సాక్షి, హైదరాబాద్: మహాకూటమి తరపున కూకట్‌పల్లి టీడీపీ అభ్యర్థిగా నందమూరి హరికృష్ణ కుమార్తె సుహాసినిని ఖరారు చేయడంపై ఆ నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కూటమి పొత్తులో భాగంగా కూకట్‌పల్లి స్థానాన్ని టీడీపీకి కేటాయించిన సంగతి తెలిసిందే. ఈ సీటును తొలుత టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు పెద్దిరెడ్డికి కేటాయిస్తారనే ప్రచారం జరిగినప్పటికీ.. అనూహ్యంగా సుహాసినిని తమ అభ్యర్థిగా టీడీపీ ప్రకటించింది. నందమూరి కుటుంబానికి టికెట్ కేటాయించడం వల్ల సానుభూతిని పొందవచ్చనే కారణంతోనే ఆ పార్టీ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. (కూకట్‌పల్లి టీడీపీ అభ్యర్థిగా నందమూరి సుహాసిని)
ఈ టికెట్‌ను స్థానికులకు కాకుండా నందమూరి ఫ్యామిలీకి కేటాయించడాన్ని వ్యతిరేకిస్తూ.. కాంగ్రెస్ నాయకులు కేపీహెచ్‌బీ రోడ్ నంబర్ 1లోని గాంధీ విగ్రహం వద్ద నిరసనకు దిగారు. కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి నియోజకవర్గాల్లో కమ్మ సామాజిక వర్గానికి చెందిన నేతలకు టికెట్ కేటాయించడంపై కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఎన్నికల్లో తమ తరపున సమర్ధుడైన నాయకుడు రెబల్‌గా బరిలో నిలుస్తారని ప్రకటించారు. సుహాసినిని చిత్తు చిత్తుగా ఓడిస్తామని హెచ్చరించారు. చంద్రబాబు నాయుడు కుట్ర రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు కుల రాజకీయాల్లో ఆంధ్రలో చేసుకోవాలని.. తెలంగాణలో కాదంటూ హితవు పలికారు.
Comments
Please login to add a commentAdd a comment