మాట్లాడుతున్న మంత్రి కేటీఆర్
సాక్షి, మహబూబాబాద్: సీట్ల కోసం కాంగ్రెస్ సన్నాసులు చంద్రబాబు దగ్గర చేతులు కట్టుకొని నిలబడ్డారని మంత్రి కె.తారకరామారావు ధ్వజమెత్తారు. పొరపాటున ఈ దద్దమ్మలకు ఓటు వేసి అధికారంలోకి తీసుకొస్తే నిర్ణయాలు హైదరాబాద్‌లో కాదు.. అమరావతిలో తీసుకుంటారని చెప్పారు. మహబూ బాబాద్, డోర్నకల్ నియోజకవర్గాల్లో శనివారం నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభల్లో మంత్రి మాట్లాడారు. ఈ సందర్భంగా కాంగ్రెస్, టీడీపీలపై నిప్పు లు చెరిగారు. ‘‘చంద్రబాబు ఢిల్లీలో రాహుల్ గాంధీ ని కలిసేందుకు ఆంధ్రా భవన్‌లో ఉన్నడు. తెలంగాణ కాంగ్రెసోళ్లు ఏపీ భవన్ ఎదుట క్యూ కట్టారు. చంద్రబాబు వీళ్ల సీట్ల కోసం సిఫారసు చేయాల్నట. ఇంత దౌర్భాగ్యం ఎక్కడైనా ఉంటుందా? పరిస్థితి ఈ రోజే ఇట్ల ఉంటే రేపు అధికారంలోకి వస్తే ఎట్ల ఉంటదో ప్రజలు ఆలోచించాలి’’అని కోరారు. సీట్లు రాహుల్ గాంధీ ఇస్తే.. చంద్రబాబు నోట్లు ఇస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు సోనియా గాంధీని అవినీతి అనకొండ, గాడ్సే అన్నడు. గన్ని తిట్లు తిట్టిన చంద్ర బాబు దగ్గరకు పోయి ఆయన మోచేతి నీళ్లు తాగేందుకు కాంగ్రెసోళ్లకు సిగ్గు లేదా’అని ప్రశ్నించారు.
కాంగ్రెస్‌లో 40 మంది సీఎంలు
ఒకవేళ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే అందులో 40 మంది సీఎంలు కుర్చీలాట ఆడుకుంటారని కేటీఆర్ ఎద్దేవా చేశారు. అసలు కాంగ్రెస్ సీఎం ఎవరు? మీ కూటమికి నాయకుడు ఎవరు? అని మంత్రి ప్రశ్నిం చారు. ‘‘24 గంటల కరెంట్ ఇచ్చిన కేసీఆర్ ఇటు దిక్కుంటే, కరెంట్ అడిగితే కాల్చి చంపినోళ్లు ఇంకో దిక్కున్నారు.. వ్యవసాయం దండగ అన్న చంద్రబాబు అటు దిక్కునుంటే.. వ్యవసాయం పండుగన్న కేసీఆర్ ఇటు దిక్కునున్నారు... ఏ దిక్కునుంటారో ప్రజలు నిర్ణయించుకోవాలి’అని కేటీఆర్ కోరారు. రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం పథకాలు ఆగకూడదంటే కారు జోరు తగ్గొద్దని, డ్రైవర్ కేసీఆర్ ప్రభుత్వమే ఏర్పడాలని కేటీఆర్ అన్నా రు.
ఎన్నికల కమిషన్ కూడా చూసే గుర్తులిచ్చింది
ఎన్నికల కమిషన్ కూడా ఎవరేంటో చూసే గుర్తులు కేటాయించిందని కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్‌కు మొండి చెయ్యి ఇచ్చింది. 70 ఏళ్లలో ఆ పార్టీ దేశప్రజలకు మొండి చెయ్యి చూపించిందని గుర్తు చేశారు. ప్రజల చెవుల్లో అద్భుతంగా పువ్వులు పెట్టినందుకు బీజేపీకి పువ్వు గుర్తు. పుల్లలు పెట్టడంలో దిట్ట కాబట్టి కోదండరాం పార్టీకి అగ్గిపెట్టె గుర్తు, అభివృద్ధిలో దూసుకెళ్తుందనే నమ్మకంతోనే మనకు కారు గుర్తు ఇచ్చినట్లు కేటీఆర్ చలోక్తులు విసిరారు. ఆయా సభల్లో ఎంపీలు పసునూరి దయాకర్‌రావు, బండా ప్రకాశ్, తాజా మాజీ ఎమ్మెల్యేలు శంకర్‌నాయక్, రెడ్యానాయక్, తదితరులు పాల్గొన్నారు.
దేశం వెనుకబాటుకు కాంగ్రెసే కారణం..
సాక్షి, హైదరాబాద్: దేశం వెనుకబాటుకు కాంగ్రెస్ పార్టీయే కారణమని మంత్రి కే.తారకరామారావు అన్నారు. శనివారం ఇక్కడ జరిగిన స్పిరిట్ ఆఫ్ హైదరాబాద్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం మాట్లాడుతూ.. దేశ చరిత్రలో అత్యధిక కాలం పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ ప్రజల కనీస అవసరాలను గుర్తించడంలో, వాటిని అందించడంలో పూర్తిగా విఫలమైందన్నారు. టీఆర్‌ఎస్‌ను కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసి ఉంటే కచ్చితంగా తాను రాజకీయాల నుంచి వైదొలగే వాడినని, తన కుటుంబ సభ్యులకు సైతం ఇదే విషయాన్ని తేల్చి చెప్పానన్నారు. తెలంగాణ రాష్ట్రంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత విద్యుత్, తాగునీరు, సాగునీరు వంటి అంశాలను ప్రాధాన్యత అంశాలుగా ఎంచుకొని వాటిని సాధించే దిశగా ముందుకు పోతున్నామన్నారు. దేశ రాజకీయాల్లో పార్లమెంట్ ఎన్నికల తర్వాత తెలంగాణ రాష్ట్ర సమితి కీలకమైన పాత్ర వహించే అవకాశం ఉన్నదని కేటీఆర్ అన్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రతి ఒక్కరు ఓటుహక్కును వినియోగించుకోవాలని, ఓటు వేయని వారికి ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు ఉండదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. ఓటు హక్కును వినియోగించుకుంటామని అందరితో ప్రతిజ్ఞ చేయించారు.
Comments
Please login to add a commentAdd a comment