అనగనగా ఓ పెద్దమనిషి(పేరెందుకు లేండ్రి). ఒక పెద్దమనిషి ఓసారి ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్ దగ్గర ఏదో పని ఉండి పోయిండు. అంతలో ఓ పేషెంట్ ఎదురుగా వస్తుండు. ఇంతలో ఆ పెద్ద మనిషి ఆ పేషెంట్‌తో..
పెద్దమనిషి: ‘బాగున్నవా?’
పేషెంట్: బాగనే ఉన్న సర్
పెద్ద మనిషి: నన్ను గుర్తు పట్టినవా?
పేషెంట్: గుర్తువట్టలే.. ఎవరో నువ్వు నాకేం ఎరుక!
పెద్ద మనిషి: అరే.. హైదరాబాద్ నేనే కట్టినయ్య.. నన్ను గుర్తువట్టకపోవుడేంది?
పేషెంట్: సర్.. నిన్న మొన్నటిదాకా నేను గూడా వైజాగ్‌కు సముద్రం తెచ్చిన అని చెప్పుకున్నా. నువ్వు కూడా జల్ది మందులేసుకో నయం అయిపోతది!
ఈ పిట్టకథతో.. తెలంగాణ వర్షాకాల అసెంబ్లీ సమావేశాల్లో మంత్రి కేటీఆర్, ఇండైరెక్ట్‌గా ఉమ్మడి ఏపీ మాజీ ముఖ్యమంత్రి.. టీడీపీ అధినేత చంద్రబాబును ఉద్దేశించి ఇజ్జత్ తీసిపారేసిండు. ‘‘చాలామంది చిత్రమైన మాటలు మాట్లాడతరు. 450 సంవత్సరాల చరిత్ర ఉన్న హైదరాబాద్‌ను నేను కట్టినా నేను కట్టినా అని చెప్పుకుంటరు. మీరెప్పుడొచ్చిండ్రు సార్. మీరెక్కడోళ్లు.. 1956 తర్వాతే కదా మీరొచ్చింది. అంతకు ముందు ఏం లేన్నట్లు.. గతంలో ఉన్నోళ్లు ఏం చేయనట్లు.. మొత్తం మీరే చేసినట్లు..’’ అంటూ కేటీఆర్ వ్యాఖ్యలు చేశారు. మరి ఆ పెద్దమనిషి మందులేసుకునేందుకు ఇంట్రెస్ట్ జూపిస్తలేడేమో.. మళ్లొచ్చిండు.
వచ్చినోడు ఊకున్నడా అంటే.. లే!. ‘‘నా పోరాటం వల్లే హైదరాబాద్ ఇలా ఉంది. హైదరాబాద్ 1995లో ప్రారంభమైంది. తెలంగాణ ప్రజలందరూ నేడు లబ్ధిపొందుతున్నారు. అది ఆరోజు ఇచ్చిన భిక్ష’’ అంటూ తెలంగాణ ప్రజలకు మండిపోయేలా మాట్లాడిండు. ఇంక ఊకుంటరా?. రాజకీయ నేతలు, చదువుకున్నోళ్లు సోషల్ మీడియా చంద్రన్నపై కామెంట్ల మీద కామెంట్లు చేస్తుండ్రు. భిక్ష అనే పదం వాడడం మరింత మండిపోయేలా జేస్తోంది. అంత విజన్ ఉన్నోనివి.. ఆంధ్రప్రదేశ్‌ని ఐదేళ్లు ఏం చేసినవని, కనీసం ఇప్పటికికూడా ఏపీలో ఇల్లు లేకపాయే! అంటూ సక్కటి సురుకులతో విరుసుకుపడుతున్నరు. గప్పాలు కొట్టుకునుడు ఇంకెప్పుడు బంజేత్తడో.. ఇంకెప్పుడు మారతడో ఈ పెద్దమనిషి అంటూ జాలి పడుతున్నరు కొందరు.
ఇదీ చదవండి: కాంగ్రెస్ అధికారంలోకి వస్తే అవినీతి కుంభమేళానే!
Comments
Please login to add a commentAdd a comment