
సాక్షి, హైదరాబాద్ : టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుపై తెలంగాణ ఆపద్ధర్మ మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు సంగతి తేల్చడానికి అవసరమైతే ఆంధ్ర రాజకీయాల్లో జోక్యం చేసుకుంటామని హెచ్చరించారు. శనివారం ఎన్నికల ప్రచారంలో భాగంగా కూకట్‌పల్లిలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ఓటుకు కోట్లు కేసులో అడ్డంగా దొరికింది చంద్రబాబు కాదా? అని ప్రశ్నించారు. మనవాళ్లు బ్రీఫ్ డ్ మీ అన్నది ఎవరని, తన వాయిస్ కాదని చంద్రబాబు ఎందుకు చెప్పలేకపోతున్నారని నిలదీశారు. దీనిపై ఇప్పటి వరకు చంద్రబాబు ఎందుకు స్పందించలేదని దుయ్యబట్టారు. నాలుగు బిల్డింగ్‌లు కట్టి హైదరాబాద్‌ను నిర్మించానని అంటావా? అని ఫైర్ అయ్యారు. హైదరాబాద్‌లో ప్రతి ఒక్కరికి నివసించే హక్కు ఉందన్నారు.
పొత్తులు లేకుంటే ఎన్నటికి గెలవలేనని చంద్రబాబుకు తెలుసని, కులాల పేరిట చిచ్చు పెట్టాలని ప్రయత్నిస్తున్నారని, వాటిని తిప్పికొడతామన్నారు. ఎవరిని రాజకీయంగా దెబ్బతీసేందుకు సుహాసినికి టికెట్ ఇచ్చారో అందరికీ తెలుసన్నారు. నందమూరి కుటుంబం మీద అంత ప్రేమ ఉంటే తమ కొడుకును మంత్రిని చేసినట్లు ఆమెను కూడా చేయవచ్చు కదా? అని ప్రశ్నించారు. ఏపీతో ఏనాడు తాము తగదాలు కోరుకోలేదని, అమరావతి నిర్మాణానికి తెలంగాణ సహాయంగా.. రూ. 100 కోట్లు ఇద్దామనుకున్నామని, కానీ ప్రధాని మోదీ నీళ్లు, మట్టి ఇవ్వడంతో మౌనంగా ఉండిపోయామన్నారు. నందమూరి హరికృష్ణ అంత్యక్రియలు అధికారిక లాంఛనలతో జరిపించామని, సీఎం కేసీఆర్ స్వయంగా హాజరయ్యారని కూడా గుర్తు చేశారు. ఎన్నికల ఫలితాల తర్వాత రాహుల్, చంద్రబాబులు ఫిడెల్ వాయించుకోవడమేనని జోస్యం చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment