సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై కొన్ని సర్వే సంస్థలు ఎగ్జిట్ పోల్స్ రిజల్ట్స్ వెల్లడించిన సంగతి తెలిసిందే. అన్ని సర్వేల ఫలితాలు కూడా తెలంగాణలో టీఆర్‌ఎస్ రెండోసారి అధికారంలోకి వస్తుందని స్పష్టం చేయగా.. లగడపాటి రాజగోపాల్ మాత్రం అందుకు భిన్నమైన సర్వే ఫలితాలను ప్రకటించారు. కూటమి అధికారాన్ని కైవసం చేసుకోనుందని తెలిపారు. అయితే, లగడపాటి సర్వేను మంత్రి కేటీఆర్ తిప్పికొట్టారు. ‘ఎట్టిపరిస్థితుల్లో తెలంగాణ రాదని లగడపాటి చెప్పాడు. మరి రాలేదా. అసలు ఆయన సర్వేనే చేయలేదు. ఏదో సోది చెప్పినట్టుగా చెప్పాడు. తెలంగాణ దెబ్బకు ఆయనకు రాజకీయం సన్యాసం అయింది. ఇప్పుడు సర్వేల సన్యాసం కూడా అవుతుంది’ అని కేటీఆర్ చురకలంటించారు. పార్టీ కార్యాలయంలో శనివారం కేటీఆర్ మీడియాతో చిట్‌చాట్ నిర్వహించారు.
పోలింగ్ పెరగడం మాకే అనుకూలం..
తెలంగాణ ప్రజలు టీఆర్‌ఎస్‌ను మరోమారు ఆశీర్వదించారని మంత్రి కేటీఆర్ అన్నారు. దాదాపు 73 శాతానికి పైగా పోలింగ్ నమోదవడం టీఆర్‌ఎస్ పార్టీ విజయానికి సంకేతమని వ్యాఖ్యానించారు. యావత్ తెలంగాణ ప్రజలు చైతన్యాన్ని, విజ్ఞతను ప్రదర్శించి ఓటు వేసినందుకు ధన్యవాదాలు తెలిపారు. పెద్ద ఎత్తున మహిళలు, వయోజనులు ఓటింగ్‌లో పాల్గొని టీఆర్‌ఎస్‌కు మద్దతుగా నిలిచారని పేర్కొన్నారు. మూడింట రెండొంతుల సీట్లు గెలుచుకొని తమ పార్టీ ప్రభుత్వాన్ని నెలకొల్పుతుందని ధీమా వ్యక్తం చేశారు. 90 రోజులపాటు నిరంతరం పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలు, అభిమానులు డిసెంబర్ 11న సంబరాలకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. కౌంటింగ్ ప్రక్రియ రోజున చివరి ఓటు లెక్కించే వరకు అభ్యర్థులు, కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.ఎన్నికలు ప్రజాస్వామ్యబద్ధంగా, శాంతియుతంగా జరిగాయనీ, ఎన్నికల ప్రక్రియలో పనిచేసిన ఎన్నికల అధికారులు, పోలీసు సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు.
మరెందుకు ప్రచారం చేయలేదు..
‘కాంగ్రెస్‌లో ముఖ్యమంత్రి అభ్యర్థిగా చెప్పుకున్నవాళ్లు, హేమాహేమీలు.. వాళ్ల సొంత నియోజకవర్గాన్ని దాటి బయటికి రాలేదు. ఓటమి భయంతో సొంత నియోజకవర్గంలోనే తిష్ట వేశారు. ఇది చాలదా టీఆర్‌ఎస్ ప్రభంజనం ఏంటో తెలియడానికి’ అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. చంద్రబాబు మొహం చూస్తే ఓట్లు రాలవని గ్రహించిన కూటమి నాయకులు చివరిరెండు రోజుల్లో పేపర్ ప్రకటనల్లో ఆయన ఫొటోను వేయలేకపోయారని చురకలంటించారు. గజ్వెల్‌లో కేసీఆర్ 75 వేల భారీ మెజారిటీతో గెలుస్తాడని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్ల తరపున ప్రచారం చేయడానికి మరో స్టార్ కావాలని ఎద్దేవా చేశారు.
Comments
Please login to add a commentAdd a comment