
సాక్షి, హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకి నందమూరి కుటుంబంపై ప్రేమ ఉంటే.. నందమూరి సుహాసినికి ఏపీలో మంత్రి పదవి ఇవ్వవచ్చు కదా అని తెలంగాణ ఆపద్ధర్మ మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. కేవలం నందమూరి కుటుంబాన్ని బలిపశువులను చేసేందుకే కూకట్‌పల్లి నుంచి సుహాసినిని నిలబెడుతున్నారని మండిపడ్డారు. గురువారం ఆయన కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డ్ వద్ద జరిగిన బహిరంగ సభలో ప్రసంగించారు. బాబుకు దమ్ముంటే నారా లోకేష్‌ను అభ్యర్థిగా నిలబెట్టాలని సవాల్ విసిరారు. గత ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీపై అనేక రకాల ఆరోపణలు చేశారన్నారు. టీఆర్‌ఎస్ అధికారంలోకి వస్తే ఆంధ్రా, రాయలసీమ ప్రజలపై వివక్ష చూపుతారని కాంగ్రెస్ దుష్ప్రచారం చేసిందని పేర్కొన్నారు.
కేసీఆర్ పాలనలో ఎప్పుడైనా ఆంధ్రా ప్రజలకు ఇబ్బంది కలిగిందా అని ప్రశ్నించారు. వృద్ధులకు, వికలాంగులకు ప్రతినెలా పింఛన్ వచ్చేలా, కల్యాణ లక్ష్మీ, షాది ముభారక్, కంటి వెలుగు లాంటి అనేక పథకాలను పెట్టామని తెలిపారు. రేపటి రోజు అధికారంలోకి రాగానే వృద్ధులకు, వికలాంగులకు పింఛన్ పెంచుతున్నామని చెప్పారు. ప్రభుత్వ ఆసుపత్రులను అభివృద్ధి చేశామన్నారు. 30 శాతం వరకు ప్రసూతి కేంద్రాలకు వచ్చే వారి సంఖ్య పెరిగిందని వెల్లడించారు. ఆరోగ్య లక్ష్మీ, అమ్మబడి, రెసిడెన్సియల్ స్కూల్ నిర్మాణాలను ప్రవేశపెట్టామన్నారు. ఎకరానికి 8 వేల రూపాయలు ఇస్తూ రైతు బంధు పథకం తీసుకొచ్చామని తెలిపారు. కూకట్‌పల్లిలో 4 వేల కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామన్నారు. పాము, ముంగిస స్నేహం చేసినట్లు.. టీడీపీ, కాంగ్రెస్ కలిశాయని ఎద్దేవా చేశారు. టీడీపీ చంద్రబాబునాయుడు, కాంగ్రెస్ రాహుల్ ఒకరి కండువాలు ఒకరు వేసుకుంటున్నారన్నారు. టీడీపీ, కాంగ్రెస్ ఏ ప్రాతిపధికన పొత్తు పెట్టుకుంటున్నారో ప్రజలకు చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment