మున్సిపల్‌ ఎన్నికల్లో దూకుడుగా వెళదాం | KTR Says Lets Go Aggressively In Comming Municipal Elections | Sakshi
Sakshi News home page

మున్సిపల్‌ ఎన్నికల్లో దూకుడుగా వెళదాం

Published Thu, Aug 29 2019 2:19 AM | Last Updated on Thu, Aug 29 2019 4:57 AM

KTR Says Lets Go Aggressively In Comming Municipal Elections - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ‘పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసుకుని, దేశంలోనే ఎక్కువ సభ్యత్వాలున్న ప్రాంతీయపార్టీగా అవతరించాం. ఈ నెల 31లోగా పార్టీ సంస్థాగత కమిటీల నిర్మాణం పూర్తయ్యేలా చూద్దాం. మున్సిపల్‌ ఎన్నికలు ఏ క్షణంలో జరిగినా ఎదుర్కొనేందుకు టీఆర్‌ఎస్‌ సిద్ధంగా ఉంది. క్షేత్ర స్థాయిలో పార్టీ యంత్రాంగాన్ని సమన్వయం చేసి ముందుకు నడపడమే మన ముందున్న తక్షణ కర్తవ్యం. మునిసిపల్‌ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ నుంచి నామమాత్ర పోటీయే ఉంటుంది. మున్సిపల్‌ ఎన్నికల్లో దూకుడుగా వెళదాం’అని టీఆ ర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ పార్టీ ముఖ్యనేతలకు దిశానిర్దేశం చేశారు.

తెలంగాణ భవన్‌లో బుధవారం టీఆర్‌ఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులతో కేటీఆర్‌ సుదీర్ఘ సమావేశం నిర్వహించారు. ఉదయం 10.30 నుంచి సాయం త్రం 4గంటల వరకు జరిగిన ఈ సమావేశంలో పార్టీ సభ్యత్వ నమోదు, సంస్థాగత కమిటీల నిర్మాణం, పార్టీ కార్యాలయ భవనాల నిర్మాణం, మునిసిపల్‌ ఎన్నికల పై కేటీఆర్‌ సమీక్ష నిర్వహించారు. మున్సిపల్‌ ఎన్నికల్లో పార్టీ యంత్రాంగా న్ని సమాయత్తం చేసేందుకు అనుసరించాల్సిన వ్యూహం పై పార్టీ ప్రధాన కార్యదర్శులకు మార్గదర్శనం చేశారు. 

వచ్చే నెలలో సన్నాహకాలు 
పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం పూర్తయిన నేపథ్యంలో.. ఈ నెల 31 లోగా సంస్థాగత కమిటీల నిర్మాణం పూర్తి చేయాలని కేటీఆర్‌ ఆదేశించారు. ఇప్పటికే గ్రామ, మండల కమిటీల నిర్మాణం జరగడంతో.. నూతన కమిటీల వివరాలను పార్టీ కేంద్ర కార్యాలయానికి పంపించాలన్నారు. మునిసిపాలిటీల్లోనూ వార్డు, బూత్‌ స్థాయి కమిటీల ఏర్పాటును నెలాఖరులోగా పూర్తి చేయాలని గడువు విధించారు. సెప్టెంబర్‌ మొదటి వారం నుంచి అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా సమావేశాలు నిర్వహించాలని, ఈ సమావేశాలను మున్సిపల్‌ ఎన్నికల సన్నాహకాల కోసం ఉపయోగపడేలా చూడాలన్నారు. ఈ సమావేశాలకు ఎంపీలు, ఎమ్మెల్యేలతో పాటు నియోజకవర్గానికి చెందిన మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు, మాజీ జడ్పీ చైర్మన్లను కూడా తప్పనిసరిగా ఆహ్వానించాలని నొక్కి చెప్పారు. 

భవన నిర్మాణ పర్యవేక్షణకు నలుగురితో కమిటీ 
జిల్లా కేంద్రాల్లో నిర్మిస్తున్న టీఆర్‌ఎస్‌ కార్యాలయ భవన నిర్మాణాల పనులపై కూడా కేటీఆర్‌ సమీక్ష నిర్వహించారు. వర్షాలు, ఇతర కారణాలతో అక్కడక్కడా పనులకు అవాంతరాలు ఎదురవుతున్నా గడువులోగా పనులు పూర్తి చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు పార్టీ ప్రధాన కార్యదర్శులు వెల్లడించారు. కార్యాలయ భవన నిర్మాణ పనుల పర్యవేక్షణకు నలుగురితో కమిటీ వేస్తున్నట్లు ప్రకటించారు. ఈ కమిటీలో రాజ్యసభ సభ్యులు సంతోష్‌కుమార్, ఎమ్మెల్సీలు శేరి సుభాష్‌రెడ్డి, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రావణ్‌కుమార్‌ రెడ్డి సభ్యులుగా ఉంటారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement