రాయదుర్గంలోని జేఆర్‌సీ కన్వెన్షన్ సెంటర్‌లో క్రెడాయ్ హైదరాబాద్ ఆధ్వర్యంలో నిర్వహించిన రియల్ ఎస్టేట్ çసదస్సులో మాట్లాడుతున్న మంత్రి కేటీఆర్
హైదరాబాద్: నిర్మాణ రంగానికి దేశంలోనే అనువైన మహానగరం ఒక్క హైదరాబాద్ మాత్రమేనని మంత్రి కె. తారకరామారావు పేర్కొన్నారు. ఇక్కడి నిర్మాణ రంగంలో కొత్త ఉత్సాహం కనిపిస్తోందన్నారు. రాయదుర్గంలోని జేఆర్‌సీ కన్వెన్షన్ సెంటర్‌లో క్రెడాయ్ హైదరాబాద్ ఆధ్వర్యంలో రియల్ ఎస్టేట్ సదస్సును శనివారం రాత్రి నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ.. వచ్చే మూడేళ్లలో నగరంలో రూ. 50వేల కోట్ల వ్యయంతో మౌలిక వసతులు కల్పించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారన్నారు. ప్రస్తుతం నగరంలో 4 కోట్ల ఎస్‌ఎఫ్‌టీల పైచిలుకు స్పేస్ నిర్మాణంలో ఉందని, దీన్ని పూర్తి చేస్తే అనేక జాతీయ, అంతర్జాతీయ సంస్థలు నగరానికి వస్తాయన్నారు. ఈ తరుణంలో అపార్ట్‌మెంట్లు, విల్లాల అవసరం పెరుగుతుందన్నారు. నగరంలో మౌలిక వసతుల కల్పన కోసం ఎస్‌ఆర్‌డీపీ కింద ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌లు, స్కైవేల నిర్మాణం చేపట్టామన్నారు. నగరంలోని కాలుష్య పరిశ్రమలన్నింటిని రీజనల్, ఔటర్ రింగురోడ్డు మధ్యలోకి తరలిస్తామన్నారు. గత నాలుగేళ్లలో 17.17 శాతం అభివృద్ధితో దేశంలో మన రాష్ట్రం మొదటిస్థానంలో నిలిచిందన్నారు. ఆపిల్, ఫేస్‌బుక్, గూగుల్, మెక్రోసాఫ్ట్, అమెజాన్ వంటి దిగ్గజ సంస్థలు తమ ప్రధాన కేంద్రం తర్వాత హైదరాబాద్‌కే ప్రాధాన్యత ఇచ్చాయని గుర్తు చేశారు.
అపార్ట్‌మెంట్, విల్లాలవాసులు ఓటు వేయండి....
నగరంలోని అపార్ట్‌మెంట్, విల్లాల్లో నివాసముండే వారు పోలింగ్ రోజున ఓటు వేయాలని కేటీఆర్ కోరారు. పోలింగ్ రోజును అదొక సెలవు రోజుగా భావిస్తున్నారని, ఓటు వేయకుండా ఇంట్లోనే ఉంటున్నారని పేర్కొన్నారు. తాను మాత్రం టీఆర్‌ఎస్‌కే ఓటు వేయాలని కోరుతానని, కానీ వారు ఎవరికి వేసినా ఓటు హక్కును వినియోగించుకుంటే సంతోషిస్తామన్నారు. ఈ సమావేశంలో క్రెడాయ్ హైదరాబాద్ అధ్యక్షుడు ఎస్. రాంరెడ్డి, ప్రధాన కార్యదర్శి రామకృష్ణారెడ్డి, క్రెడాయ్ తెలంగాణ అధ్యక్షుడు జి.రాంరెడ్డి, ఈసీ సభ్యులు ప్రదీప్‌రెడ్డి, తెలంగాణ డెవలపర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు జీవీ రావు, ట్రెడా అధ్యక్షుడు పి. రవీందర్‌రావు, బిల్డర్స్ ఫెడరేషన్ అధ్యక్షుడు ప్రభాకర్‌రావు 1,500 మంది డెవలపర్లు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు పాల్గొన్నారు.
మెట్రోను నగరమంతా విస్తరిస్తాం
మెట్రో నిర్మాణం ద్వారా కూడా నగరంలో రియల్ ఎస్టేట్ మరింతగా పుంజుకునే అవకాశం ఉందని, అందుకే నగరమంతా మెట్రోను విస్తరించాలని నిర్ణయించామని కేటీఆర్ తెలిపారు. చందానగర్ నుంచి పాత ముంబై రోడ్డు మీదుగా నాంపల్లి వరకు 26 కిలోమీటర్ల మెట్రో, హైటెక్ సిటీ నుంచి గచ్చిబౌలి మీదుగా శంషాబాద్ విమానాశ్రయానికి మెట్రోను విస్తరించాలని నిర్ణయించినట్లు చెప్పారు. అలాగే ఎల్‌బీ నగర్ నుంచి హయత్‌నగర్ మీదుగా ఫలక్‌నుమా, అక్కడి నుంచి శంషాబాద్ వరకు మెట్రోను విస్తరించాలని, అంతేకాకుండా ఈసీఐఎల్ వరకు కూడా మెట్రోను తీసుకెళ్లాలని ప్రణాళిక రూపొందించుకున్నామని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment