
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణలో అధికారం కోసం ప్రతిపక్షాలు ప్రాంతీయ విద్వేశాలు రెచ్చగొడుతున్నాయని ఆపధర్మ మంత్రి కేటీఆర్ అన్నారు. తెలంగాణ వస్తే సీమాంద్రులను తరిమేస్తారంటూ కొందరు ప్రచారం చేశారని.. కానీ నాలుగున్నరేళ్లలో వారికి ఎలాంటి అపకారం కూడా చేయ్యలేదని పేర్కొన్నారు. శనివారం కుకట్‌పల్లిలో జరిగిన సీమాంద్రుల ఆత్మీయ సమ్మెళనంలో కేటీఆర్‌లో పాల్గొని ప్రసంగించారు. 2014లో టీడీపీకి వేసిన ఓట్లు ఆపార్టీపై ప్రేమతో వేసినవి కాదని.. టీఆర్‌ఎస్‌కి బయపడి టీడీపీకి ఓటేశారని ఆయన గుర్తుచేశారు. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితులు లేవని టీఆర్‌ఎస్‌ను ప్రజలందరూ విశ్వసిస్తున్నారని వ్యాఖ్యానించారు.
టీఆర్‌ఎస్ పాలనలో రాయలసీమ, ఆంధ్రావారిని కడుపులో పెట్టుకుని చూసుకున్నామని.. హైదరాబాద్‌లో శాంతి భద్రతలకు లోటులేకుండా చూశామని అన్నారు. ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిపై జరిగిన దాడిపై స్పందిస్తే చంద్రబాబు నాయుడు పెద్ద రాద్దాంతం చేశారని.. హరికృష్ణ మరణించినప్పుడు కూడా ఇలాగే స్పందించామని ఆయన గుర్తుచేశారు. మనుషులపై దాడులు జరిగినప్పుడు స్పందిస్తే తప్పేంటన్నారు. ఆంధ్రా ప్రజలంటే తమకు ఎలాంటి వివక్ష లేదని.. కాంగ్రెస్, టీడీపీ పొత్తు చూస్తే ఎన్టీఆర్ ఆత్మ క్షోభిస్తుందని పేర్కొన్నారు.
ఎన్టీఆర్‌కు బతికున్నప్పుడు ఒక్కసారి.. చనిపోయిన తరువాత మరోసారి చంద్రబాబు వెన్నుపోటు పొడిచారని విమర్శించారు. పదేళ్లలో హైదరాబాద్‌ను అభివృద్ది చేశానని చంద్రబాబు గొప్పలు చెప్తున్నారని.. ఐదేళ్లలో అమరావతిని ఎందుకు పూర్తి చేయలేకపోయారని కేటీఆర్ ప్రశ్నించారు. సోనియా గాంధీకి ఆరోగ్యం బాగోలేకున్నా కాంగ్రెస్ నేతలు ప్రచారానికి తీసుకువచ్చి ఆమెతో అబద్దాలు చెప్పించారని మండిపడ్డారు. ఎవరెన్ని కుట్రలు చేసినా ప్రజలంతా టీఆర్‌ఎస్ పక్షానే ఉంటారని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment