్రి 11 గంటలకల్లా తమ ముందు విచారణకు హాజరు కావాలని అందులో పేర్కొన్నారు. మరోవైపు ఈ కేసు విషయంలో రాజ్ పాకాల హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. తాను 48 గంటల్లో విచారణకు హాజరవుతానని పేర్కొంటూ న్యాయవాదుల ద్వారా పోలీసులకు లేఖ అందజేశారు.
ఇంటికి అనుమతులు లేవన్న అధికారులు
రాజ్ పాకాలకు రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మండలం జన్వాడ గ్రామ పరిధిలోని సర్వే 691, 692 లలో శ్రీమాతే ప్రాపర్టీస్ పేరుతో సుమారు 8 ఎకరాల భూమి ఉంది. అందులో దాదాపు 1,500 గజాల విస్తీర్ణంలో జీ+1 ఇంటి నిర్మాణం చేపట్టారు. జన్వాడ గ్రామం 111 జీవో పరిధిలో ఉండటంతో ఇంటి నిర్మాణానికి అనుమతులు ఇవ్వలేదని అధికారులు చెప్తున్నారు. దీంతో ఈ ఇంటికి శ్రీమాతే ప్రాపర్టీస్ పేరుతో 7– 90 ఇంటి నంబర్‌తో పంచాయతీకి పన్ను చెల్లిస్తున్నట్టు తెలిసింది.
పార్టీలో పాల్గొన్నవారి విచారణ
రాజ్ పాకాల ఇంట్లో పార్టీకి హాజరైన వారందరికీ పోలీసులు నోటీసులు ఇచ్చి విచారించనున్నారు. ఇప్పటికే ముగ్గురికి నోటీసులిచ్చి విచారించగా.. మరో ముగ్గురు స్వచ్ఛందంగా పీఎస్‌కు వచ్చి, వెళ్లినట్టు పోలీసులు తెలిపారు. మిగతా 32 మందికి రెండు రోజుల్లో నోటీసులిచ్చి, విచారిస్తామని వెల్లడించారు.
కేసుపై ఏసీపీ సమీక్ష
రాజ్ పాకాల ఇంట్లో పార్టీ కేసును నార్సింగి ఏసీపీ రమణగౌడ్ పర్యవేక్షిస్తున్నారు. సోమవారం ఆయన స్టేషన్‌కు వచ్చి, కేసు దర్యాప్తు తీరు, ఇతర వివరాలను తెలుసుకున్నారు. రాజ్ పాకాల, విజయ్ మద్దూరి విచారణకు హాజరుకాకపోతే తీసుకోవాల్సిన తదుపరి చర్యలపై ఆయన సూచనలు చేసినట్టు తెలిసింది. ఇక ముందస్తు చర్యల్లో భాగంగా సైబరాబాద్ కమిషనరేట్ నుంచి 10 మంది ప్రత్యేక పోలీస్ సిబ్బందిని మోకిల పీఎస్‌కు పంపించారు.
ఫోన్ సీజ్‌లో ట్విస్ట్
ఈ కేసులో కొకైన్ పాజిటివ్ వచ్చిన విజయ్ మద్దూరికి సంబంధించిన డ్రగ్ టెస్ట్ కిట్‌తోపాటు ఆయన ఫోన్‌ను సీజ్ చేసినట్లు పోలీసులు ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు. అయితే ఆ పార్టీలో పాల్గొన్న ఓ మహిళ తన ఫోన్ సీజ్ చేశారని పోలీసులకు తెలిపింది. దీంతో పోలీసులు ఆమె స్టేట్‌మెంట్‌ను రికార్డు చేసుకున్నారు.
కేసు కోర్టు పరిధిలోకి ఉన్నందున కోర్టు అనుమతి తర్వాత ఫోన్‌ను తిరిగిస్తామని వెల్లడించారు. విజయ్‌ను అదుపులోకి తీసుకునే సమయంలో ఆయన తన ఫోన్‌కు బదులు పక్కన ఉన్న మహిళ ఫోన్‌ను ఇచ్చి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment